బుధవారం 03 జూన్ 2020
Business - May 15, 2020 , 09:21:07

నిరాశపర్చిన నిర్మల

నిరాశపర్చిన నిర్మల

  • ఆర్థిక ప్యాకేజీపై తెలంగాణ నిర్మాణ సంఘాల అసంతృప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిధుల్లేక కునారిల్లుతున్న నిర్మాణ రంగాన్ని కేంద్రం పట్టించుకోవట్లేదని తెలంగాణ నిర్మాణ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అధిక శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాల్నిస్తున్న ఈ రంగానికి మౌలిక సదుపాయాల హోదాను మంజూరు చేయాలని కోరుతున్నా వినట్లేదని విమర్శిస్తున్నాయి. కొవిడ్‌-19 సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ప్రపంచ దేశాలు సానుకూల నిర్ణయాల్ని తీసుకుంటున్నా.. కేంద్రం ఈ దిశగా ఎలాంటి చర్యల్ని తీసుకోవడం లేదని టెర్మినస్‌ ఇన్‌ఫ్రా సీఎండీ ఎస్పీ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విమానయాన, ఆతిథ్య, రియల్‌ రంగాన్ని నిలబెట్టేలా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. క్రెడిట్‌ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీం ఇదివరకే అమల్లో ఉన్నదని.. వాస్తవికతకు దూరంగా కనిపిస్తున్నదని కొందరు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు.

 ఇక నిర్మాణాల్ని చేపట్టేందుకు నిర్మాణ సంస్థలకిచ్చే రుణాల్ని ప్రాధాన్యతా విభాగంలోకి చేర్చాలని, ఇండ్లను కొనేవారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలను ప్రకటించాలని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రాంరెడ్డి డిమాండ్‌ చేశారు. మరోవైపు సీఎల్‌ఎస్‌ఎస్‌ పథకాన్ని పొడిగించడం వల్ల రూ.70 వేల కోట్ల నిధులు అందుబాటు గృహాల విభాగంలోకి వస్తాయని క్రెడాయ్‌ జాతీయ చైర్మన్‌ జక్సేషా తెలిపారు. నగరాల్లో నివసించే వలస కార్మికులకు అందుబాటు ధరలో అద్దె ఇండ్లను అందజేయాలన్న నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని సీబీఆర్‌ఈ దక్షిణాసియా చైర్మన్‌ అన్షుమన్‌ మ్యాగజైన్‌ తెలిపారు. కాగా, గురువారం ప్రకటించిన రూ. 3.16 లక్షల కోట్ల ప్యాకేజీని  ఎఫ్‌టీసీసీఐ స్వాగతించింది.


logo