సోమవారం 30 మార్చి 2020
Business - Jan 31, 2020 , 01:48:52

రూ.13 వేల కోట్లు స్వాహా

రూ.13 వేల కోట్లు స్వాహా
  • నకిలీ రుణగ్రహీతలు, డొల్ల సంస్థలతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మోసం
  • పీఎంఎల్‌ఏ కోర్టుకు వెల్లడించిన ఈడీ

ముంబై, జనవరి 30: నకిలీ రుణగ్రహీతలు, షెల్‌ కంపెనీల ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ భారీగా నిధులను మళ్లించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. పదేండ్లకుపైగా కాలంలో దాదాపు లక్ష మంది నకిలీ రుణగ్రహీతలను సృష్టించి వారి ద్వారా రూ.12,773 కోట్లను 79 డొల్ల సంస్థల్లోకి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తరలించినట్లు మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టుకు ఈడీ చెప్పింది. డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటైర్లెన కపిల్‌ వాధవాన్‌, ధీరజ్‌ వాధవాన్లు ఈ నిధులను అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కుడి భుజంగా ఉన్న ఇక్బాల్‌ మిర్చీకి ఇచ్చారని వెల్లడించింది. ఇక్బాల్‌ మిర్చీ నుంచి వొర్లీ (ముంబై)లో ఐదు డొల్ల కంపెనీల ద్వారా మూడు ఆస్తులను వాధవాన్లు కొనుగోలు చేశారన్నారు. వీటి విలువ పత్రాలపై రూ.111 కోట్లుగా ఉన్నప్పటికీ.. రూ.199.5 కోట్లు చెల్లించారని స్పష్టం చేసింది. హవాలా మార్గం గుండా దుబాయ్‌లో ఈ మొత్తం మిర్చీకి అందజేశారని వివరించింది. వొర్లీలోని శిథిల భవనాలను ఇక్బాల్‌ మిర్చీ ఆక్రమించి వాధవాన్లకు చెందిన సన్‌బ్లింక్‌ రియల్‌ ఎస్టేట్‌కు విక్రయించారన్నది. ఇక 2010-11లో ఫెయిత్‌ రియల్టర్స్‌, మార్వల్‌ టౌన్‌షిప్‌, ఏబుల్‌ రియల్టీ, పోసిడన్‌ రియల్టీ, రాండమ్‌ రియల్టర్స్‌కు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ రూ.1,500 కోట్ల రుణాలను ఇచ్చింది. గతేడాది జూలై వరకు ఈ రుణాలు మొండి బకాయిలుగానే చూపారని ఈడీ కోర్టుకు తెలియజేసింది. వడ్డీలతో కలిపి రూ.2,186 కోట్లకు చేరాయన్నది. కపిల్‌ వాధవాన్‌ సోమవారం అరెస్టవగా, ధీరజ్‌ వాధవాన్‌ బెయిల్‌పై బయటున్నారు. 


logo