బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 04, 2020 , 00:18:06

లగ్జరీ ఇండ్లకు గిరాకీ

లగ్జరీ ఇండ్లకు గిరాకీ
  • అరవై శాతం మందికి ఇవే కావాలి
  • పరుగులు పెడుతున్న హైదరాబాద్‌ రియల్టీ
  • విల్లాలపై పెరుగుతున్న ఇష్టం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో విలాసవంత గృహాలకు గిరాకీ క్రమేణా పెరుగుతున్నది. లగ్జరీ ఇండ్లపట్ల అధిక శాతం మంది కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. క్రెడా యి హైదరాబాద్‌ మూడు రోజుల ప్రాపర్టీ షోకు విచ్చేసిన 50 వేలకుపైగా సందర్శకుల్ని చూస్తే ఈ విషయం అర్థమైంది. అరవై శాతం మంది బహుళ అంతస్తులు, ఆకాశ హర్మ్యాల్లో నివసించడం మీదే దృష్టి కేంద్రీకరించారు. అది కూడా మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, చందానగర్‌, అప్పా జంక్షన్‌, మియాపూర్‌, తెల్లాపూర్‌ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనడానికి అమితాసక్తి చూపించారని సమాచారం. ఇరవై శాతం విల్లాల కోసం వెతకగా, మరో ఇరవై శాతం అందుబాటు ధరల్లో దొరికే ప్రాజెక్టుల గురించి అన్వేషించడం కనిపించింది. ఇంకొందరు కొత్త ప్రాజెక్టుల వైపు చూశారు. ‘ఇప్పటికే మాకో చిన్న ఇల్లు ఉన్నది. దానిపై గృహ రుణం తీరిపోయింది. ప్రస్తుతం ఇద్దరం పని చేస్తున్నాం. మా ఇద్దరి ఆఫీసులు ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. అందుకే అక్కడికి దగ్గర్లో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో ఫ్లాటు కొనడానికి వచ్చాము’ అని రామకృష్ణన్‌ దంపతులు అన్నారు. పిల్లల చదువులు, పెండ్లిళ్లు, పదవీ విరమణ తర్వాత ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నామని వివరించారు. అందుకే కొత్త ఫ్లాటైనా కొనడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కాకపోతే తమ బడ్జెట్‌ రూ.60 నుంచి రూ.70 లక్షలేనని తెలిపారు. మరికొందరేమో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి 10-15 నిమిషాల వ్యవధిలో చేరుకునే ప్రాంతాల్లో నివసించడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. తాము కోరుకున్న బడ్జెట్‌లో అపార్టుమెంట్‌ వస్తుందంటే.. 20-25 నిమిషాల దూరమైనా ప్రయాణించడానికి సిద్ధమేనంటున్నారు.


లగ్జరీ విల్లాల జోరు..

లగ్జరీ విల్లాలకూ హైదరాబాద్‌లో ఆదరణ పెరిగింది. నిన్నటివరకూ వీటిని కొనడానికి కొనుగోలుదారులు పెద్దగా వచ్చేవారు కాదు. అలాంటిది ప్రాపర్టీ షో సందర్భంగా, సుమారు ఇరవై శాతం మంది సందర్శకులు కేవలం లగ్జరీ విల్లాల కోసం అన్వేషించడం కనిపించిందని క్రెడాయి ప్రతినిధులు చెబుతున్నారు. మాదాపూర్‌, గచ్చిబౌలిలకు కనీసం 15-20 నిమిషాల్లో చేరుకునేలా ఆధునిక గృహాలుండాలని ఆశిస్తున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు ఖరీదైన లగ్జరీ విల్లాల్ని మాత్రమే నిర్మిస్తున్నాయి. ఒక్కో విల్లా ఖరీదు రూ.5 నుంచి 15 కోట్ల దాకా పలుకుతుండటం విశేషం. ఇంత ఖరీదైన గృహాల్ని కొనేవారు హైదరాబాద్‌లో ఉండటం విశేషమని పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు అంటున్నారు. ఏదిఏమైనా హైదరాబాద్‌లో లగ్జరీ గృహాల్ని కొనుగోలు చేయడానికి వేలాది సందర్శకులు విచ్చేయడం ఆనందకరంగా ఉందని చెబుతున్నారు. మరోవైపు నగరంలోని పలు ప్రధాన ప్రాంతా ల్లో ఖాళీ ప్లాట్లను కొనుగోలు చేసేందుకూ కొందరు ఆసక్తి చూపించారు. 




logo
>>>>>>