ఆదివారం 24 మే 2020
Business - Feb 09, 2020 , 23:40:34

స్థూల ఆర్థికాంశాలు కీలకం

స్థూల ఆర్థికాంశాలు కీలకం

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కూడా.. స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:గతవారంలో రాకెట్‌ వేగంతో దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు ఈవారంలో దేశీయ స్థూల ఆర్థికాంశాలు కీలకంగా మారనున్నాయి. కరోనా వైరస్‌ మరింత ఉదృతమవుతుండటం, ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. బుధవారం పారిశ్రామిక వృద్ధి గణాంకాలతోపాటు రిటైల్‌ ద్రవ్యోల్బణ సూచీ కూడా విడుదల కానున్నది.  టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు మాత్రం శుక్రవారం విడుదల కానున్నది. ఈ నెల 8న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కాబోతున్నాయి. గతవారంలో భారీగా పుంజుకున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈవారంలో నిలకడగా కొనసాగే అవకాశాలున్నాయని, కరోనా వైరస్‌ మరిన్ని దేశాలకు విస్తరిస్తే మాత్రం ఈ ప్రభావం సూచీలపై ప్రతికూల ప్రభావం పడనున్నదని మోతీలాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ హెడ్‌ సిద్దార్థ తెలిపారు. కరోనా వైరస్‌తో అంతర్జాతీయ మార్కెట్ల కదలికలపై కూడా మదుపరులు ప్రధానంగా దృష్టి సారించే వీలున్నదన్నారు. ఈ వైరస్‌ దెబ్బకు ఇప్పటి వరకు ఎనిమిది వందలకు పైగా మరణించారు. సార్వత్రిక బడ్జెట్‌, ఆర్బీఐ పాలసీ, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో గతవారంలో బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 1,406.32 పాయింట్లు లేదా 3.53 శాతం చొప్పున లాభపడింది. వీటితోపాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మా రకం విలువ కూడా ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్న అంశాలని పేర్కొంది. 


బ్లూచిప్‌ దూకుడు

 స్టాక్‌ మార్కెట్ల భారీ లాభాలతో బ్లూచిప్‌ సంస్థల మార్కెట్‌ విలువ కూడా అంతేస్థాయిలో దూసుకుపోయింది. గతవారంలో టాప్‌-10 బ్లూచిప్‌ సంస్థల విలువ నికరంగా రూ.1.57 లక్షల కోట్ల మేర పెరిగింది. వీటిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అత్యధికంగా రూ.31,981 కోట్ల మేర లాభపడటం విశేషం. కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌లు మాత్రం నష్టపోగా, మిగతా ఎనిమిది సంస్థలు అత్యధికంగా లాభపడ్డాయి. వీటిలో ఆర్‌ఐఎల్‌ రూ.31,981.45 కోట్లు అధికమై మళ్లీ రూ.9 లక్షల కోట్లు దాటి రూ.9,08,888.02 కోట్ల వద్ద ముగిసింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.23,503.35 కోట్లు పెరిగి రూ.6,80.391.85 కోట్లకు, హెచ్‌డీఎఫ్‌సీ రూ.23,385.05 కోట్ల ఎగబాకి రూ.4,16,003.19 కోట్లకు, భారతీ ఎయిర్‌టెల్‌ రూ.23,049.72 కోట్లు అధికమై రూ. 2,94,381.87 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.20,676.16 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెరిగి రూ.3,47,086.53 కోట్లకు చేరుకున్నాయి.  హెచ్‌యూఎల్‌ విలువ మరో రూ. 18,617 కోట్లు పెరిగి రూ.4,67,512.81 కోట్ల కు చేరుకోగా, ఎస్బీఐ రూ.15,484.20 కోట్లు ఎగబాకి రూ.2,86,033.80 కోట్లుగా ఉన్నది. కానీ, టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.10,656.80 కోట్లు కోల్పోగా, ఇన్ఫోసిస్‌ రూ.1,296.88 కోట్లు కోల్పోయాయి. 


ఎఫ్‌పీఐ  5 వేల కోట్ల పెట్టుబడి

విదేశీ పెట్టుబడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. వరుసగా ఆరో నెల ఫిబ్రవరిలోనూ రూ.5,177 కోట్ల మేర నిధులు చొప్పించారు. ఈ నెల 3 నుంచి 7 మధ్యకాలంలో డెబిట్‌ మార్కెట్లోకి రూ.6,350 కోట్ల పెట్టుబడులు పెట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)..ఇదే సమయంలో ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.1,172.56 కోట్ల నిధులను తరలించుకుపోయారు. నికరంగా రూ.5,177.44 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు అయింది. ఈ విషయాన్ని డిపాజిటరీ డాటా వెల్లడించింది.  గత సమీక్షలో రిజర్వు బ్యాంక్‌ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం, భవిష్యత్తులో కూడా తగ్గించే అవకాశాలు లేవని సంకేతాలు ఇవ్వడంతో విదేశీ పెట్టుబడిదారులు నిధులను కుమ్మరించడానికి ప్రధాన కారణమని మార్నింగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజరీ సీనియర్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. కరోనా దెబ్బకు చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతోపాటు ప్రపంచ వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపనున్నప్పటికీ ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కార్పొరేట్ల బాండ్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడుల పరిమితిని 9 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కూడా పెట్టుబడుల్లో వృద్ధికి పరోక్షంగా దోహదం చేసిందన్నారు.


logo