మంగళవారం 09 మార్చి 2021
Business - Jan 11, 2021 , 01:19:16

నిర్లక్ష్యమే ప్రథమ శత్రువు

నిర్లక్ష్యమే ప్రథమ శత్రువు

  • ఆర్థిక వ్యవహారాల్లో ఉపేక్ష తగదు
  • పొదుపు, మదుపు ఇప్పుడే ప్రారంభించాలి
  • మిలీనియల్స్‌ చేయకూడని పొరపాట్లు ఇవే

సమాజంలో నేడు ఎటు చూసినా జల్సారాయుళ్లే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. విందులు, వినోదాలు, విలాసాలకు భారీగా డబ్బు తగలేస్తున్నారు. భవిష్యత్‌ అవసరాల కోసం నాలుగు రాళ్లు దాచుకోవాలన్న ముందుచూపు వీరిలో ఏ మాత్రం కనిపించడంలేదు. ఈ నిర్లక్ష్య ధోరణి మిలీనియల్స్‌ (1981-96 మధ్య కాలంలో జన్మించిన వారి)లో అధికంగా ఉన్నట్లు అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల యుక్త వయసులో పెద్దగా ప్రభావం పడకపోయినప్పటికీ భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. జీవితంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సాఫీగా ముందుకు సాగాలంటే పొదుపు, మదుపు ప్రతి ఒక్కరికీ అవసరమే. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మిలీనియల్స్‌ చేసే సాధారణ తప్పిదాలు, వాటి వల్ల ఏర్పడే సమస్యలు ఏమిటంటే..

పెట్టుబడి ప్రారంభించడంలో జాప్యం

త్వరగా పెట్టుబడులు ప్రారంభించడం జీవితంలో చాలా ముఖ్యం. తద్వారా ఎక్కువ మొత్తంలో సంపదను సృష్టించుకునేందుకు వీలవుతుంది. కానీ దీనిపై చాలా మంది మిలీనియల్స్‌కు అంతగా అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటివారు ఇప్పటికైనా ఎంత త్వరగా మేల్కొంటే అంత మంచిది. ఎందుకంటే పెట్టుబడుల విషయంలో పాత తరాల వారి కంటే మిలీనియల్స్‌కు అధిక సమయం ఉంటుంది. వీరు ఎంత ఎక్కువ కాలంపాటు పెట్టుబడులను కొనసాగించగలిగితే అంత ఎక్కువ నిధిని సమకూర్చుకోగలుగుతారు. మ్యూచువల్‌ ఫండ్లు, ఈక్విటీలు, ఇండెక్స్‌ ఫండ్లు, ఈటీఎఫ్‌లు, స్తిరాస్థి లాంటి సాధనాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే రాబడులు అధికంగా ఉంటాయి.

అత్యవసర నిధిని విస్మరించడం

జీవితం అనిశ్చితితో కూడుకున్నది. కనుక ఎలాంటి విపత్కర పరిస్థితినైనా అధిగమించాలంటే అత్యవసర నిధిని సమకూర్చుకోవడం ఎవరికైనా చాలా అవసరమే. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం, వేతనంలో కోత, అనారోగ్యం, ప్రమాదాల్లాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ నిధి ఎంతో ఉపయోగపడుతుంది. రాబడి పూర్తిగా ఆగిపోవడం లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించాలంటే కనీసం ఐదారు నెలలకు సరిపడేంత అత్యవసర నిధిని కూడబెట్టుకోవాలి.

క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం

సరిగ్గా వాడుకుంటే క్రెడిట్‌ కార్డులు అత్యవసర సమయాల్లో బాగానే ఉపయోగపడతాయి. కానీ అన్ని అవసరాలకు క్రెడిట్‌ కార్డునే ఉపయోగించడం, అయిన దానికీ కాని దానికీ క్రెడిట్‌ కార్డును స్వైప్‌ చేయడం సరికాదు. ఈ అలవాటును మార్చుకోకపోతే ప్రమాదం తప్పదు. ఎందుకంటే క్రెడిట్‌ కార్డులపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్‌ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోతే వినియోగించుకున్న మొత్తానికి అధిక వడ్డీతోపాటు జరిమానా కూడా పడుతుంది. సంపాదనలో సగభాగం ఈ బకాయిలను తీర్చేందుకే సరిపోతుంది. దీంతో పెట్టుబడులు పెట్టాల్సిన సమయం వృథా అవుతుంది. కనుక రోజువారీ ఖర్చులకు, అనవసర కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డులను ఉపయోగించకూడదు.

అదుపు లేకుండా ఖర్చు చేయడం

రాబడికి మించి ఖర్చు చేయ డం మిలీనియల్స్‌ చేస్తున్న పెద్ద తప్పిదాల్లో ఒకటి. అవసరం లేకు న్నా పాత వాహనాన్ని తెగనమ్మి కొత్త దాన్ని కొనుగోలు చేయడం.. విలాసవంతమైన ఇంటిలోకి మార డం లాంటి పనుల వల్ల తాత్కాలికంగా సంతోషం లభించినప్పటికీ పొదుపునకు గండి పడుతుంది. దీంతో ఆర్థిక స్వేచ్ఛను పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దేనికి ఎంత అవసరమో గ్రహించి అంత మేరకే ఖర్చు చేయాలి. మిగిలిన సొమ్మును భవిష్యత్‌ అవసరాల కోసం దాచుకోవాలి.

రిటైర్మెంట్‌పై దృష్టి పెట్టకపోవడం

యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా మంది ఉద్యోగ విరమణ గురించి ఆలోచించరు. ‘రిటైర్మెంట్‌కు చాలా సమయం ఉందిలే.. ఇప్పుడే పొదుపు ఎందుకు? తర్వాత చూద్దాంలే’ అని భావించేవారు కొందరైతే.. పొదుపుపై అసలు ఏ మాత్రం శ్రద్ధ పెట్టనివారు మరికొందరు. ఇలాంటి వారికి భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తప్పవు. జీవితం గడుస్తున్న కొద్దీ ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. కనుక ఉద్యోగ జీవితం మొదలైనప్పుడే భవిష్యత్‌ అవసరాలపై దృష్టి సారించి రిటైర్మెంట్‌ కోసం పొదుపుపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి.

ఆరోగ్యంపై అశ్రద్ధ

బీమాతో ఆరోగ్యానికి రక్షణ కల్పించుకోవడంపై మిలీనియల్స్‌ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందో.. ఏ అనారోగ్య సమస్య ముంచుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. లేదంటే ఓవైపు అనారోగ్యం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు వెరసి జీవితాన్ని మరింత కుంగదీస్తాయి.

ఆదాయం తక్కువైనా ఐటీఆర్‌ తప్పదా?

సాధారణంగా ఆదాయం నిర్ణీత పరిమితికి మించకపోతే రిటర్ను (ఐటీఆర్‌) దాఖలు చేయాల్సిన అవసరమే ఉండదు. కానీ ఇది అందరికీ వర్తించదు. విదేశాల్లో ఆస్తులున్న, విదేశీ ఆస్తులకు వారసులైన, విదేశాల్లో ఖాతాలున్న భారతీయులు ఆదాయంతో నిమిత్తం లేకుండా విధిగా        ఐటీ రిటర్నులను దాఖలు చేయాల్సిందే. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా కరెంట్‌ ఖాతాలో రూ.కోటికి మించి నగదును డిపాజిట్‌ చేసినవారు కూడా ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. 2019 బడ్జెట్‌ ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షలకు మించి వెచ్చించినా, లక్ష రూపాయలకుపైగా విద్యుత్తు బిల్లులున్నా, పన్ను ఒప్పందాల ప్రయోజనాలు పొందుతున్నా, ట్యాక్స్‌ రిఫండ్లు అందుకుంటున్నా, వ్యక్తిగత తదితర రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఐటీఆర్‌ను దాఖలు చేయాల్సిందే. ఆర్థిక సంవత్సరంలో కనీస మినహాయింపు ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలు (అనుమతించిన కోతలు, మినహాయింపుల కోసం ప్రకటనకు ముందు) దాటిన వ్యక్తులు రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని వారు నిపుణులు చెప్తున్నారు.పసిడి బాండ్‌ రూ.5,104

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదవ విడుత సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను విక్రయించేందుకు రిజర్వుబ్యాంక్‌ సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి 15 వరకు విక్రయించనున్న ఈ బాండ్లలో గ్రాము పుత్తడి ధరను రూ.5,104గా నిర్ణయించింది. గత పది రోజుల పసిడి ధరల ఆధారంగా ఈ బాండ్‌ ధరను లెక్కగట్టింది. మరోవైపు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గ్రాము బాండ్‌పై రూ.50 రాయితీని ఇస్తున్నది. ఇలాంటి లావాదేవీలు జరిపే వారు గ్రాముకు రూ.5,054 చెల్లిస్తే సరిపోతుంది.

VIDEOS

logo