శనివారం 28 మార్చి 2020
Business - Mar 19, 2020 , 00:59:14

పొదుపరి గోడు పట్టదా..!

పొదుపరి గోడు పట్టదా..!

  • సేవింగ్స్‌పై తగ్గుతున్న వడ్డీరేట్లు
  • చిన్న మొత్తాల పొదుపు పథకాలపై రేట్ల కోతకు అవకాశం 
  • ప్రభుత్వ నిర్ణయంతో అదే బాటలో బ్యాంకర్లు? సమర్థిస్తున్న ఆర్బీఐ.. 
  • వ్యతిరేకిస్తున్న డిపాజిటర్లు

న్యూఢిల్లీ, మార్చి 18: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే త్రైమాసికానికిగాను కోతలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలకు అనుగుణంగా బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించకపోవడానికి కారణం ప్రభుత్వ పథకాల వడ్డీరేట్లతో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) వడ్డీరేట్లకున్న పోటీయేనని వాదన. ఎఫ్‌డీ ఒప్పందాలపై నిర్ణయించిన వడ్డీరేటు నేపథ్యంలోనే రుణాలపై వడ్డీరేట్ల కోతకు దిగలేకపోతున్నామని, తమకంటే ఆకర్షణీయంగా ప్రభుత్వ పథకాల్లో వడ్డీరేటు ఉంటే తాము డిపాజిట్లను నష్టపోతామన్న బ్యాంకర్ల భయం.. సగటు పొదుపరి ప్రయోజనాలను దెబ్బతీస్తున్నది. బ్యాంకర్ల ఆలోచనకు తగ్గట్లే పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎస్‌సీ) వంటి వాటిపై వడ్డీరేట్లను కేంద్రం తగ్గించే వీలుందని తెలుస్తున్నది.

సీనియర్‌ సిటిజన్స్‌కు నష్టం

సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గిస్తే వయోవృద్ధులకే ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. తమ కష్టార్జితాన్ని భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఎటువంటి హాని లేని బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనే అత్యధిక సీనియర్‌ సిటిజన్స్‌ పెడుతున్నారు. వడ్డీరేట్లు తగ్గితే వీరందరి ఆదాయం పడిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ తమ 2-3 ఏండ్ల ఎఫ్‌డీలపై గత నెల నుంచి 55 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ప్రస్తుతం 6.25 శాతం వడ్డీరేటును చెల్లిస్తున్నది. నిజానికి సేవింగ్స్‌ వడ్డీరేట్లు ఎక్కువగా ఉంటే.. ప్రభుత్వ నిధుల సమీకరణకూ ఉపయుక్తంగా ఉంటుంది. నగదు అవసరాల కోసం ఇతర మార్గాల వైపు చూడాల్సిన అవసరం ఉండదు. ద్రవ్యలోటు లక్ష్యాలూ నెరవేరుతాయి. అయితే బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించకపోతే వ్యాపార, పారిశ్రామిక రంగాలకు కరెన్సీ కష్టాలు ఎదురవుతాయి. ఇది మొత్తం దేశ జీడీపీనే దెబ్బ తీస్తుందని సర్కారు ఆందోళన. 

బంగారమే నయమా?

బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో స్టాక్‌ మార్కెట్ల వైపు చూడలేని సామాన్య మదుపరులంతా బంగారంపైనే ఆశలు పెట్టుకున్నారు. ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కలలు కంటున్నారు. అక్కెర సమయంలో ఇట్టే నగదుగా మార్చుకునే సౌకర్యం ఉండటం కూడా బంగారంపై పెట్టుబడులను పెంచుతున్నది. మరోవైపు వివిధ రకాల పెట్టుబడుల్లో ఉన్న లాభాలు తెలియకపోవడం కూడా మధ్యతరగతివారిని నష్టపరుస్తున్నదని నిపుణులు అంటున్నారు. కాబట్టి నగదు రూపేణా పొదుపు అవకాశాలను పెంచేలా ప్రభుత్వ చర్యలు చేపట్టడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమేనని మెజారిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఇప్పటికే తగ్గిన పీఎఫ్‌ వడ్డీరేటు

ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) సైతం డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఐదేండ్ల కనిష్ఠాన్ని తాకేలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను 8.5 శాతానికే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిమితం చేసింది. ఇది పొదుపు అవకాశాలను ఎంతగానో ప్రభావితం చేసిందని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపైనా వడ్డీరేట్లను కేంద్రం తగ్గిస్తే.. ఆర్బీఐ ఒత్తిడి, రెపో రేటు కోతలకు అనుగుణంగా బ్యాంకులూ తమ వద్దనున్న డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించేస్తాయి. ఇది పొదుపరులకు దెబ్బేనని విశ్లేషిస్తున్నారు.


ఆర్బీఐనే అడిగింది


చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను తగ్గించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి పరుగులు పెట్టించడంలో భాగంగా మునుపెన్నడూ లేనివిధంగా రెపో రేటును నిరుడు ఫిబ్రవరి నుంచి 135 బేసిస్‌ పాయింట్లు ఆర్బీఐ కోత పెట్టిన విషయం తెలిసిందే. దీంతో రుణాలపై వడ్డీరేట్లు తగ్గి పెట్టుబడులకు అవకాశం ఉంటుందని, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటాయని సెంట్రల్‌ బ్యాంక్‌ భావించింది. కానీ అలా జరుగలేదు. స్వల్ప వడ్డీరేట్ల కోతలకే బ్యాంకర్లు పరిమితమైయ్యారు. ఇది ఆర్బీఐకి ఏమాత్రం రుచించలేదు. 

ప్రభుత్వ వడ్డీరేట్లు ఆకర్షణీయంగా ఉన్నప్పుడు తాము తగ్గిస్తే.. డిపాజిట్లను కోల్పోవాల్సి వస్తుందని బ్యాంకర్లు భయపడటంతో ఆర్బీఐ చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్లను తగ్గించాలని గతేడాది డిసెంబర్‌లోనే కోరింది. అయినా ఫలితం లేకపోవడంతోనే డిసెంబర్‌, ఫిబ్రవరి ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల కోతలకు బ్రేక్‌ ఇచ్చినట్లు తెలుస్తున్నది. కరోనా వైరస్‌ ధాటికి ఎకానమీ మరింత ప్రమాదంలో పడటంతో ఏప్రిల్‌ ద్రవ్యసమీక్షలో తప్పక వడ్డీరేట్లు తగ్గాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. ప్రస్తుత పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ఆర్బీఐ ఈసారి వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలే ఉన్నప్పటికీ అందుకు మరింత వీలు కల్పించాలని మోదీ సర్కారు భావిస్తున్నది. దీంతో తమ చిన్న మొత్తాల వడ్డీరేట్ల కోతలతో బ్యాంకులు వడ్డీరేట్లను తగిస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నది. logo