శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 13, 2020 , 00:12:43

ఆందోళనకరం

ఆందోళనకరం
  • పడకేసిన పారిశ్రామికోత్పత్తి
  • నిరుత్సాహపరిచిన తయారీరంగ కార్యకలాపాలు
  • డిసెంబర్‌లో -0.3 శాతంగా నమోదు
  • మెజారిటీ సంస్థల్లో నిరాశ, నిస్పృహలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:దేశీయ పారిశ్రామికోత్పత్తి మళ్లీ పడకేసింది. గతేడాది డిసెంబర్‌లో -0.3 శాతంగా నమోదైంది. కీలకమైన తయారీ రంగంలో ఉత్పత్తి క్షీణించడం పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)ని రుణాత్మకంలోకి నెట్టింది. 2018 డిసెంబర్‌లో ఐఐపీ వృద్ధిరేటు 2.5 శాతంగా ఉన్నట్లు బుధవారం అధికారిక గణాంకాల ద్వారా స్పష్టమవుతున్నది. నిరుడు ఆగస్టు నుంచి వరుసగా మూడు నెలలపాటు మైనస్‌లోనే నమోదైన గణాంకాలు.. నవంబర్‌లో తిరిగి వృద్ధిని సంతరించుకున్నాయి. ఆగస్టులో -1.4 శాతం, సెప్టెంబర్‌లో -4.6 శాతం, అక్టోబర్‌లో -4 శాతంగా నమోదైన ఐఐపీ.. నవంబర్‌లో 1.8 శాతానికి పెరిగింది. మళ్లీ డిసెంబర్‌లో గణాంకాలు నిరాశపరిచాయి. తయారీ రంగంలో ఉత్పాదక రేటు 2019 డిసెంబర్‌లో -1.2 శాతంగా ఉన్నది. 2018 డిసెంబర్‌లో 2.9 శాతం వృద్ధిగా నమోదవడం గమనార్హం.


విద్యుదుత్పత్తి కూడా 0.1 శాతానికి పడిపోయింది. 2018 డిసెంబర్‌లో 4.5 శాతంగా ఉన్నది. అయితే గనుల రంగంలో మాత్రం ఉత్పత్తి 5.4 శాతానికి పెరిగింది. అంతకుముందు ఇది -1 శాతంగా ఉన్నది. అయినప్పటికీ ప్రధానమైన తయారీ రంగంలో కార్యకలాపాలు నిరుత్సాహకరంగా ఉండటం ఐఐపీని స్థూలంగా దెబ్బతీసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) ఏప్రిల్‌-డిసెంబర్‌ వ్యవధిలో ఐఐపీ వృద్ధిరేటు కేవలం 0.5 శాతానికే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే కాలంలో 4.7 శాతం వృద్ధిరేటు ఉన్నది. కాగా, క్యాపిటల్‌ గూడ్స్‌ ఉత్పత్తి, పెట్టుబడుల ప్రామాణిక సూచీ క్రిందటేడాది డిసెంబర్‌లో -18.2 శాతానికి పతనమైంది. అంతకుముందు డిసెంబర్‌లో 4.2 శాతం వృద్ధి కనిపిస్తున్నది. మొత్తంగా తయారీ రంగంలోని 23 పరిశ్రమల్లో 16 ప్రతికూల వృద్ధినే సూచిస్తుండటం దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై భయాల్ని పెంచుతున్నది.


మోడువారిన ఆశలు

డిసెంబర్‌లో ఐఐపీ గణాంకాలు మైనస్‌లోకి జారుకోవడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో మోడువారిన ఆశలకు కొత్త చిగురులు వేస్తున్నాయన్న ఆనందం లేకుండా పోయిందని డెలాయిట్‌ ఇండియా ఆర్థికవేత్త రుంకీ మజుందార్‌ అన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న విపత్కర పరిస్థితులు.. భారతీయ పారిశ్రామిక రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నదన్న మజుందార్‌.. కరోనా వైరస్‌ చైనాతోపాటు భారత్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. చైనాలో తాత్కాలికంగా చాలా సంస్థలు మూతబడ్డాయని, దీనివల్ల భారత్‌లోని ఎలక్ట్రానిక్స్‌, ఆటో పరిశ్రమ ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. చైనా నుంచి ఆయా రంగాల్లోకి విడిభాగాల సరఫరా నిలిచిపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేశారు.


logo