ఆదివారం 09 ఆగస్టు 2020
Business - Jul 28, 2020 , 00:23:15

మోసపోవద్దు

మోసపోవద్దు

  1. బీమా సంస్థలు, నమోదిత ఏజెంట్లనే సంప్రదించండి
  2. పాలసీ కొనుగోలుదారులకు ఐఆర్డీఏఐ సూచన

న్యూఢిల్లీ, జూలై 27: ఇన్సూరెన్స్‌ పాలసీల కొనుగోలుకు బీమా సంస్థలను లేదా నమోదిత ఏజెంట్లనే సంప్రదించాలని ప్రజలకు బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్డీఏఐ సూచించింది. తమ ప్రతినిధులు, అధికారులమంటూ కొందరు మోసగాళ్లు ప్రజలు, పాలసీదారులకు కాల్స్‌ చేస్తున్నారన్న సమాచారంతో ఐఆర్డీఏఐ పైవిధంగా స్పందించింది. ఇన్సూరెన్స్‌ ట్రాన్జాక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, ఆర్బీఐ లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీల పేర్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సోమవారం విడుదల చేసిన ఓ బహిరంగ ప్రకటనలో ఐఆర్డీఏఐ తెలియజేసింది. ప్రస్తుత జీవిత బీమా పాలసీల్లో అబద్దపు ప్రయోజనాలను ఎర వేస్తున్నారని, ప్రీమియంలు చెల్లించక రద్దయిపోయిన పాలసీదారులకు కాల్‌ చేసి బోనస్‌లు, కమిషన్ల, రిఫండ్స్‌ పేరుతో ఆశ చూపుతున్నారని ఈ సందర్భంగా ఐఆర్డీఏఐ పేర్కొన్నది. నిజానికి బీమా, ఇతరత్రా ఆర్థిక ఉత్పత్తుల విక్రయంలో ఐఆర్డీఏఐ ప్రమేయం నేరుగా ఉండదని, కాబట్టి మోసాలకు గురికావద్దని వెల్లడించింది. అలాగే వివిధ బీమా సంస్థల ఏజెంట్లమంటూ చెప్పుకునేవారితోనూ జాగ్రత్తగా ఉండాలని, పూర్తిగా తెలుసుకున్నాకే పాలసీలను కొనాలని ఐఆర్డీఏఐ హెచ్చరించింది. 


logo