దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమలు వడివడిగా కొలువుదీరుతున్నాయి. ఈ పార్కును ప్రారంభించిన ఏడాదిలోపే పది యూనిట్లలో ఉత్పత్తులు మొదలవడం గమనార్హం. అంతేకాదు వచ్చే ఏడాది చివరి నాటికి ఏకంగా మరో 90 యూనిట్లు పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్లాంట్లు పూర్తయితే 20వేల మందికి ఉద్యోగావకాశాలు లభించే వీలున్నది.
‘అతి తక్కువ గడువులో యూనిట్లకు అనుమతుల మంజూరు, మౌలిక సదుపాయాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమైంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఇక్కడ 100 యూనిట్లలో ఉత్పత్తులు మొదలవుతాయి. ఎంఎస్ఎంఈల కోసం ఇంత భారీ, పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలతో నిర్మించిన మొదటి ఇండస్ట్రియల్ పార్కు బహుశా దేశంలో ఇదే మొదటిది’
–గోపాల్‌రావు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) ప్రధాన కార్యదర్శి
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ):
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) కోసం రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి-భువనగిరి జిల్లా దండు మల్కాపూర్‌లో 450 ఎకరాల్లో ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసింది. మొదటి దశలో 450 యూనిట్లకు భూములను కేటాయించారు. ఇందులో 200 సూక్ష్మ సంస్థలు, మరో 250 చిన్న, మధ్యతరహా సంస్థలున్నాయి. వీటి కోసం మౌలిక సదుపాయాలనూ కల్పించారు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గతేడాది నవంబర్‌లో ఈ పార్కు ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏడాది తిరక్కుండానే ప్రస్తుతం అక్కడ 10 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఉత్పత్తుల్నీ మొదలుపెట్టాయి.
2వేల ఎకరాలకు..
ఈ పార్కును 2,000 ఎకరాలకు విస్తరించే ప్రతిపాదన ఉన్నది. ఇందులో 250 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 1,250 ఎకరాల స్థలాన్ని సేకరించగా, అందులోనే మొదటి దశలో భాగంగా 450 ఎకరాలను అభివృద్ధి చేసి ఎంఎస్ఎంఈలకు కేటాయించారు. ఈ పారిశ్రామిక వాడలో రూ.2,000 కోట్లమేర పెట్టుబడులు వస్తాయని అంచనా. దీనివల్ల స్థానిక యువతకు ప్రయోజనం కలుగనున్నది.
నడుస్తున్న పరిశ్రమలివే..
దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ప్రస్తుతం కుర్కురే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ (పీఈబీ), ఎర్త్ డ్రిల్లింగ్కు సంబంధించిన పరికరాల ఉత్పాదక యూనిట్, అట్టపెట్టల తయారీ, బ్రిక్స్, పోల్స్ తదితర సిమెంట్ బిల్డింగ్ మెటీరియల్, ఎలక్ట్రిక్ టూవీలర్, త్రీవీలర్ల తయారీ పరిశ్రమలున్నాయి. త్వరలో ప్లాస్టిక్ ఫర్నీచర్, బయో డీగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ తయారీ, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, జనరిక్, ఫుడ్ సప్లిమెంట్ మెడిసిన్(నాన్ కెమికల్), ఫర్నీచర్, ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్ తదితర ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన మరో 90 పరిశ్రమలు రానున్నాయి.
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు విశేషాలు యువతకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వచ్చే ఏడాది మార్చికల్లా 2.5 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో అతి విశాలమైన నైపుణ్య శిక్షణా కేంద్రం సిద్ధం పారిశ్రామికవేత్తలు, ఉద్యోగుల కోసం 200 ఎకరాల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్
ఆయా పారిశ్రామిక కేంద్రాల సమీపంలోనే అక్కడ పనిచేస్తున్న కార్మికులకు నివాస సదుపాయాలు విస్తారమైన రోడ్లు, మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధి లైట్లు, నిరంతర విద్యుత్ సరఫరా బ్యాంకులు, ఫైర్ స్టేషన్, నిత్యావసర దుకాణాలు, పారిశ్రామిక వస్తూత్పత్తుల ఔట్లెట్లు
ఆడిటోరియం, సమావేశ మందిరం, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు