సోమవారం 08 మార్చి 2021
Business - Jan 15, 2021 , 18:32:43

నిమిషానికి రూ.575 కోట్లు లాస్‌

నిమిషానికి రూ.575 కోట్లు లాస్‌

న్యూఢిల్లీ/ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం ముగింపు మదుపర్లకు కాళరాత్రి మిగిల్చింది. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు దలాల్‌ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా ప్రతి ఇన్వెస్టర్‌ నిమిషానికి రూ.575 కోట్ల చొప్పున నష్టపోయారు. శుక్రవారం స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ ముగిసే సమయానికి రూ.2.15 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది. 

కరోనాను నియింత్రించడానికి చైనా, యూరప్‌ దేశాల్లో విధించిన ఆంక్షలతో టెలికం మేజర్లు, ఆటో స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బీఎస్‌ఈ-30 ఇండెక్స్‌ సెన్సెక్స్‌  549.49 పాయింట్లు లేదా 1.11 శాతం నష్టపోయి 49,034.67 వద్ద స్థిరపడింది. ఇక నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 161.90 పాయింట్లు పతనమై14,433.70 వద్ద ముగిసింది. 

అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్‌.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి 1.9 ట్రిలియన్‌ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రతిపాదించారు. అయితే ఈ ప్యాకేజీ ఆశించిన మేర లేకపోవడం వాల్‌స్ట్రీట్‌ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు డీలా పడ్డాయి. ఇది దేశీయ మార్కెట్ల సెంటిమెంట్‌  దెబ్బ తినడానికి మరో కారణం. మరోవైపు కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్లు కొత్త రికార్డుల్లో ట్రేడ్‌ అవుతుండటంతో శుక్రవారం ట్రేడింగ్‌లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీసినట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అమ్మకాల ఒత్తిడితో అంతకంతకూ పడిపోయాయి. ఒక దశలో సెన్సెక్స్‌ ఏకంగా 620 పాయింట్లకు పైనే పతనమైంది. నిఫ్టీ కూడా 180 పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. చివరకు కాస్త కోలుకున్నట్లే కన్పించినా భారీ నష్టాలు తప్పలేదు. 

టాటా- టెస్లా కార్ల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదరనున్నదన్న వదంతుల మధ్య టాటా మోటార్స్‌ వాటా ఏడు శాతం పెరిగింది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంకుల వాటాలు భారీగా నష్టపోయాయి. గెయిల్‌, టీసీఎస్‌, టాటా పవర్‌, అదానీ పోర్ట్స్‌, క్రాంప్టన్‌ తదితర సంస్థల షేర్లు లాభపడ్డాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo