బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Feb 04, 2020 , 00:14:27

డీ1/డీ3 మూసివేత

డీ1/డీ3 మూసివేత
  • కేజీ-డీ6లో రిలయన్స్‌కు దెబ్బ గ్యాస్‌ ఉత్పత్తి బంద్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కేజీ-డి6 బ్లాక్‌లో డీ1/డీ3 గ్యాస్‌ క్షేత్రాలను రిలయన్స్‌-బీపీ మూసేశాయి. ఇది భారతీయ తొలి డీప్‌వాటర్‌ గ్యాస్‌ ఫీల్డ్‌ కావడం గమనార్హం. అంతేగాక దేశంలోనే అతిపెద్ద గ్యాస్‌ ఫీల్డ్‌ కూడా కావడం విశేషం. ఏప్రిల్‌ 1, 2009లో దీన్ని ఉత్పత్తిలోకి తెచ్చారు. మార్చి, 2010లో గరిష్ఠ స్థాయిలో రోజుకు 61 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్లకు (ఎంఎంఎస్‌సీఎండీ)పైగా ఉత్పత్తి జరిగింది. ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, దాని భాగస్వామి బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్‌ పెట్రోలియం ఇక్కడ ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను పెట్టాయి. చివరి మూడు నెలల్లో ధీరూభాయ్‌-1, 3 (డీ1/డీ3) ఉత్పత్తి సగటున రోజుకు 1.5 ఎంఎంఎస్‌సీఎండీలకు పడిపోయింది. ఉత్పత్తిని పెంచే చర్యలను ఇరు సంస్థలు చేపట్టినా ఫలితం లేకపోయింది. కేజీ-డీ6లో దాదాపు 3 లక్షల కోట్ల క్యూబిక్‌ అడుగులకు సమానమైన ఉత్పత్తి జరిగింది. దీనివల్ల సుమారు 30 బిలియన్‌ డాలర్ల చమురు, సహజ వాయువు దిగుమతులు ఆదా అయ్యాయి. దేశ ఇంధన అవసరాల్లో 80 శాతానికిపైగా విదేశాల నుంచి దిగుమతుల ద్వారానే తీరుతున్నాయన్న విషయం తెలిసిందే. కేజీ-డీ6లో రిలయన్స్‌, బీపీ కలిసి 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. 


అత్యాశే కొంప ముంచిందా?

డీ1/డీ3లో గ్యాస్‌ ఉత్పత్తిని పెంచాలని గడిచిన నాలుగేండ్లుగా రిలయన్స్‌, బీపీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూపోయాయి. అయితే ఇదే కొంప ముంచిందన్న అభిప్రాయాలు ఇప్పుడు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సంక్లిష్ట టెక్నాలజీ వినియోగం వల్ల సముద్రపు లోతుల్లో ఉన్న ఈ రెండు క్షేత్రాల్లో ఒకదాని తర్వాత మరొక దానిలోకి ఇసుక, నీరు వచ్చేశాయని అంటున్నారు. దీంతో మరికొంత కాలం ఉత్పత్తినిచ్చే ఈ క్షేత్రాలు ముందే మూతబడాల్సి వచ్చిందన్నారు.logo