ఆదివారం 24 మే 2020
Business - Feb 17, 2020 , 00:56:45

దమానీ ధమాకా

దమానీ ధమాకా
  • డీ-మార్ట్‌ అధినేతకు షేర్‌ మార్కెట్‌ దన్ను
  • 17.8 బిలియన్‌ డాలర్లకు చేరిన నికర సంపద
  • ముకేశ్‌ తర్వాత దేశ సంపన్నుల్లో రెండో స్థానం: ఫోర్బ్స్‌ బిలియనీర్ల సూచీ

ముంబై, ఫిబ్రవరి 16: డీ-మార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీ.. భారతీయ సంపన్నులలో రెండో స్థానంలో నిలిచారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) అధిపతి ముకేశ్‌ అంబానీ తర్వాత దేశంలోని కుబేరుల్లో దమానీయేనని ఫోర్బ్స్‌ రియల్‌-టైం బిలియనీర్స్‌ సూచీ తాజాగా ప్రకటించింది. దమానీ నికర సంపద విలువ ఇప్పుడు 17.8 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. గడిచిన వారం రోజుల్లో అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ (డీ-మార్ట్‌ మాతృ సంస్థ) షేర్ల విలువ 5 శాతానికిపైగా పుంజుకున్నది. దీంతో హెచ్‌సీఎల్‌ శివనాడార్‌ (16.5 బిలియన్‌ డాలర్లు), కొటక్‌ మహీంద్రా ఉదయ్‌ కొటక్‌ (14.9 బిలియన్‌ డాలర్లు), అదానీ గ్రూప్‌ గౌతమ్‌ అదానీ (14.1 బిలియన్‌ డాలర్లు), ఆర్సెలార్‌ లక్ష్మీ మిట్టల్‌ (12.1 బిలియన్‌ డాలర్లు)లను దమానీ దాటేశారు. శనివారం నాటికి ముకేశ్‌ అంబానీ సంపద విలువ 57.4 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, ఆయన ఎప్పట్లాగే మొదటి స్థానంలో ఉన్నారు. కానీ మిగతావారి పరిస్థితి తలకిందులైంది.


రూ.36 వేల కోట్లు

ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేర్ల విలువ 31 శాతం పెరిగింది. దీంతో సంస్థ మార్కెట్‌ విలువ రూ.36,000 కోట్లు ఎగబాకింది. ప్రస్తుతం విప్రో, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థల మార్కెట్‌ విలువల కంటే కూడా అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ మార్కెట్‌ విలువే ఎక్కువ. ఈ నెల 5న సంస్థాగత మదుపరుల కోసం వాటాల విక్రయం ప్రకటించిన దగ్గర్నుంచి అవెన్యూ షేర్లకు డిమాండ్‌ బాగా పెరిగిపోయిందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్కో షేర్‌ను రూ.2,049 చొప్పున అమ్మి దాదాపు రూ.4,000 కోట్లను సంస్థ సమీకరించింది. ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే 20 శాతం రాయితీతో షేర్లను విక్రయించారు. గతేడాది డిసెంబర్‌ ఆఖరుతో ముగిసిన మూడు నెలల కాలంలో సంస్థ రూ.394 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది లాభం రూ.257 కోట్లుగానే ఉన్నది.


logo