శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 12, 2020 , 01:00:15

నిరాశపరిచిన డీ-మార్ట్‌

నిరాశపరిచిన డీ-మార్ట్‌

  • క్యూ1 లాభంలో 87 శాతం క్షీణత

న్యూఢిల్లీ, జూలై 11: డీ-మార్ట్‌ పేరుతో రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఆర్థిక ఫలితాలకు కరోనా సెగ గట్టిగానే తాకింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.40.08 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.323.06 కోట్లతో పోలిస్తే 87.59 శాతం దిగువకు పడిపోయింది. మరోవైపు ఏడాది ప్రాతిపదికన ఆదాయం 33.21 శాతం క్షీణించి రూ.3,883.18 కోట్లకు పరిమితమైనట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అంతక్రితం ఇది రూ.5,814.56 కోట్లుగా ఉన్నది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ నెవెల్లీ నోరోన్హ మాట్లాడుతూ..కరోనా వైరస్‌ ఉదృతి కొనసాగుతుండటంతో వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపిందని, పరిమితులు విధించడం ఆటు ఆదాయం, నికరలాభాల్లో భారీ గండిపడిందన్నారు. సమీక్షకాలంలో నిర్వహణ ఖర్చులు రూ.3,875.01 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఖర్చు చేసిన రూ.5,318.64 కోట్లతో పోలిస్తే 25 శాతం తగ్గాయి. logo