బుధవారం 27 మే 2020
Business - Apr 04, 2020 , 22:59:35

డీ-మార్ట్ విరాళం రూ.155 కోట్లు

డీ-మార్ట్ విరాళం రూ.155 కోట్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.5 కోట్లు 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచనకు కార్పొరేట్లు కదిలాయి. ప్రముఖ రిటైల్ సంస్థ డీ-మార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రమోటర్ రాధాకృష్ణ దామాని ఏకంగా రూ.155 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. వీటిలో పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ.100 కోట్లను అందించిన దామాని.. మిగతా రూ.55 కోట్లను వ్యాపారాన్ని నిర్వహిస్తున్న 11 రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సంస్థలు తీసుకుంటున్న చర్యలకు చేదోడువాదోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ భారీ విరాళాన్ని అందించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రూ.5 కోట్లు ప్రకటించింది సంస్థ. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాలకు రూ.10 కోట్ల చొప్పున అందించిన సంస్థ..ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్‌లకు రూ.5 కోట్లు, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, ఉత్తరప్రదేశ్‌లకు రూ.2.5 కోట్ల చొప్పున ప్రకటించారు. మరోవైపు సీకే బిర్లా గ్రూపు రూ.35 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు ప్రకటించింది. దీంట్లో ప్రధాని సహాయ నిధికి రూ.25 కోట్లు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించిన సంస్థ... మిగతా రూ.10 కోట్లను పలు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ రూపంలో అందిస్తున్నట్లు తెలిపింది. ఎక్స్‌పర్సన్ డెవలపర్స్ రూ.1.85 కోట్లను, సిగ్నిచర్ గ్లోబల్ రూ.2 లక్షలు పీఎం సహాయ నిధికి అందచేసింది. వీటితోపాటు కుష్‌మన్ హెల్త్‌కేర్ రూ.2.5 కోట్లును అందించింది. దీంతోపాటు కంపెనీ ఉద్యోగుల తమ ఒక్కరోజు వేతనాన్ని కూడా విరాళంగా ప్రకటించారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థయైన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ రూ.3 కోట్ల విరాళాన్ని పీఎం-కేర్స్‌కు ఇచ్చింది. 

ఫ్రీడం రూ.50 లక్షలు

ఫ్రీడం పేరుతో వంటనూనెను విక్రయిస్తున్న జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ కూడా ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళంగా అందించింది. వీటితోపాటు కరోనా వైరస్ మహమ్మారితో పోరాటంలో భాగంగా కంపెనీ ఉద్యోగులు ఒక్కరోజు వేతనం రూ.9.25 లక్షలను కూడా అందించినట్లు కంపెనీ ఎండీ ప్రదీప్ చౌదరి తెలిపారు. 

రూ.10 కోట్లతో  యెస్ బ్యాంక్ ఫండ్

ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యెస్ బ్యాంక్..కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా రూ.10 కోట్లతో ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ బ్యాంక్‌ను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని కన్సార్టియం బ్యాంకులు భారీ ప్యాకేజీ ప్రకటించడంతో తిరిగి కోలుకున్న బ్యాంక్.. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. మరోవైపు పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రూ.25 కోట్లు, ఇనాక్స్ రూ.5 కోట్లు పీఎం-కేర్ ఫండ్‌కు జమచేశాయి. 


logo