శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 09, 2020 , 02:41:15

హైదరాబాద్‌ @ఆఫీస్‌

హైదరాబాద్‌ @ఆఫీస్‌

 • కుష్మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ తాజా నివేదిక
 • లాక్‌డౌన్‌లోనూ కార్యాలయ స్థలాలకు డిమాండ్‌
 • దేశంలోనే మరెక్కడా లేనంతగా కార్పొరేట్‌ లీజులు

న్యూఢిల్లీ, జూలై 8: కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్యాలయ స్థలాలకు భారీగా గిరాకీ పడిపోయినా.. హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌కున్న డిమాండే అగ్రస్థానంలో నిలిచింది. లాక్‌డౌన్‌లోనూ భాగ్యనగర ఆఫీస్‌ స్పేస్‌ కార్పొరేట్లను విశేషంగా ఆకట్టుకున్నది. ప్రాపర్టీ కన్సల్టెంట్‌ కుష్మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ (సీఅండ్‌డబ్ల్యూ) తాజా వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఆఫీస్‌ స్పేస్‌ లీజులు జరిగాయి. 17.58 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని కార్పొరేట్లు కొత్తగా అందిపుచ్చుకున్నారు. ముంబైలో నిరుడుతో పోల్చితే లీజులు పెరిగినా 16.45 లక్షల చదరపు అడుగులకే పరిమితమవడం గమనార్హం. ఇక ఢిల్లీ, బెంగళూరుల్లోనైతే కొత్త లీజుల సంగతి పక్కనబెడితే.. గతంలో జరిగిన ఆఫీస్‌ స్పేస్‌ లీజులే రద్దయ్యాయి. చెన్నై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌ల్లోనూ భారీగా క్షీణించాయి. అయినప్పటికీ భాగ్యనగరంలో కొత్త ఆఫీసుల ఏర్పాటుకు కార్పొరేట్లు అత్యధిక స్థాయిలో ముందుకు రావడం అందర్నీ ఆకట్టుకుంటున్నది. వైరస్‌ దెబ్బకు యావత్‌ ప్రపంచం అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ మహమ్మారి విజృంభిస్తుండగా, దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సంగతీ విదితమే. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ కార్పొరేట్ల మొదటి ఎంపిక హైదరాబాదే అవుతుండటం విశేషం. ఇక్కడ కార్యాలయ ఏర్పాటును దేశ, విదేశీ కార్పొరేట్‌ సంస్థలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుండటమే దీనికి కారణమని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా 73 శాతం క్షీణత

ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో గతంతో పోల్చితే ఆఫీస్‌ స్పేస్‌ నికర లీజులు 8 ప్రధాన నగరాల్లో 73.4 శాతం క్షీణించినట్లు సీఅండ్‌డబ్ల్యూ తెలియజేసింది. ఈసారి 37.15 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లీజులే జరిగాయన్నది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌లో 139.85 లక్షల చదరపు అడుగుల లీజులు జరిగాయి. ఈ ఏడాది జనవరి-మార్చితో పోల్చినా 49.5 శాతం తక్కువగా నమోదైనట్లు తేలిం ది. కరోనా దృష్ట్యా బడా కార్పొరేట్లు, కో-వర్కింగ్‌ సంస్థలు వ్యాపార విస్తరణను వాయిదా వేయడమే ఇందుకు కారణమని ఓ ప్రకటనలో సీఅండ్‌డబ్ల్యూ తెలియజేసింది. ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్‌)లో చూసినట్లయితే 57 శాతం దిగజారి 110. 75 లక్షల చదరపు అడుగులకు ఆఫీస్‌ స్పేస్‌ లీజులు పరిమితమయ్యాయి. నిరుడు జనవరి-జూన్‌లో ఇవి 255.48 లక్షల చదరపు అడుగులుగా ఉన్నాయి. అయితే అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైనందున ఈ ద్వితీయార్ధం (జూలై-డిసెంబర్‌)లో ఆఫీస్‌ స్పేస్‌కు కొంతమేర డిమాండ్‌ పెరుగవచ్చన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా సీఅండ్‌డబ్ల్యూ ఇండియా, ఆగ్నేయాసియా ఎండీ అన్షుల్‌ జైన్‌ వ్యక్తం చేశారు.

 • ముంబైలో గతంతో పోల్చితే 12.72 లక్షల చ.అ. నుంచి 16.45 లక్షల చ.అ.కు పెరిగిన లీజులు
 • ఢిల్లీ, బెంగళూరుల్లో ప్రతికూల వృద్ధి
 • మూడు నెలల్లో ఢిల్లీలో 3.58 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ ఖాళీ
 • బెంగళూరులో 83,943 చ.అ. కార్యాలయ స్థలం లీజులు రద్దు
 • నిరుడు ఢిల్లీలో 9.52 లక్షల చ.అ., బెంగళూరులో 23.63 లక్షల చ.అ. లీజులు
 • చెన్నైలో 11.65 లక్షల చ.అ. నుంచి 5.23 లక్షల చ.అ.కు పతనం
 • పుణెలో 15.85 లక్షల చ.అ నుంచి 60,709 చ.అ.కు పరిమితం
 • హైదరాబాద్‌లో నిరుడు 57.78 లక్షల చ.అ. లీజులు జరిగితే, ఈసారి 17.58 లక్షల చ.అ. లీజులు
 • కోల్‌కతాలో ఈసారి 1.14 లక్షల చ.అ., అహ్మదాబాద్‌లో 54,900 చ.అ. లీజులు

(చ.అ. అనగా చదరపు అడుగు)

తాజావార్తలు


logo