శనివారం 04 జూలై 2020
Business - Jun 06, 2020 , 01:16:49

మూతబడ్డ అట్లాస్‌

మూతబడ్డ అట్లాస్‌

  • చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు 
  • రోడ్డునపడ్డ 431 మంది ఉద్యోగులు

న్యూఢిల్లీ, జూన్‌ 5: అట్లాస్‌ సైకిల్స్‌ కంపెనీ మూతబడింది. 70 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ.. సుమారు 40 ఏండ్లు భారతీయ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందింది. పెండ్లికి అత్తింటివారి నుంచి కట్నంగా అట్లాస్‌ సైకిల్‌ను కోరే అల్లుండ్లు ఉండేవారు. అలాంటి సైకిళ్ల సంస్థ చివరకు ఆర్థిక ఇబ్బందులతో మనుగడ సాగించలేక చేతులెత్తేసింది. ఢిల్లీకి సమీపంలోని సహిబాబాద్‌లోగల చివరి ప్లాంట్‌కూ బుధవారం (జూన్‌ 3) తాళం పడింది. దీంతో 431 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. 2017లో సంస్థలో 800 మంది ఉద్యోగులుండేవారు. కాగా, ప్రపంచ సైకిళ్ల దినోత్సవం రోజునే.. భారతీయ బైస్కిల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అట్లాస్‌ సైకిల్‌ మూతబడటం కాకతాళీయం. 2014 నుంచి సంస్థకు ఆర్థిక ఇబ్బందులు మొదలవగా, అదే ఏడాది డిసెంబర్‌లో మలన్‌పూర్‌ ప్లాంట్‌, 2018 ఫిబ్రవరిలో సోనీపట్‌ ప్లాంట్‌ మూతబడ్డాయి. ఏడాదిన్నర నుంచి ఆర్థిక ఇబ్బందులు తీవ్రం కావడంతో ఇప్పుడు మూడో ప్లాంట్‌నూ మూసేశారు. 

దెబ్బతీసిన లాక్‌డౌన్‌

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వచ్చిపడిన లాక్‌డౌన్‌ కూడా అట్లాస్‌ సైకిల్స్‌ ఉసురు తీసింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సంస్థకు నిధుల కొరతను తీవ్రతరం చేసింది. 

నోటీసు ఇవ్వలేదు: కార్మికులు

ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ప్లాంట్‌ను మూసివేశారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం తాము విధుల్లోకి రావడంతో ప్లాంట్‌ గేట్లకు నోటీసు అంటించారని చెప్తున్నారు. అందులో కొన్నేండ్ల నుంచి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నామని, ఇకపై కార్యకలాపాలను కొనసాగించడానికి నిధులు లేవని యాజమాన్యం పేర్కొనట్లు తెలిపారు. ముడి సరుకును కొనలేకపోతున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో ప్లాంట్‌ను నడుపలేమని స్పష్టం చేసినట్లు వివరించారు. 

మళ్లీ తెరుస్తాం యాజమాన్యం

ప్లాంట్‌ను తాత్కాలికంగానే మూసేశామని సంస్థ సీఈవో ఎన్‌పీ సింగ్‌ రాణా పీటీఐకి తెలిపారు. సంస్థకున్న మిగులు భూములను అమ్మి దాదాపు రూ.50 కోట్ల నిధులను సమీకరించాలని చూస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క ఉద్యోగినీ తీసివేయలేదని, ప్లాంట్‌ తెరుచుకునేంత వరకు హాజరుపట్టీలో అందరి పేర్లుంటాయన్నారు. మార్కెట్‌లో అట్లాస్‌ బ్రాండ్‌ డిమాండ్‌కు ఢోకా లేదని, బలమైన డీలర్ల వ్యవస్థ కూడా తమకుందన్న ఆయన త్వరలోనే కోలుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

అట్లాస్‌ కథ కంచికేనా..

  • 1951లో సోనీపట్‌ నుంచి ప్రారంభమైన అట్లాస్‌ సైకిల్స్‌
  • 1965లో దేశంలోనే అతిపెద్ద సైకిల్‌ తయారీ సంస్థగా అవతరణ
  • న్యూఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌కు సైకిళ్ల సరఫరా
  • సైకిళ్ల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటిగా గుర్తింపు
  • ప్రస్తుత వార్షిక ఉత్పాదక సామర్థ్యం 40 లక్షలు
  • నెలకు తయారవుతున్నవి 2 లక్షలే
  • 2014 నుంచి ఆర్థిక ఇబ్బందులు
  • ప్రస్తుతం బీఎస్‌ఈలో షేర్‌ విలువ రూ.43.35, ఎన్‌ఎస్‌ఈలో రూ.42.85


logo