Bit coin | డిజిటల్ గోల్డ్ అవతార్‌గా.. బంగారానికి, డాలర్‌కు ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా ఉన్న బిట్ కాయిన్.. ఇతర క్రిప్టో కరెన్సీల భవితవ్యం తేలిపోయింది. గత మే నెలలో ఆల్‌టైం రికార్డు నెలకొల్పిన బిట్ కాయిన్.. ఒడిదొడుకులను ఎదుర్కొంటూ 48 వేల డాలర్ల వద్ద తచ్చాడుతున్నది. కానీ దీన్ని ఒక కరెన్సీగా పరిగణించలేమని, కేవలం డిజిటల్ అసెట్‌గా మాత్రమే చూస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు.. క్రిప్టో కరెన్సీపై చట్ట రూపకల్పన పనిలో పడింది. త్వరలో కేంద్ర క్యాబినెట్ ముందుకు ముసాయిదా బిల్లు రానున్నది. ఒకవేళ బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను డిజిటల్ అసెట్‌గా పరిగణించే అవకాశం ఉంది. అదే జరిగితే ఇతర ఆస్తులపై వచ్చే ఆదాయం మాదిరిగానే.. బిట్ కాయిన్‌పై వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది సుమా..
క్రిప్టో కరెన్సీకి నిర్వచనమిస్తూ ముసాయిదా చట్టాన్ని రూపొందిస్తున్నది. దాన్ని ఆస్తిగా పరిగణించినా చెల్లింపులు, డీల్స్ సెటిల్మెంట్స్లో బిట్ కాయిన్‌ను ఉపయోగించడంపై నిషేధం అమలులోకి రానున్నదని తెలుస్తున్నది. దీన్ని డిజిటల్ కరెన్సీ కాకుండా.. డిజిటల్ అసెట్‌గా ప్రభుత్వ నిర్వచనాన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లు ఆమోదిస్తామని క్రిప్టో ఏజెన్సీలు చెబుతున్నాయి.
డిజిటల్ అసెట్‌గా నిర్వచిస్తే.. దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ల్లో దాని ట్రేడింగ్‌కు రిజిస్ట్రేషన్ విధానం అమలులోకి తేవాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించాల్సి రావొచ్చు. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కూడా డిజిటల్ కరెన్సీ తేవడానికి కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నాటికి ప్రయోగాత్మకంగా ఆర్బీఐ తన డిజిటల్ కరెన్సీని విడుదల చేయొచ్చు.