బుధవారం 03 మార్చి 2021
Business - Feb 09, 2021 , 21:41:15

క్రిప్టో క‌రెన్సీకి లీగాలిటీ: త్వ‌ర‌లో క్యాబినెట్ ముందుకు..!

క్రిప్టో క‌రెన్సీకి లీగాలిటీ: త్వ‌ర‌లో క్యాబినెట్ ముందుకు..!

న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించ‌డానికి త్వరలోనే క్రిప్టో క‌రెన్సీపై బిల్లు కేబినెట్ ముందుకు వ‌స్తుంద‌ని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ఓ సభ్యుడ‌డిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. క్రిప్టో కరెన్సీ బిల్లుకు తుది మెరుగులు దిద్దుతున్నామ‌ని చెప్పారు. 

‘భారత్‌లో క్రిప్టో కరెన్సీ వినియోగంపై భార‌తీయ రిజ‌ర్వు బ్యాంక్ (ఆర్బీఐ) త్వరలో విధివిధానాలు త్వరలో తెలియజేస్తామని ప్రకటించింది. కానీ అది సమస్యాత్మక అంశం. క్రిప్టోకరెన్సీని భారత్‌లో నిలువరించ‌డానికి కేంద్ర ఆర్థికశాఖ ఏదైనా బిల్లును ప్ర‌తిపాదిస్తుందా?’ అని కర్ణాటక బీజేపీ ఎంపీ కేసీ రామమూర్తి అడిగారు. 

దీనిపై మంత్రి అనురాగ్‌ఠాకూర్‌ సమాధానమిస్తూ.. ‘నేరుగా క్రిప్టోకరెన్సీని  నియంత్రించ‌డానికి ఆర్బీఐ, సెబీలకు లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌ లేదు. ఎందుకంటే క్రిప్టోకరెన్సీ ఆస్తులు, వస్తువు కాదు. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో డిజిట‌ల్ క‌రెన్సీ అంశాలు లేవు. అందుకే గతంలో దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఆ నివేదిక ఆధారంగా నిపుణులతో చర్చించాం. దీనిపై బిల్లు చివరిదశలో ఉంది. త్వరలో కేబినెట్‌ ముందుకు తెస్తాం’ అని మంత్రి తెలిపారు.

2008 ఆర్థిక మాంద్యం స‌మ‌యంలో వెలుగులోకి వ‌చ్చిన క్రిప్టో క‌రెన్సీ.. వాటిల్లో బిట్ కాయిన్ విలువ గ‌తేడాది క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ మాన‌వాళిని వ‌ణికిస్తున్న వేళ మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చింది. గ‌తేడాది మార్చి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 100 శాతం దాని విలువ పెరిగింది. 

ప్ర‌ముఖ విద్యుత్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్‌.. స‌ద‌రు బిట్ కాయిన్‌లో 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్టామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఆ క్రిప్టో క‌రెన్సీ విలువ 44 వేల డాల‌ర్ల‌కు చేరుకుని ఆల్‌టైం రికార్డు నెల‌కొల్పిన సంగ‌తి తెలిసిందే. గ‌మ్మ‌త్త‌మిటంటే అన్ని ర‌కాల క్రిప్టో క‌రెన్సీల‌ను నిషేధించాల‌ని వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల టీం కేంద్రానికి సిఫార‌సు చేయ‌డం గ‌మ‌నార్హం.

VIDEOS

logo