మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 04, 2020 , 23:40:57

బ్యాంకుల్లో క్రిప్టోకరెన్సీ

బ్యాంకుల్లో క్రిప్టోకరెన్సీ
  • కస్టమర్లకు సేవలు అందించాలన్న సుప్రీం కోర్టు
  • ఆర్బీఐ నిషేధం కొట్టివేత

న్యూఢిల్లీ, మార్చి 4: క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన సేవలను అందించేందుకు బ్యాంకులను సుప్రీం కోర్టు అనుమతించింది. ఈ విషయమై ఏప్రిల్‌ 6, 2018లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) విధించిన నిషేధాన్ని బుధవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇక బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో క్రిప్టోకరెన్సీ ఆధారిత సేవలు అందుబాటులో ఉంటాయని జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారీమన్‌ నేతృత్వంలో అనిరుద్ధా బోస్‌, వీ రామసుబ్రమణ్యన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్బీఐ సర్క్యులర్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఈ మేరకు తీర్పు వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థపై క్రిప్టోకరెన్సీల ప్రభావాన్ని విశ్లేషించకుండానే ఆర్బీఐ నిషేధం విధించిందని పిటీషనరైన ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎంఏఐ) కోర్టులో వాదించింది. నిజానికి బిట్‌కాయిన్‌ తదితర క్రిప్టోకరెన్సీలతో లావాదేవీలను బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో నిషేధిస్తూ ఆర్బీఐ ఇచ్చిన ఈ సర్క్యులర్‌పై స్టే విధించడానికి సుప్రీం గతంలో నిరాకరించింది.


 జూలై 3, 2018న జరిగిన విచారణలో ఐఎంఏఐ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, సమాచార, సాంకేతిక శాఖలను ఐఎంఏఐ పిటిషన్‌పై స్పందించాలని కోరింది. కానీ ఇప్పుడు ఐఎంఏఐకి అనుకూలంగా సుప్రీం తీర్పు చెప్పింది. రెండు ముసాయిదా బిల్లులుసహా ఈ అంశంలో వివిధ కమిటీలు చేసిన ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని 180 పేజీల తీర్పు ప్రతుల్లో కోర్టు పేర్కొన్నది. 2013 నుంచే ఈ అదృశ్య కరెన్సీల వినియోగదారులు, నిల్వదారులు, వ్యాపారులను ఆర్బీఐ హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సుప్రీం కోర్టు ఆదేశానుసారం వెళ్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 


logo
>>>>>>