మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 09, 2020 , 13:35:11

అంగట్లో డాటా

అంగట్లో డాటా
  • డార్క్‌ నెట్‌లో దాదాపు 5 లక్షల మంది భారతీయుల రహస్య సమాచారం
  • సైబర్‌సెక్యూరిటీ సంస్థ గ్రూప్‌-ఐబీ వెల్లడి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలు అమ్మకానికొచ్చాయి. గోప్యంగా ఉండాల్సిన సమాచారం అంగడి సరుకైంది. 4 లక్షల 61,976 మంది భారతీయుల చెల్లింపుల వివరాలు డార్క్‌ నెట్‌లో విక్రయానికి పెట్టినట్లు సింగపూర్‌కు చెందిన సైబర్‌సెక్యూరిటీ సంస్థ గ్రూప్‌-ఐబీ తెలిపింది. డార్క్‌ నెట్‌లో ఈ తరహా సమాచారాన్ని అమ్మకానికి పెట్టే చాలా రహస్య పోర్టల్స్‌లో ఒకటైన జోక ర్స్‌ స్టాష్‌.. బుధవారం పెద్ద ఎత్తున క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వివరాలను అమ్మకానికి తెచ్చిందని గ్రూప్‌-ఐబీ తాజాగా వెల్లడించింది. ఇందులో 98 శాతం కార్డులు భారతీయులవే కావడం గమనార్హం. దీంతో భారత అధికార వర్గాలకూ ఈ విషయాన్ని గ్రూప్‌-ఐబీ తెలియజేసింది. ఫిషింగ్‌ రాకెట్ల నుంచి ఈ డాటాను సేకరించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేండ్లుగా ఈ చౌర్యం కొనసాగి ఉండవచ్చన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. 


కాగా, గ్రూప్‌-ఐబీ అందించిన సమాచారాన్ని పరిశీలిస్తున్నట్లు, త్వరలోనే తగిన సలహాలు, సూచనలు ఇస్తామని మహారాష్ట్ర సైబర్‌ విభాగం ఎస్పీ బల్‌సింగ్‌ రాజ్‌పుత్‌ తెలిపారు. ‘అండర్‌గ్రౌండ్‌ మార్కెట్‌ ప్రకారం ఈ డాటా విలువ 4.2 మిలియన్‌ డాలర్లపైనే. ఈ డాటా వివరాలు ఎవరివి అన్నవి స్పష్టంగా తెలియదు. అయితే ఈ పేమెంట్‌ రికార్డుల అమ్మకంపై ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ-ఇన్‌)కు ఇప్పటికే సమాచారమిచ్చాం. వారు తగిన చర్యలు తీసుకుంటారు’ అని గ్రూప్‌-ఐబీ తెలియజేసింది. కార్డు నెంబర్లు, వా టి చెల్లుబాటుకున్న గడువు తేదీలు, సీవీవీ/సీవీసీ కోడ్స్‌తోపాటు కార్డుదారుల పూర్తి పేర్లు, వారి ఈ-మెయిల్స్‌, ఫోన్‌ నెంబర్లు, చిరునామా తదితర సమగ్ర వివరాలను డార్క్‌ నెట్‌లో అమ్మకానికి పెట్టినట్లు తమ ఇంటెలిజన్స్‌ వర్గాల సమాచారమని గ్రూప్‌-ఐబీ చెప్పింది.


ఇది రెండో లీకు

భారతీయ బ్యాంకుల కార్డులకు సంబంధించి ఇది రెండో అతిపెద్ద లీక్‌ అని గ్రూప్‌-ఐబీ ఇంటెలిజెన్స్‌ బృందం గుర్తించింది. గతేడాది అక్టోబర్‌లో 13 లక్షలకుపైగా క్రెడిట్‌, డెబిట్‌ కార్డుదారుల వివరాలు చౌర్యానికి గురైనట్లు గ్రూప్‌-ఐబీ ఇంటెలిజన్స్‌ బృందం కనుగొన్నది. వీరిలో కూడా అత్యధికులు భారతీయులే కావడం గమనించదగ్గ అంశం. ఈ వివరాలూ జోకర్స్‌ స్టాష్‌ ద్వారానే డార్క్‌ నెట్‌లో అమ్మకానికి రావడం మరో ఆసక్తికర విషయం. ఈ క్రమంలో ఇప్పుడు మరో 5 లక్షల మంది వరకు భారతీయుల క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం అపహరణకు గురైందని గ్రూప్‌-ఐబీ ఇంటెలిజన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. 


ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల నుంచి క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారం దొంగిలించినట్లు తెలుస్తుండగా, ఇందుకు సైబర్‌ నేరగాళ్లు జావాస్క్రిప్ట్‌ లేదా జేఎస్‌-స్నిఫర్స్‌ ప్రోగ్రామ్‌లను వాడి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిషింగ్‌, మాల్వేర్‌లనూ ఉపయోగించి ఉండవచ్చని గ్రూప్‌-ఐబీ సైబర్‌క్రైం రిసెర్చ్‌ యూనిట్‌ అధిపతి దిమిత్రి షేస్టకోవ్‌ అన్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌తోపాటు, ఆఫ్‌లైన్‌ షాపింగ్‌మాల్స్‌ తదితర ప్రాంతాల్లో కొనుగోళ్లకు కార్డులను వినియోగించినప్పుడు పీవోఎస్‌ టర్మినల్స్‌ ద్వారా కూడా ఈ సమాచారం లీకైయ్యే వీలుందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


logo
>>>>>>