పర్సు తీస్తే నోట్ల కన్నా కార్డుల సంఖ్యే ఎక్కువ. క్రెడిట్, డెబిట్, పాన్, ఆధార్, క్లబ్ మెంబర్షిప్, లాయల్టీ షాపింగ్ ఇలా ఎన్నో పర్సు నిండా ఉంటున్నాయి. కార్డుల కోసమే ప్రత్యేక పర్సు పెట్టుకుంటున్న రోజులివి. ప్రస్తుత డిజిటల్ ఎకానమీలో ఏవి కొనాలన్నా కార్డు తప్పనిసరైపోయింది మరి. అలాంటిది ఆ పర్సుపోతే నిలువు దోపిడీకన్నా అధ్వాన్నమే. అందుకే కార్డుల కోసమూ ఇన్సూరెన్స్ ఉన్నది. దీన్నే కార్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ (సీపీపీ) అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కార్డుపోతే జరిగే నష్టానికి ఈ సీపీపీ ద్వారా బీమా లభిస్తుంది. అన్ని రకాల కార్డులకు దీని ద్వారా రక్షణ దొరుకుతుంది. ఈ బీమాతో పోయిన కార్డులను బ్లాక్ చేయడంతోపాటు, కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రక్షణ పొందడం ఎలా?
బ్యాంకు లేదా క్రెడిట్ కార్డు కంపెనీతో సంప్రదించి అవసరమైన కేవైసీ వివరాలతో దరఖాస్తు చేయాలి. దీనికి వార్షిక ప్రీమియం మాత్రమే ఉంటుంది. ప్రీమియం చెల్లించాక సీపీపీ వెల్కమ్ కిట్ మీ చేతికి వస్తుంది. అందులో పాలసీ తీసుకున్నట్టు ధ్రువీకరణ పత్రం, దాని ప్రయోజనాలు, నియమ నిబంధనల పత్రాలుంటాయి. రిజిస్ట్రేషన్ ఫాం కూడా ఉంటుంది. అందులో మీ కార్డుల వివరాలను నింపి సంబంధిత బ్యాంకు, కంపెనీకి తిరిగి పంపించాలి.
ప్రయాణంలో పోతే..
ప్రయాణించే సమయంలోనే చాలావరకు పర్సు దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లోనూ ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఎమర్జెన్సీ ఆర్థిక సాయాన్ని కూడా సదరు బ్యాంకు లేదా కంపెనీ అందిస్తుంది. వార్షిక కాలపరిమితి, ఆటో రెన్యువల్ పద్ధతుల్లో ప్లాన్లుంటాయి.