శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 03, 2020 , T00:50

ముగిసిన క్రెడాయి ప్రాపర్టీ షో

ముగిసిన క్రెడాయి ప్రాపర్టీ షో

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆదివారం ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రాపర్టీ షోకు అనేక మంది బ్యూరోక్రాట్లు, పారిశ్రామికవేత్తలు, నిపుణులతోపాటు మొత్తం 55 వేల మంది సందర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో స్థిరమైన అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై చర్చించారు. కాగా, ఈ ఏడాది జరిగిన క్రెడాయి ప్రాపర్టీ షో చాలా పెద్దదవగా, రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ పోటీతత్వాన్ని, బ్రాండ్ ఇమేజ్‌ను చాటింది. ఈ ప్రదర్శనలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్సులు, గేటె డ్ కమ్యూనిటీలు, విల్లాలు, గ్రీన్ భవనాలు, ఆర్థిక సంస్థలు, సరఫరాదారులతో సహా 15వేల ప్రాజెక్టులు ప్రదర్శించారు. వీటిలో ఉత్తమ స్టాల్స్‌ను గుర్తించడమేగాక, నైపుణ్యాభివృద్ధి కోసం క్రెడాయి గుర్తింపు పొందిన డెవలపర్స్‌కు ధ్రువీకరణ పత్రం అందజేశారు. జంట నగరాల్లోని వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా లగ్జరీ, బడ్జెట్‌కు తగ్గ డిజైన్ల ప్రదర్శన జరిగింది. ఈ ప్రాపర్టీ షోకి లభించిన ఆదరణ చాలా సంతోషం కలిగించినదని క్రెడాయి హైదరాబాద్ అధ్యక్షుడు పి రామకృష్ణారావు అన్నారు. ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ మూడు రోజుల షోలో అధికారులు, పరిశ్రమ నిపుణులు, డొమైన్ నిపుణులతో చర్చించినట్లు చెప్పారు. హైదరాబాద్ దేశంలోనే ఉత్తమమైన రియల్ ఎస్టేట్ నగరంగా గుర్తింపు పొందిందన్నారు. రాబోయే కొన్నేళ్లలో నగర గృహ నిర్మాణానికి గణనీయమైన డిమాండ్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ముగింపు కార్యక్రమంలో క్రెడాయి ఉపాధ్యక్షులు సీజీ మురళీమోహన్, కాచమ్ రాజేశ్వర్, వేణు వినోద్, ఎన్ జైదీప్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు కొత్తపల్లి రాంబాబు, శివరాజ్ ఠాకూర్, కోశాధికారి గౌర ఆదిత్య, క్రెడాయి హైదరాబాద్ అధ్యక్షులు సీహెచ్ రామచంద్రారెడ్డి, డి మురళీకృష్ణారెడ్డి క్రెడాయి తెలంగాణ అధ్యక్షులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. logo