బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Jan 24, 2020 , 00:56:23

అమ్ముడుపోని ఫ్లాట్లు తక్కువే..

అమ్ముడుపోని ఫ్లాట్లు తక్కువే..
  • క్రెడాయ్‌ హైదరాబాద్‌అధ్యక్షుడు రామకృష్ణారావు
  • 31 నుంచి 2 దాకా ప్రాపర్టీ షో

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఫ్లాట్ల  సంఖ్య పెద్దగా ఎక్కువగా లేదని క్రెడాయ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు రామకృష్ణారావు స్పష్టం చేశారు. గురువారం బంజారాహిల్స్‌లోని క్రెడాయ్‌ హైదరాబాద్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 దాకా ప్రాపర్టీ షోను నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో అమ్ముడుని కాని ఫ్లాట్లు ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వే సంస్థలు చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, ఆర్థిక మాంద్యం నుంచి పాఠాలు నేర్చుకున్న నిర్మాణ సంస్థలు గిరాకీని బట్టి కొత్త నిర్మాణాలు చేపడుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో అమ్ముడు కాని ఫ్లాట్లను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చని, మహాఅయితే ఓ వెయ్యి దాకా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన కొత్త మున్సిపల్‌ చట్టం వల్ల నిర్మాణ రంగానికెంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. 


సుస్థిరమైన ప్రోత్సాహాకర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాల్ని తీసుకోవడం వల్లే భారతదేశంలోని పెట్టుబడిదారుల చూపు హైదరాబాద్‌ మీద కేంద్రీకృతమైందన్నారు.  ఈ కార్యక్రమంలో క్రెడాయ్‌ ప్రధాన కార్యదర్శి వీ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత ఐదేండ్ల నుంచి హైదరాబాద్‌ నిర్మాణ రంగం సరికొత్త రూపును సంతరించుకుంటున్నదని,  రెరా రాకతో అన్ని రకాల అనుమతులు ఉండి, నాణ్యమైన ప్రాజెక్టుల్ని నిర్మించే డెవలపర్ల సంఖ్య పెరుగుతున్నారన్నారు. అమరావతిలో ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి రియల్‌ రంగం అభివృద్ధి చెందుతుందనేది అపోహ అని కొట్టిపారేశారు. సుస్థిర పాలన, సానుకూల వాతావరణం, సమర్థవంతమైన పోలిసు వ్యవస్థ, పెట్టుబడుల్ని ప్రోత్సహించే ప్రభుత్వం ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తాయని వివరించారు. ఉపాధ్యక్షుడు జైదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాపర్టీ షోలో 80 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.


logo