గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 12, 2020 , 01:00:18

తస్మాత్‌.. జాగ్రత్త

తస్మాత్‌.. జాగ్రత్త

 • మొండి ఘటాలతో ముప్పు.. కరోనాతో ఒత్తిడిలో రుణాలు
 • బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌
 • దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంకా తొలగని అనిశ్చితి

ముంబై, జూలై 11: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) పెరుగవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. మహమ్మారితో మారిన పరిస్థితులు.. రుణాలను ఒత్తిడిలోకి నెట్టాయని వ్యాఖ్యానించారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఇంకా తొలగలేదన్నారు. మధ్య కాలిక దృక్పథం ఇప్పటికీ ఆశాజనకంగా లేదని చెప్పారు. శనివారం జరిగిన ఎస్బీఐ 7వ బ్యాంకింగ్‌, ఎకనామిక్స్‌ కన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం, బలహీనపడ్డ ఆర్థిక స్థిరత్వం, మందగించిన వృద్ధిరేటును బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ఇప్పటికీ సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులున్నాయన్న ఆయన ఇది మునుపటి స్థితికి చేరుకోవాలన్నారు. మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత తొలగి, డిమాండ్‌ పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కావాల్సిన అన్ని చర్యలనూ తీసుకున్నదని వివరించారు. కరోనా అనంతర కాలమే ఇప్పుడు ముఖ్యమని, వైరస్‌ సద్దుమణిగాక ఎలా వృద్ధిబాట పట్టాలన్న దానిపై అన్ని రంగాలూ ఆలోచించుకోవాలని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి కోసం తమ వంతుగా వడ్డీరేట్లను తగ్గిస్తున్నామన్నారు.

బ్యాంకుల మూలధనం పెరుగాలి

బ్యాంకులు మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాలని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నదన్న ఆయన మొండి బకాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాబట్టి బ్యాంకులు ఆర్థికంగా బలంగా ఉంటేనే ఈ సమస్యల్ని అధిగమించవచ్చని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులన్నీ కూడా మూలధన సమీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ కావాలి

ఒత్తిడిలో ఉన్న ఆర్థిక సంస్థల పునరుద్ధరణ, తీర్మానం కోసం ఓ చట్టపరమైన వ్యవస్థ రావాలని దాస్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. నిజానికి ఆగస్టు 2017లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్డీఐ  బిల్లును పార్లమెంట్‌కు తెచ్చింది. ఇందులో రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ కూడా ఉన్నది. అయితే వివాదాస్పద ‘బెయిల్‌-ఇన్‌' క్లాజ్‌ కారణంగా దీన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ ఆవశ్యకతను దాస్‌ వివరించారు. దాని లాభాలు బ్యాంక ర్లకు అవసర మన్నారు.

దాస్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు


 • గడిచిన 100 ఏండ్లలో కరోనా వైరస్‌ అత్యంత దారుణమైన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం
 • ఈ మహమ్మారి వల్ల ఉత్పత్తి దిగజారింది, ఎందరో ఉద్యోగాలను కోల్పోయారు
 • ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల అవకాశాలు సన్నగిల్లాయి. మార్కెట్‌లో స్తబ్ధత నెలకొన్నది
 • కొవిడ్‌-19 మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థకు విషమ పరీక్షే
 • ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి గతేడాది ఫిబ్రవరి నుంచి రేపో రేటును 135 బేసిస్‌ పాయింట్లు తగ్గించాం
 • దేశ ఆర్థిక వృద్ధిరేటు, సుస్థిరతలకే సెంట్రల్‌ బ్యాంక్‌   తొలి ప్రాధాన్యత
 • ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగాల్లో రాబోయే ముప్పులను పసిగట్టేందుకు నిఘాను బలపరుస్తున్నాం
 • కరోనా వైరస్‌ నేపథ్యంలో అన్ని రకాల రుణాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పెట్టుబడులూ వెనక్కి పోవచ్చు
 • ఈ సంక్షోభ సమయంలో భారతీయ కంపెనీలు, పరిశ్రమలు మెరుగ్గా స్పందించాయి
 • పీఎంసీ బ్యాంక్‌ సంక్షోభాన్ని చక్కదిద్దుతున్నాం


logo