మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 25, 2020 , 00:17:45

‘మొండి’గండం

‘మొండి’గండం

  • బ్యాంకుల నిరర్థక ఆస్తులు కనీసం 12.5 శాతానికి చేరే అవకాశం
  • ఒత్తిడులు అధికమైతే 14.7 శాతానికి పెరగొచ్చన్న ఆర్బీఐ

ముంబై, జూలై 24: వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి దేశంలోని అన్ని బ్యాంకుల మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) వాటి మొత్తం రుణాల్లో కనీసం 12.5 శాతానికి చేరుకోవచ్చని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) అంచనా వేసింది. రుణాల నాణ్యత (అసెట్‌ క్వాలిటీ)పై ఒత్తిడులు మరింత అధికమైతే ఎన్‌పీఏలు 14.7 శాతానికి పెరుగవచ్చని తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌)లో ఆర్బీఐ అభిప్రాయపడింది. ‘ఈ ఏడాది మార్చి చివరి నాటికి 8.5 శాతంగా ఉన్న షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల నిరర్థక ఆస్తులు.. వచ్చే ఏడాది మార్చి నాటికి కనీస స్థాయిలో 12.5 శాతానికి చేరుకోవచ్చు. 

స్థూల ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారితే మొండి బాకీలు ఇంకా అధికమై 14.7 శాతానికి చేరే అవకాశమున్నది’ అని రిజర్వు బ్యాంకు స్పష్టం చేసింది. స్థూల ఆర్థిక ఒడిదుడుకుల వల్ల బ్యాంకుల బ్యాలెన్స్‌షీట్లపై, క్యాపిటల్‌ టు రిస్క్‌-వెయిటెడ్‌ అసెట్స్‌ రేషియో (క్రార్‌)పై 12 నెలల పాటు పడే ఒత్తిడులను నాలుగు స్థాయిలు (కనీసం, మధ్యస్థం, అధికం, మరింత అధికం)గా వర్గీకరిస్తారు. ఈ ఒత్తిడులు కనీస స్థాయిలో ఉంటే ఈ ఏడాది మార్చి చివరి నాటికి 11.3 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి వచ్చే మార్చి నాటికి 15.2 శాతానికి పెరుగవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఇదే సమయంలో ప్రైవేట్‌ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి 4.2 శాతం నుంచి 7.3 శాతానికి, విదేశీ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి 2.3 శాతం నుంచి 3.9 శాతానికి పెరుగవచ్చని తెలిపింది. 

అలాగే ఈ ఏడాది మార్చి నాటికి 14.6 శాతంగా ఉన్న ‘క్రార్‌' వచ్చే మార్చి నాటికి కనీసం 13.3 శాతానికి, ఒత్తిడులు మరింత అధికంగా ఉంటే 11.8 శాతానికి తగ్గవచ్చని రిజర్వు బ్యాంకు అభిప్రాయపడింది. ఇదే గనుక జరిగితే వచ్చే ఏడాది మార్చి నాటికి ఐదు బ్యాంకులు కనీస మూలధన లక్ష్యాలను అందుకోవడంలో విఫలం కావచ్చని తెలిపింది. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకుల కామన్‌ ఈక్విటీ టైర్‌-1 (సీఈటీ-1) మూల ధన నిష్పత్తి 11.7 శాతంగా ఉన్నదని, ఇది వచ్చే ఏడాది మార్చి నాటికి వత్తిడులు తక్కువగా ఉంటే 10.7 శాతానికి, వత్తిడులు మరింత అధికంగా ఉంటే 9.4 శాతానికి తగ్గవచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విధ్వంసం ఎప్పటివరకు కొనగుతుందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదని, ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు గణనీయంగా తగ్గే ముప్పు పొంచి ఉన్నదని ఆర్బీఐ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు క్షీణిస్తుందని రిజర్వు బ్యాంకు గతంలోనే చెప్పినప్పటికీ ఆ క్షీణత ఎంత మేరకు ఉంటుందో వెల్లడించలేదు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో మైనస్‌ 9.5 శాతం మేరకు ప్రతికూల వృద్ధిరేటు నమోదు కావచ్చని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఆర్థిక వ్యవస్థ భేష్‌

దేశంలో ఓవైపు కరోనా భయాలు, మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నదని ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. నష్టభయాన్ని ఎదుర్కొనేందుకు రుణదాతలు అతిగా విముఖత ప్రదర్శించకూడదని ఆయన సూచించారు. నష్టభయాన్ని ఎదుర్కొనేందుకు అనేక మార్గాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం రుణదాతలు నష్టభయాన్ని ఎదుర్కొనేందుకు విముఖత చూపుతుండటంతో అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక రంగంపై కరోనా సంక్షోభ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు చేపట్టిన చర్యలతో ప్రతికూలతలు తగ్గాయన్నారు. ఆర్థిక, ద్రవ్య పరపతి విధానాలతోపాటు నియంత్రణ సంస్థలు చేపట్టిన చర్యలతో ఫైనాన్షియల్‌ మార్కెట్లు సాధారణ స్థితిలోనే కొనసాగుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ కరోనా సంక్షోభంతోపాటు ప్రస్తుతం వివిధ దేశాల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద సవాళ్లను విసురుతున్నాయని శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. 


logo