శనివారం 30 మే 2020
Business - Feb 15, 2020 , 00:13:36

పది నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం

పది నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
  • జనవరిలో 3.1 శాతంగా నమోదు..
  • భగ్గుమన్న ఉల్లి, బంగాళాదుంప ధరలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: టోకు ధరల సూచీ కూడా పది నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. ఆహార పదార్థాల్లో ముఖ్యంగా ఉల్లి, బంగాళాదుంపల ధరలు భగ్గుమనడంతో గత నెలకుగాను టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.10 శాతానికి చేరుకున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. డిసెంబర్‌లో 2.59 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ ఆ తర్వాతి నెలకుగాను భారీగా పెరిగింది. గతేడాది ఇదే నెలలో 2.76 శాతంగా ఉన్నది. అంతకుముందు ఏప్రిల్‌ 2019లో నమోదైన 3.18 శాతం ఇప్పటి వరకు ఉన్న గరిష్ఠ స్థాయి. 


ఆహార పదార్థాలకు సంబంధించిన ధరల సూచీ 11.51 శాతం స్థిరంగా ఉండగా, వీటిలో కూరగాయలకు సంబంధించిన సూచీ 52.72 శాతానికి ఎగబాకింది. వీటిలో ముఖ్యంగా ఉల్లిగడ్డ ధర ఏకంగా 293 శాతం ఎగబాకగా, బంగాళాదుంప ధరల సూచీ 87.84 శాతంగా నమోదైంది. గత కొన్ని నెలలుగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకుంటున్న తయారీ ఆహార విభాగం జనవరిలో 0.34 శాతానికి చేరుకోగా, చమురు 3.42 శాతంగాను, పవర్‌ -1.46 శాతంగా నమోదయ్యాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న పలు వస్తువులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడంతో భవిష్యత్తులో టోకు ధరల సూచీ మరింత పెరిగే అవకాశాలున్నాయని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్‌ తెలిపారు. ద్రవ్యోల్బణానికి సంబంధించిన వస్తువులపై కూడా సుంకం పెంచడం ఇందుకు కారణమన్న ఆయన..కరోనా వైరస్‌తో క్రూడాయిల్‌ కలుపుకొని కమోడిటీ ఉత్పత్తుల ప్రియంకానున్నయన్నారు.


logo