శనివారం 06 జూన్ 2020
Business - Apr 20, 2020 , 00:03:52

కార్పొరేట్‌ ఫలితాలే దిక్సూచి

కార్పొరేట్‌ ఫలితాలే దిక్సూచి

  • ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: కరోనా వైరస్‌ మరోవైపు  కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికిగాను కార్పొరేట్‌ సంస్థలు విడుదల చేసే ఆర్థిక ఫలితాలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నదని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. కరోనా వైరస్‌తో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి రిజర్వుబ్యాంక్‌ ఇదివరకే రెండుసార్లు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం మరో బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ ప్రకటించబోతున్నదన్న సంకేతాలు వచ్చా యి. ఈ వారంలో ప్రకటిస్తే మార్కెట్లు రివ్వున ఎగిసే అవకాశం ఉన్నదని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ అధినేత వినోద్‌ నాయర్‌ తెలిపారు. ఈ నెల 20 నుంచి లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నదని వ్యాఖ్యానించారు. ఈ వారంలో ఇన్ఫోసిస్‌,  ఏసీసీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి. ప్రస్తుత త్రైమాసికంలో కార్పొరేట్‌ సంస్థలు నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ 20 డాలర్లకు దిగవకు పడిపోవడం, విదేశీ పెట్టుబడుల సరళి, రూపాయి-డాలర్‌ ఎక్సేంజ్‌ రేటు కూడా మదుపరుల్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నదన్నారు. గత వారంలో సెన్సెక్స్‌ 429.10 పాయింట్లు పెరిగింది. మరోవైపు టాప్‌-10 బ్లూచిప్‌ సంస్థల్లో ఆరింటి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ రూ.53,702 కోట్లు పెరిగింది. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌లు అత్యధికంగా లాభపడ్డాయి. 


logo