శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 20, 2020 , 01:24:02

కార్పొరేట్‌ ఫలితాలే కీలకం

కార్పొరేట్‌ ఫలితాలే కీలకం
  • ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

న్యూఢిల్లీ, జనవరి 19: స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ ఈవారంలోనూ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలకు తోడు, వచ్చేవారం చివర్లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌ సూచీలకు కీలకంగా మారాయని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమనుగడంతోపాటు వాణిజ్య యుద్ధంపై యూఎస్‌-చైనా దేశాలు అంగీకార ఒప్పందాలు కుదుర్చుకోవడంతో గతవారంలో భారీగా లాభపడిన స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలోనూ కొనసాగనున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలతోపాటు కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు మదుపరుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అంశాలని వారు పేర్కొన్నారు. ఈవారంలోనే కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, యాక్సిస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ, హావెల్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలు తమ మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి.

రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్లకు క్యూ3 ఆర్థిక ఫలితాలు కీలమని, 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో వ్యవసాయ, గ్రామీణ, ఎరువులు, ప్రభుత్వరంగ సంస్థలు, మౌలిక, నిర్మాణ రంగాలకు ఊతమిచ్చే నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని మోతీలాల్‌ ఓశ్వాల్‌ ఫైనాన్షియల్‌ సేవల హెడ్‌ సిద్దార్థ్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధరలు, రూపాయి-డాలర్‌ ట్రెండ్‌, విదేశీ పెట్టుబడులు కూడా కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఫలితాలు ప్రకటించిన కార్పొరేట్‌ సంస్థలు అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకున్నాయి. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత విడుదలైన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు సోమవారం ప్రారంభంలోనే ప్రభావం చూపనున్నది. మూడో త్రైమాసికంలో టీసీఎస్‌ రూ.8,118 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఆర్‌ఐఎల్‌ రికార్డు స్థాయిలో రూ.11,640 కోట్లు నమోదు చేసుకున్నది. గతవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 345.65 పాయింట్లు చొప్పున లాభపడిన విషయం తెలిసిందే.

బ్లూచిప్‌ సంస్థల జోష్‌

బ్లూచిప్‌ సంస్థల హవా కొనసాగుతున్నది. గతవారంలోనూ టాప్‌-10 సంస్థల్లో ఆరింటి విలువ రూ.60 వేల కోట్లకు పైగా పెరిగింది. వీటిలో హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు అత్యధికంగా లాభపడగా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐటీసీలు స్వల్పంగా పెరిగాయి. కానీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్బీఐలు మాత్రం నష్టపోయాయి. గతవారంలో హెచ్‌యూఎల్‌ నికర విలువ రూ.22,827.94 కోట్లు పెరిగి రూ.4,45,778.10 కోట్లకు చేరుకోగా, ఆర్‌ఐఎల్‌ మరో రూ.20,890.58 కోట్లు అందుకొని రూ.10,02,009.11 కోట్లకు చేరుకున్నది. వీటితోపాటు ఇన్ఫోసిస్‌ రూ.12,605.57 కోట్లు ఎగబాకి రూ.3,26,999.39 కోట్లకు, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రూ.2,599 కోట్లు అధికమై రూ.3,24,455.51 కోట్లకు చేరింది. ఐటీసీ కూడా రూ.2,273.86 కోట్లు ఎగబాకి రూ.2,94,802.65 కోట్లు, టీసీఎస్‌ రూ.1,576 కోట్లు అధికమై రూ.8,32,297.69 కోట్లకు చేరుకున్నది. కానీ, బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ మార్కెట్‌ క్యాప్‌ రూ.12,717.60 కోట్లు కోల్పోయి రూ.2,83,802.65 కోట్లకు జారుకున్నది.


logo