బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 03, 2020 , 00:31:32

పాతాళంలోకి..!

పాతాళంలోకి..!

మూలిగే నక్కమీద తాటి పండు పడ్డ చందంగా తయారవుతున్నది దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి. అసలే మందగమనంతో సతమతమవుతున్న భారత జీడీపీని ఇప్పుడు కరోనా వైరస్‌ కాటేస్తున్నది మరి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో గడిచిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిరేటు క్రమేణా క్షిణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా క్యూ3 (అక్టోబర్‌-డిసెంబర్‌) జీడీపీ ఏడేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.7 శాతానికే పరిమితమైన సంగతీ విదితమే. ఈ క్రమంలో ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధిరేటు మరింత పడిపోయే వీలుందని, అంటువ్యాధి ప్రభావంతో 0.20 శాతం దిగజారే వీలుందని సోమవారం యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ తమ తాజా నివేదికలో అంచనా వేసింది.

  • వృద్ధిరేటుకు కరోనా కష్టాలు
  • ఈ జనవరి-మార్చి జీడీపీపై ప్రభావం పావు శాతం తగ్గొచ్చంటున్న యూబీఎస్‌ సెక్యూరిటీస్‌

ముంబై, మార్చి 2:ఈ ఆర్థిక సంవత్సరానికిగాను వేసిన అంచనాలూ తలకిందులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దకాలం కనిష్ఠ స్థాయిలో 5 శాతంగా నమోదు కావచ్చని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. కానీ కరోనా దెబ్బకు ఇంకా తగ్గిపోవచ్చని జాతీయ, అంతర్జాతీయ నిపుణుల అంచనా.

తయారీ రంగం కుదేలు

చైనాలో కరోనా సృష్టిస్తున్న బీభత్సం.. భారతీయ తయారీ రంగాన్ని కుదేలు చేస్తున్నది. దేశ జీడీపీలో సేవా రంగం తర్వాత తయారీ రంగానిదే అగ్రభాగం. భారత ఉత్పాదక రంగానికి మూల వనరుగా చైనానే ఉన్నది. కీలక రంగాలన్నింటికి ఇక్కడి నుంచే ముడి సరుకు అందుతున్నది. కానీ కరోనా తీవ్రతకు చైనా కర్మాగారాలన్నీ మూతబడ్డాయి. దీంతో అక్కడి నుంచి వచ్చే విడిభాగాల సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా భారత్‌లో తయారీ మందగిస్తున్నది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, ఆటోమొబైల్స్‌ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతున్నది. మిగతా రంగాలపైనా కరోనా ఛాయలు కనిపిస్తుండగా, ఇది జీడీపీని కుంగదీస్తున్నదని యూబీఎస్‌ తెలిపింది. ‘భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని అంచనా వేస్తున్నాం. 0.2 శాతం మేర ప్రభావితం కావచ్చన్నది ప్రాథమిక అంచనా’ అని యూబీఎస్‌ వ్యాఖ్యానించింది.


ఈసారి 4.9 శాతమే: ఫిచ్‌

ఈ ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 4.9 శాతంగానే ఉండొచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేసింది. దేశీయ మార్కెట్‌లో పడిపోయిన డిమాండ్‌, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి ముడి సరుకు సరఫరా ఇబ్బందుల మధ్య గత అంచనాలను సోమవారం సవరించింది. ఇంతకుముందు 5.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) అంచనాలకూ ఫిచ్‌ కోత పెట్టింది. 5.9 శాతం నుంచి 5.4 శాతానికి కుదించింది. మరోవైపు యూబీఎస్‌ సైతం 5.7 శాతం నుంచి 5.6 శాతానికి దించింది. 


కేంద్ర బడ్జెట్‌ తుస్సు

మందగమనంలో ఉన్న దేశ జీడీపీకి కేంద్ర బడ్జెట్‌ ఊతమివ్వలేకపోయిందని ఫిచ్‌ పెదవి విరిచింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బడ్జెట్‌.. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో ఉత్సాహం నింపలేకపోయిందని, దీనివల్లే వృద్ధిరేటుకు కోత పెట్టాల్సి వస్తుందని ఫిచ్‌ చెప్పింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయని, ఈ ప్రభావం పరిశ్రమపై పడుతున్నదని, ఇందుకు బడ్జెట్‌ పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించింది.


ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను నష్టం

కరోనా వైరస్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే గడగడలాడిస్తున్నది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. ఇతర దేశాలకూ వేగంగా విస్తరిస్తుండటంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలూ ప్రభావితమవుతున్నాయి. ఈ క్రమం లో ప్రపంచ జీడీపీ ఈ ఏడాది 2.4 శాతానికి పరిమితం కావచ్చని గ్లోబల్‌ ఏజెన్సీ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) అంచనా వేసింది. వైరస్‌ అదుపులోకి రాకపోతే 1.5 శాతానికి పతనమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం కంటే కరోనా సృష్టిస్తున్న బీభత్సం ఎక్కువని చెప్పింది.





logo