ఆదివారం 24 మే 2020
Business - Mar 23, 2020 , 23:55:21

ప్రొడక్షన్‌ బంద్‌..!

ప్రొడక్షన్‌ బంద్‌..!

  • 31 దాకా నిలిపివేసిన హ్యుందాయ్‌, కియా, బీఎండబ్ల్యూ, రెనో
  • గృహ, ఎలక్ట్రానిక్‌ తయారీ సంస్థలు కూడా.. 

న్యూఢిల్లీ, మార్చి 23: కరోనా వైరస్‌ దెబ్బకు ఆటోమొబైల్‌ సంస్థలు విలవిలలాడుతున్నాయి. ఇదివరకే పలు సంస్థలు ఉత్పత్తిని నిలిపివేయగా..తాజాగా హ్యుందాయ్‌, కియా మోటర్స్‌, విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ, ఫ్రెంచ్‌ సంస్థ రెనోలు తాత్కాలికంగా ప్రొడక్షన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కరోనా వైరస్‌ మహమ్మారి మరింత విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగులకు, వినియోగదారులు, వర్కర్లు, భాగస్వాముల ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కియా మోటర్స్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాల్లో యూనిట్‌ను నెలకొల్పింది. 

అలాగే బీఎండబ్ల్యూ కూడా ఈ నిర్ణయం తీసుకున్నది. చెన్నైలో ఉన్న ప్లాంట్‌ను ఈ నెల చివరి వరకు మూసివేసిన సంస్థ..ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించింది. రెనో కూడా చెన్నైలో ఉన్న ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు గృహోపకరణాలు, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ సంస్థలు కూడా ఈ నెల చివరి వరకు తమ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. వీటిలో సామ్‌సంగ్‌, ఎల్‌జీ, పానసోనిక్‌, గోద్రేజ్‌ అప్లయెన్స్‌లు ఉన్నాయి. నోయిడా, చెన్నై ప్లాంట్లలో మొబైల్‌ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషిన్ల, ఏసీ, ఆడియో ఉత్పత్తులు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు పానసోనిక్‌,  సామ్‌సంగ్‌ ప్రకటించింది. చైనా నుంచి కీలక విడిభాగాల దిగుమతులు నిలిచిపోవడంతో క్రమంగా ఉత్పత్తిని తగ్గించుకుంటు వచ్చిన ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థలు..ప్రస్తుతం ఈ మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తుండటంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. 

టీవీఎస్‌ రెండు రోజులు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కూడా ప్లాంట్‌ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉద్యోగుల భద్రత కల్పించాలనే ఉద్దేశంతో బుధవారం వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్లాంట్‌లను మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.  ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు, వైరస్‌ మరింత ముదిరితే బంద్‌ను కొనసాగించనున్నట్లు సంకేతాలిచ్చారు. 


logo