గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Feb 07, 2020 , 03:40:48

ఇప్పటికైతే ఇంతే.. కీలక వడ్డీరేట్లు యథాతథం

ఇప్పటికైతే ఇంతే.. కీలక వడ్డీరేట్లు యథాతథం
 • రెపో, రివర్స్ రెపో జోలికి వెళ్లని ఆర్బీఐ.. ద్రవ్యసమీక్షను వెంటాడిన ద్రవ్యోల్బణ భయాలు
 • ఎంఎస్‌ఎంఈ, గృహ, ఆటో రుణాలకు ఊతం.. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లు
 • అంతర్జాతీయ వాణిజ్యంపై కరోనా ప్రభావం: ఆర్బీఐ గవర్నర్ దాస్

ముంబై, ఫిబ్రవరి 6: కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి(2019-20)గాను గురువారం ఇక్కడ ముగిసిన చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో, రివర్స్ రెపో జోలికి వెళ్లకూడదని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతో రెపో రేటు (దేశీయ వాణిజ్య బ్యాంకులకు తామిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 5.15 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు (దేశీయ వాణిజ్య బ్యాంకుల నుంచి తాము తీసుకున్న నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు) 4.90 శాతం వద్దే ఉన్నాయి. అంతకుముందు ద్రవ్యసమీక్ష (డిసెంబర్)లోనూ కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచిన సంగతి విదితమే. గతేడాది ఫిబ్రవరి నుంచి వడ్డీరేట్లను ఆర్బీఐ వరుసగా తగ్గిస్తూ వచ్చింది. అయితే ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో రెపో, రివర్స్ రెపోల కోతలకు ఆర్బీఐ సాహసించలేకపోయింది. డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 7.35 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. నిజానికి ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం ఉంటే కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతుంది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఆ పని చేయలేకపోయింది. గడిచిన దశాబ్దానికిపైగా కాలంలో ఎన్నడూలేనంతగా ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో వృద్ధిరేటుకు ఊతమివ్వాలని వడ్డీరేట్లను ఎక్కడివక్కడే ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇక ఖాతాదారుల డిపాజిట్లపై బీమా పరిమితిని పెంచడం వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లేమీ ప్రభావితం కాబోవని ఆర్బీఐ అన్నది. రూ.1 లక్ష నుంచి 5 లక్షలకు బీమాను పెంచిన విషయం తెలిసిందే. కస్టమర్లు చేసే ప్రతీ డిపాజిట్‌పై రూ.100కు 12 పైసల చొప్పున గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు బ్యాంకులు ఆర్బీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. డిపాజిటర్ల ప్రయోజనార్థం ఆర్బీఐ తీసుకున్న నిర్ణయమిది. పీఎంసీ బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలోనే ఈ పరిమితిని ఆర్బీఐ పెంచింది. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్త చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)ను అమలు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇక ఏడాది, మూడేండ్ల కాలపరిమితి లాంగ్-టర్మ్ రీపర్చేజ్ ఒప్పందాలను వివిధ పరిమాణాల్లో ఆర్బీఐ ప్రకటించింది. పాలసీ రెపో రేటు వద్ద ఇవి మొత్తం రూ.లక్ష కోట్లుగా ఉంటాయి. రుణాలపై బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహపడగలదని ఆర్బీఐ గవర్నర్ దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లను చొప్పించడమే తమ లక్ష్యమన్న ఆయన ఈ నెల 15 నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు.


అంతా వడ్డీరేట్లే కాదు

దేశ వృద్ధిరేటును పెంచేందుకు ఆర్బీఐకి ఎన్నో మార్గాలున్నాయని, వడ్డీరేట్ల తగ్గింపు చర్యలు ఒక్కటే కావని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్రవ్యసమీక్ష తర్వాత దాస్ విలేకరులతో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు ఆర్బీఐ ఎన్నో రకాలుగా ప్రయత్నించవచ్చని, వడ్డీరేట్ల తగ్గింపే వృద్ధిరేటు ప్రగతికి మార్గం కాదని అన్నారు. ఇదిలావుంటే ద్రవ్యలోటు లక్ష్యాల సాధన కోసం మరింత కరెన్సీని ముద్రించే యోచనేదీ ఆర్బీఐకి లేదని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లు పడిపోయిన నేపథ్యంలో వరుసగా గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాలను సవరిస్తూ పోతున్నది. నిధుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణల్నీ పెంచుతున్నది. 


రుణాలకు ప్రోత్సాహం

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ)లకు, గృహ, ఆటో రంగాలకు మరిన్ని రుణాలు అందేలా ఆర్బీఐ ప్రోత్సాహం ఇచ్చింది. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) నిర్వహణ నిబంధనల్లో సర్దుబాటుకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం సీఆర్‌ఆర్ 4 శాతంగా ఉన్నది. దీని ప్రకారం బ్యాంక్ మొత్తం డిపాజిట్లలో 4 శాతానికి సమానమైన నిధులను ఆర్బీఐ వద్ద సదరు బ్యాంకర్లు తప్పక డిపాజిట్ చేయాలి. బ్యాంకులు నగదు కొరతను ఎదుర్కొంటున్నప్పుడు ఈ సీఆర్‌ఆర్‌లో ఆర్బీఐ సర్దుబాట్లు చేసి ఉపశమనం ఇస్తుంది. ఈ క్రమంలోనే ఎంఎస్‌ఎంఈ, గృహ, ఆటో రంగాల కోసం బ్యాంకుల మొత్తం డిపాజిట్ల గణనకు విశ్రాంతినిచ్చింది. తద్వారా పెరిగే డిపాజిట్ల నిధులను ఆయా రంగాలకు రుణాలుగా ఇచ్చుకునే వెసులుబాటు బ్యాంకులకు కలిగింది. ఈ ఏడాది జూలై వరకు ఇది అమల్లో ఉంటుంది. 


వచ్చేసారి జీడీపీ 6 శాతం

వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను దేశ జీడీపీని 6 శాతంగా అంచనా వేసింది ఆర్బీఐ. గత నెల పార్లమెంట్‌కు వచ్చిన ఆర్థిక సర్వే అంచనా 6-6.5 శాతంగా అంచనా వేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వృద్ధిరేటును పలు రంగాలు ప్రభావితం చేస్తాయని, ప్రైవేట్ రంగ వినియోగం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత డిమాండ్, అంతర్జాతీయ పరిస్థితులు తదితర అంశాలపై జీడీపీ ఆధారపడి ఉంటుందని దాస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కరోనా వైరస్ దెబ్బ తగలవచ్చన్నారు. ఆదాయం పన్ను (ఐటీ) రేట్ల హేతుబద్ధంతో దేశీయంగా డిమాండ్‌కు ఊతమిచ్చారని బడ్జెట్‌పై దాస్ వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉండొచ్చన్నారు. మొత్తంగా అనిశ్చితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.


ఎంఎస్‌ఎంఈల వృద్ధిరేటుకు దోహదపడే నిర్ణయాలను ఆర్బీఐ తీసుకున్నది. మందగమనం సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ రంగానికి తగినంత ఆర్థిక చేయూతను అందించింది

-రవీ సెహగల్, ఈఈపీసీ చైర్మన్


రుణాల పునర్‌వ్యవస్థీకరణ గడువును పెంచి నిర్మాణ రంగానికి గొప్ప ఊరటను ఆర్బీఐ ఇచ్చింది. నిధుల కొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ రంగానికి ఇది ప్రోత్సాహకర నిర్ణయం

-అనుజ్ పురి, అనరాక్, ప్రాపర్టీ కన్సల్టెంట్స్ చైర్మన్


కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినా.. పలు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థకు ఆర్బీఐ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. లాంగ్-టర్మ్ రెపోలు, సీఆర్‌ఆర్ నిర్వహణ మినహాయింపులు బాగున్నాయి

-రజ్నీశ్ కుమార్, ఎస్బీఐ చైర్మన్


ముఖ్యాంశాలు


 • -5.15 శాతం వద్దే రెపో రేటు
 • -రివర్స్‌రెపో 4.90 శాతం
 • -2020-21కిగాను జీడీపీ అంచనా 6 శాతం
 • -జనవరి-మార్చిలో ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉండొచ్చు
 • -చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్ల సవరణ అవసరం
 • -సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా సీటీఎస్
 • -ఈ నెల 4 నాటికి 471.4బిలియన్ డాలర్లుగా విదేశీ మారకపు నిల్వలు
 • -నిరుడు ఏప్రిల్-నవంబర్ నికరఎఫ్‌డీఐ 24.4 బిలియన్ డాలర్లు
 • -2010-20 (ఫిబ్రవరి 4 నాటికి) లో నికర ఎఫ్‌పీఐ 8.6బిలియన్ డాలర్లు
 • -డిసెంబర్ వరకు ఎంఎస్‌ఎంఈరుణాల పునర్‌వ్యవస్థీకరణ పొడిగింపు
 • -ఏప్రిల్ 3న తదుపరి ద్రవ్యసమీక్ష ఫలితాలు


logo