శుక్రవారం 29 మే 2020
Business - Apr 03, 2020 , 16:37:28

చెదురుతున్న డాలర్‌ డ్రీమ్స్‌ ...ఆందోళనలో భారతీయులు

చెదురుతున్న డాలర్‌ డ్రీమ్స్‌ ...ఆందోళనలో భారతీయులు

 కరోనా వైరస్‌ అగ్ర రాజ్యం అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఒకవైపు పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరుగుతుంటే మరోవైపు ఆర్థిక మాంద్యం చాపకింద నీరులా విస్తరిస్తున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం రావడంతో భారీగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇది హెచ్‌-1బీ వీసాతో  పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులకు శాపంగా మారింది. నష్టాలను పూడ్చుకునేందుకు పలు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం, హెచ్‌1బీ వీసా కల్గిన ఉద్యోగులనే ముందుగా తొలగిస్తామని ప్రకటించడంతో భారతీయులు ఆందోళన చెందుతున్నారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా దెబ్బకు డాలర్‌ కలలు చెదిరిపోతున్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతే నిర్ణీత 60 రోజు ల్లో మరొక ఉద్యోగం పొందలేమని, తిరిగి స్వదేశాలకు వెళ్లలేక రోడ్డున పడతామని అమెరికాలోని భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైట్‌హౌజ్‌ స్పందన కోరు తూ పిటిషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. హెచ్‌-1బీ వీసాల ద్వారా నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో చేర్చుకునేందుకు అమెరికా కంపెనీలకు వీలు కలుగుతుంది. దీని ప్రకారం పెద్ద సంఖ్యలో భారతీయులు అక్కడ పని చేస్తున్నారు. ఏటా హెచ్‌-1బీ పొందుతున్న వారిలో 67 నుంచి 72 శాతం భారతీయులే ఉన్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. ముఖ్యంగా అమెరికాలో కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతుండటంతో ఆ దేశం భీకరంగా నష్టపోతున్నది. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగాల్లో కోత ప్రారంభించగా, మరికొన్ని కంపెనీలు ముం దు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు కొలువులను తొలగిస్తున్నాయి. దీంతో ఈ ప్రతికూల ప్రభావం హెచ్‌1బీ వీసాపై ఉద్యోగాలు చేస్తున్న వారిపై పడనుంది. ప్రస్తుత ఫెడరల్‌ నిబంధన ప్రకారం, ఒకవేళ వీరిలో ఎవరు ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో కేవలం 60 రోజులు మాత్రమే ఉండగలరు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో సహా స్వదేశానికి తిరిగి రావాల్సిందే. అయితే ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలని అక్కడి విదేశీ ఐటీ నిపుణులు అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గడువును 60 నుంచి 180కి పెంచాలని కోరుతున్నారు. 

భారీ స్థాయిలో ఉద్యోగాలకు ఎసరు!

అమెరికాలో కరోనా రోజురోజుకీ విస్తరిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. యూఎస్‌లో ఇప్పటికే లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారంటున్నారు. దాదాపు 35 లక్షల మంది ఇప్పటివరకు జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక అంచనా ప్రకారం 67 మిలియన్ల అమెరికన్ల ఉద్యోగాలు హై రిస్క్‌లో ఉన్నాయని, దాదాపు 47 మిలియన్ల (4.7కోట్లు) మంది నిరుద్యోగులుగా మారొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో దేశంలో నిరుద్యోగ రేటు రికార్డు స్థాయి లో 32 శాతానికి చేరుతుంద ని అమెరికా ప్రభు త్వ నిపుణులు అంచనా వేస్తున్నా రు. గడిచిన వందేండ్ల లో అమెరికా ఇంతటి ఆర్థిక దుస్థితిని ఎదుర్కోకపోవడం గమనార్హం.

చుట్టుముడుతున్న కష్టాలు

హెచ్‌1బీ వీసాతో ఉన్న వారు నిరుద్యోగ ప్రయోజనాలకు అర్హులు కారు. ఈ ప్రయోజనం కోసం వారి జీతం నుంచి తగ్గింపులు ఉన్నప్పటికీ వారు సామాజిక భద్రతా ప్రయోజనాలు పొందలేరని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో హెచ్‌1బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోతే తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. వేరే ఉద్యోగాలు వెతుక్కోవడం అసాధ్యమైన పని. దీంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో స్వదేశాలకు తిరిగి వెళ్లడం సాధ్యపడదు. కాబట్టి ఒకవేళ ఉద్యోగాలు కోల్పోతే ఉండేందుకు ఉన్న 60 రోజుల గడువును 180 రోజులకు పెంచాలని కోరుతున్నారు. దీని కోసం పిటీషన్‌ క్యాంపెయిన్‌ ప్రారంభించారు. వైట్‌ హౌజ్‌ స్ంపదించాలంటే కనీసం లక్ష సంతకాలు కావాలి కాబట్టి సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టారు.

పార్ట్‌టైం జాబ్స్‌ ఉండవ్‌

ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు కరోనా వైరస్‌ రూపంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఎమ్మెస్సీ చదువడానికి అమెరికా వెళ్లిన దీపక్‌ పరిస్థితి మరి అధ్వాన్యంగా తయారైంది. ఇక్కడ బ్యాంకు వద్ద లక్షలాది రూపాయలు రుణం తీసుకొని ఎంచక్క అమెరికాకు వెళ్లి అక్కడ ఎమ్మెస్సీతోపాటు పార్ట్‌టైం ఉద్యోగం చేసి తను తీసుకున్న బ్యాంక్‌ రుణం తీర్చివేయాలని ఎంతో ఆశతో అమెరికా ఫ్లైట్‌ ఎక్కిన దీపక్‌ ఆశలకు కరోనా వైరస్‌ గండికొట్టింది. చదువు మాట దేవుడు ఎరుగు..ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాడు. అటు పార్ట్‌టైం ఉద్యోగం పోయి, ఇటు తిండి లేక బయటకు వెళ్లుదామంటే ఎక్కడి నుంచి కరోనా వైరస్‌ చుట్టుకుంటుందోనని భయాల మధ్య జీవితాన్ని గడుపుతున్నారు. ఇది ఒక దీపక్‌ పరిస్థితి కాదు..తెలుగు రాష్ర్టాలతోపాటు భారత్‌ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడి ఐటీ, ఇతర ఉద్యోగాలు, ఉన్నత చదువులు చదువుకుంటున్న ప్రతివారి పరిస్థితి ఇది. ప్రస్తుతం అక్కడి నిబంధనల ప్రకారం వారానికి 8 గంటల నుంచి 12 గంటల వరకు పార్ట్‌టైం ఉద్యోగం చేసుకునే వీలుంటుంది.  

4.7 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!

యూఎస్‌లో దాదాపు 35 లక్షల మంది ఇప్పటి వరకు జాబ్‌లెస్‌ క్లెయిమ్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక అంచనా ప్రకారం, 67 మిలియన్ల అమెరికన్ల ఉద్యోగాలు హై రిస్క్‌లో ఉన్నాయి. ఇందులో దాదాపు 4.7కోట్లు మంది నిరుద్యోగులుగా మారొచ్చని అంచనా.

32%

అమెరికా నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో 32శాతానికి చేరుతుందని నిపుణులు అంచనా

67%

ఏటా హెచ్‌-1బీ పొందుతున్న వారిలో 67 నుంచి 72శాతం భారతీయులే ఉన్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాపించడంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ స్తంభించాయి. ముఖ్యంగా అమెరికా కంపెనీలు ముందు జాగ్రత్తతో నష్టాల బారి నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి.


logo