ఆదివారం 24 మే 2020
Business - Mar 26, 2020 , 23:33:04

బ్యాంకులకు కష్టాలే

బ్యాంకులకు కష్టాలే

-కరోనాతో ఫిచ్‌ హెచ్చరిక

ముంబై, మార్చి 26: కరోనా వైరస్‌ ప్రభావంతో భారతీయ బ్యాంకులకు మరిన్ని కష్టాలు రావచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ హెచ్చరించింది. ఇప్పటికే మొండి బకాయిల (ఎన్‌పీఏ లేదా నిరర్థక ఆస్తులు) సమస్య, మోసాలు-కుంభకోణాలతో వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోయిన దేశీయ బ్యాంకింగ్‌ రంగానికి కరోనా ఉధృతి కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతున్నదని అభిప్రాయపడింది. గురువారం బ్యాంకులకు సంబంధించిన ఆపరేటింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌ స్కోర్‌ను ‘బీబీప్లస్‌' నుంచి ‘బీబీ’ స్థాయికి ఫిచ్‌ కుదించింది. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం, బ్యాంకింగ్‌ రంగానికి దానివల్ల కలిగే నష్టాలను బేరిజు వేసుకుని ఫిచ్‌ తమ రేటింగ్‌కు కోత పెట్టింది. లాక్‌డౌన్‌తో పారిశ్రామికోత్పత్తి, దేశీయ వినియోగ సామర్థ్యాలు కుంటుబడుతాయని ఫిచ్‌ పేర్కొన్నది. అంతిమంగా ఈ వ్యవస్థకు రుణాలిచ్చే బ్యాంకులే నష్టపోతాయన్నది.

1 నుంచి విలీనాలు అమల్లోకి

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలు ముందుగా నిర్దేశించినట్లుగానే వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో విలీనాల అమలు వాయిదాపడే వీలుందా? అన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అలాంటిదేమీ లేదన్నారు. 


logo