శనివారం 28 నవంబర్ 2020
Business - Oct 30, 2020 , 00:43:23

వన్నె తగ్గిన బంగారం

వన్నె తగ్గిన బంగారం

  • దేశీయ కొనుగోళ్లపై కరోనా ప్రభావం
  • అధిక ధరలతోనూ వినియోగదారులు దూరం
  • జూలై-సెప్టెంబర్‌లో 30 శాతం పడిపోయిన డిమాండ్‌

ముంబై, అక్టోబర్‌ 29: కరోనా వైరస్‌ ప్రభావం దేశీయ పసిడి మార్కెట్‌పైనా పడింది. ఈ జూలై-సెప్టెంబర్‌ (క్యూ3)లో 30 శాతం కొనుగోళ్లు పడిపోయినట్లు గురువారం విడుదల చేసిన నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలియజేసింది. కొవిడ్‌-19 పరిస్థితులకుతోడు మార్కెట్‌లో అధిక ధరలు సైతం కొనుగోలుదారులను దూరం చేశాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం పీఆర్‌ పీటీఐకి తెలిపారు. అయితే ఏప్రిల్‌-జూన్‌తో పోల్చితే పెరిగాయని, నాడు 64 టన్నుల కొనుగోళ్లే జరిగాయని వివరించారు. ఆగస్టులో లాక్‌డౌన్‌ సడలింపులు, కాస్త ధరలు తగ్గుముఖం పట్టడం కలిసొచ్చాయన్నారు. కాగా, కస్టమర్లను ఆకట్టుకునేందుకు పలు ప్రముఖ సంస్థలు డిజిటల్‌ లావాదేవీలకు ప్రాధాన్యతనిచ్చారని, గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)కూ ఆదరణ పెరిగిందని చెప్పారు. అయితే ఆర్థిక మాంద్యంతో ప్రభావితమైన 2009 లోనూ బంగారం డిమాండ్‌ భారీగా పడిపోయిందని, అయినప్పటికీ తర్వాతి సంవత్సరాల్లో ఒక్కసారిగా పుంజుకున్నదని సోమసుందరం గుర్తుచేశారు. అలాగే కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పసిడి కొనుగోళ్లు ఊపందుకుంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

విదేశీ మార్కెట్‌లోనూ వెలవెలే

  • అంతర్జాతీయంగానూ బంగారం డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉన్నది. గ్లోబల్‌ గోల్డ్‌ డిమాండ్‌ ఈ జూలై-సెప్టెంబర్‌లో 19% క్షీణించి 892.3 టన్నులుగా నమోదైంది. 2009 క్యూ3 నుంచి ఇదే అత్యల్పం. గతేడాది 1,100.2 టన్నులుగా ఉన్నట్లు డబ్ల్యూజీసీ తెలిపింది. పెట్టుబడుల డిమాండ్‌ 21% పెరుగగా, బంగారం కడ్డీలు, నాణేల కొనుగోళ్లకు, ఈటీఎఫ్‌లకు ఆదరణ కనిపించింది.
  • దేశీయంగా జూలై-సెప్టెంబర్‌లో బంగారం డిమాండ్‌ 86.6 టన్నులుగా నమోదైంది. గతేడాది (123.9 టన్నులు)తో పోల్చితే 30% తక్కువ. డిమాండ్‌ విలువ ఈసారి రూ.39,510 కోట్లుగా ఉంటే, క్రిందటిసారి రూ.41,300 కోట్లుగా ఉన్నది.
  • మొత్తం ఆభరణాల డిమాండ్‌ 48% పడిపోయి 52.8 టన్నులుగా ఉన్నది. పోయినసారి 101.6 టన్నులు. డిమాండ్‌ విలువ ఈసారి రూ.24,100 కోట్లుగా ఉంటే, గతేడాది రూ.33,850 కోట్లు.
  • ఈ జూలై-సెప్టెంబర్‌లో 33.8 టన్నుల పసిడిపై పెట్టుబడులు పెట్టారు. గతేడాది (22.3 టన్నులు)తో పోల్చితే 52% పెరిగింది. ఈ పెట్టుబడుల విలువ ఈసారి రూ.15,410 కోట్లుగా, నిరుడు రూ. 7,450 కోట్లుగా ఉన్నది.
  • 41.5 టన్నుల బంగారం శుద్ధి జరిగింది. గతేడాదితో పోల్చితే 14% ఎగిసింది. గతంలో 36.5 టన్నులుగానే ఉన్నది.
  • ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ మధ్య 395.6 టన్నుల బంగారానికి డిమాండ్‌ కనిపించింది. గతేడాది ఇది 170.7 టన్నులే. పెట్టుబడులూ 81.7 టన్నుల నుంచి 100.4 టన్నుల స్థాయికి చేరాయి.