సోమవారం 01 జూన్ 2020
Business - Apr 13, 2020 , 00:15:19

ఐటీ పరిశ్రమకు దెబ్బే

ఐటీ పరిశ్రమకు దెబ్బే

  • ఉద్యోగ కోతలకు అవకాశం
  • లాక్‌డౌన్‌పై నాస్కామ్‌ మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12: ఐటీ రంగ ఉద్యోగులకు లాక్‌డౌన్‌ దెబ్బేనని నాస్కామ్‌ మాజీ అధ్యక్షుడు ఆర్‌ చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు. ఉద్యోగ కోతలకు ఆస్కారం ఉంటుందన్నారు. అయితే వర్క్‌ ఫ్రం హోం సంస్కృతి వల్ల దీర్ఘకాలంలో సత్ఫలితాలు ఉండగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనివల్ల కొత్త మార్గాలు ఆవిష్కృతమయ్యే వీలుందన్న ఆయన ఐటీ సంస్థల ఖర్చులు ఆదా కావచ్చని చెప్పారు. ఈ మహమ్మారి స్టార్టప్‌ల ఉసురు కూడా తీస్తున్నదని, నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని పీటీఐతో మాట్లాడుతూ తెలిపారు. పెద్ద సంస్థలు ఉద్యోగులను వదులుకోవని, జీతాలు చెల్లించడానికి తగినన్ని నగదు నిల్వలు ఉంటాయన్న ఆయన చిన్న సంస్థలకే చిక్కులని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితులపై నాస్కామ్‌ మాజీ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌ రెడ్డి స్పందిస్తూ యావత్‌ ప్రపంచంపై కరోనా ప్రభావం ఉన్నందున ఐటీ రంగం సహజంగానే ఇబ్బందులకు గురవుతుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఏదీ లేదన్నారు. 

వెంటాడుతున్న నిరుద్యోగ భయం

కరోనా వైరస్‌ సంక్షోభం ఉద్యోగుల్లో నిరుద్యోగ భయాలను రేకెత్తిస్తున్నది. లాక్‌డౌన్‌పై స్పష్టత లేకపోవడంతో తమ ఉద్యోగాలు ఉంటాయా? ఉండవా? అన్న సందిగ్ధంలో చాలామంది ఉన్నారిప్పుడు. రోజురోజుకూ వీరి సంఖ్య పెరిగిపోతుండగా, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతున్నది. 


logo