బుధవారం 01 ఏప్రిల్ 2020
Business - Feb 22, 2020 , 03:46:13

కాటేస్తున్న కరోనా

కాటేస్తున్న కరోనా
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్న వైరస్‌
  • భయం గుప్పిట్లో వృద్ధి చోదక దేశాలు.. చైనా ఉత్పాదక రంగం కుదేలు
  • భారత్‌సహా ఎన్నో దేశాలపై తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కరోనా వైరస్‌.. చైనాలో పుట్టి ప్రపంచాన్ని పట్టుకు పీడిస్తున్న ప్రాణాంతక మహమ్మారి. ఇప్పుడీ అంటువ్యాధి మనుషుల్నేగాక.. దేశాల ఆర్థిక వ్యవస్థల్నీ కబళించేస్తున్నది. గ్లోబల్‌ ఎకానమీకి తయారీ కేంద్రంగా విరాజిల్లుతున్న చైనా.. ప్రస్తుతం కరోనా (కోవిడ్‌-19) పడగ నీడలో బిక్కుబిక్కుమంటున్నది. ఈ పరిణామం భారత్‌సహా ప్రపంచ వృద్ధి చోదక దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తుండగా, అంతర్జాతీయ వృద్ధిరేటు ప్రమాదంలో పడింది. డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ తాజా నివేదికలో ఈ ఏడాది జూన్‌ నాటికి వైరస్‌ తీవ్రత అదుపులోకి రాకపోతే ప్రపంచ జీడీపీ 1 శాతం పడిపోయే అవకాశాలున్నాయని తెలిపింది. చైనాకు రాకపోకలు తగ్గిపోవడంతో ఒక్క విమానయాన రంగానికే సుమారు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనాలున్నాయి. ఇలా ఆటో, ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగాల నష్టాలను చూస్తే.. ప్రపంచ జీడీపీకి పెను నష్టం తప్పదన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నది.

చైనా ఎందుకంత ముఖ్యం

గత 40 ఏండ్లకుపైగా చైనా ఆర్థిక వృద్ధి అద్భుతరీతిలో దూసుకుపోతున్నది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది. చైనా జీడీపీ విలువ 13.6 లక్షల కోట్ల డాలర్లు. 20.5 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో ఉన్నది. చైనా ఉత్పాదక రంగం కుటీర పరిశ్రమ స్థాయిలో వేళ్లూనుకుని ఉండటంతో ప్రపంచ తయారీ కేంద్రంగా ఆవిర్భవించింది. జనాభా పరంగా అతిపెద్ద మార్కెట్‌ చైనాకు సొంతమవడం కూడా ఇక్కడ ఉత్పత్తిని పెంచగా, అన్ని రంగాల్లో విపరీతమైన టెక్నాలజీ చౌకగా అందుబాటులో ఉండటం, చైనీయుల్లో నైపుణ్యం, ప్రతిభకు కొదవే లేకపోవడం.. ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగేలా చేసింది. అన్నిటికంటే మించి పొరుగున భారత్‌ వంటి భారీ వినియోగ దేశం ఉండటం చైనాకు అన్ని రకాలుగా కలిసొచ్చింది. ఈ మధ్యకాలంలో అమెరికాతో వాణిజ్య యుద్ధం చైనాను కాస్త ఇరుకున పడేసినా.. ఎలక్ట్రానిక్స్‌, టెలికం వంటి కీలక రంగాల ఉత్పత్తుల తయారీకి అనువుగా ఉండటంతో బహుళజాతి సంస్థలన్నింటికీ చైనానే అడ్డాగా మారింది. 

ఏం జరుగుతున్నది?

కరోనా వైరస్‌ ధాటికి చైనా విలవిలలాడిపోతున్నది. ఇప్పటిదాకా మృతుల సంఖ్య 2,200లపైనే. బాధితులు సుమారు 76 వేలుగా ఉన్నారు. ఈ అంటువ్యాధిని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలనే చేస్తుండగా, జనజీవనం స్తంభించిపోయింది. దీంతో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. చైనా కేంద్రంగా ప్రపంచ మార్కెట్‌ను నడిపిస్తున్న సంస్థలన్నీ మూతబడగా, ఉత్పాదక రేటు దాదాపు జీరో స్థాయికి పడిపోయింది. ముఖ్యంగా చైనా నుంచి ఇతర దేశాలకు వెళ్తున్న ముడి సరుకు, విడి భాగాల సరఫరాకు బ్రేక్‌ పడింది. టెలివిజన్లు, మొబైల్స్‌, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లుసహా ఎన్నో గృహోపకరణాలు, ఆటో రంగ ఉత్పత్తుల తయారీ ఆగిపోయింది. దీంతో భారత్‌ తదితర దేశాల్లో వస్తూత్పత్తి చేస్తున్న సంస్థలకు ముడి సరుకు కొరత ఏర్పడింది. ఉదాహరణకు గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ 800 సరఫరాదారుల్లో 290 చైనాలోనే ఉన్నాయి. సంస్థ ఆదాయంపై కరోనా వైరస్‌ ప్రభావం ఉంటుందని ఇటీవల యాపిల్‌ ప్రకటించినదీ తెలిసిందే. ఇక చైనాలోని హ్యుందాయ్‌ ప్లాంట్‌ మూతపడగా, దక్షిణ కొరియా కేంద్రాలకు ఇక్కడి నుంచి వెళ్లాల్సిన విడి భాగాలకు బ్రేకులుపడ్డాయి. గ్లోబల్‌ టెలివిజన్‌ ఉత్పత్తిలో చైనా వాటా 9 శాతంగా ఉండగా, దేశీయ మార్కెట్‌లో చైనా సంస్థల ఆధిపత్యం నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ భారత జీడీపీనీ దెబ్బతీస్తున్నాయి. అటు చైనా, ఇటు భారత్‌ రెండూ ప్రపంచ జీడీపీలో కీలకమే. అలాగే అమెరికాసహా చాలా దేశాలకు చైనా ఎగుమతులు ఎంతో ప్రధానం. దీంతో ప్రపంచ వృద్ధిరేటే ప్రభావితమవుతున్నది.

స్టాక్‌ మార్కెట్లకూ దెబ్బే

కరోనా వైరస్‌ దెబ్బ.. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు, ముఖ్యంగా ఆసియా సూచీలకు పెద్ద ఎత్తునే తగులుతున్నది. చైనా, హాంకాంగ్‌సహా భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, తైవాన్‌ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. మదుపరులు తమ పెట్టుబడులపై స్థిరమైన నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారు. చైనాలో దిగజారిన ఆర్థిక పరిస్థితులు.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలనూ ప్రభావితం చేస్తున్నాయి. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారుగా ఉన్నది మరి. దీంతో ఐరోపా తదితర పశ్చిమాది దేశాల స్టాక్‌ మార్కెట్లూ నష్టాలను చవిచూస్తున్నాయి. కాపర్‌, ఇనుప ఖనిజం వంటి మెటల్‌ మార్కెట్లూ నేలచూపులు చూస్తుండగా, పర్యాటక, ఆటో, లగ్జరీ రంగాల షేర్లు కుదేలవుతున్నాయి.

భారత్‌పై ప్రభావం..

కరోనా వైరస్‌ భారత్‌లో ప్రాణ నష్టాన్ని కలిగించకపోయినా.. ఆర్థిక నష్టాన్ని మాత్రం సృష్టిస్తున్నది. ఔషధ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటో రంగాలపై వైరస్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. ఈ రంగాల దిగుమతుల్లో 70 శాతం చైనావే కావడం ఇందుకు కారణం. భారత్‌లో ఆయా రంగాల తయారీ కేంద్రాలున్నా.. ముడి సరుకు కోసం మాత్రం విదేశాలపై, ముఖ్యంగా చైనాపైనే ఆధారపడాల్సి వస్తున్నది. దీంతో కరోనా దెబ్బకు ఆగిపోయిన చైనా ఉత్పత్తి.. దేశీయ తయారీనీ అడ్డుకుంటున్నది. చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న ఔషధ పదార్థాలు 69 శాతంగా, సోలార్‌ ప్యానెల్స్‌ 75 శాతంగా, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ 45 శాతంగా ఉన్నాయి. నిరుడు భారతీయ దిగుమతులు 484 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 85 బిలియన్‌ డాలర్లు చైనావేనని క్రిసిల్‌ గుర్తుచేసింది. ఈ క్రమంలోనే చైనాలో కరోనా నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషించాలని భారత్‌కు ఫిక్కీ వంటి వ్యాపార, పారిశ్రామిక సంఘాలు సూచిస్తున్నాయి. అసలే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న భారత్‌కు చైనా కీలక దిగుమతులు ఆగిపోవడం వల్ల తయారీ కార్యకలాపాలు కుంటుపడి.. ధరలు పెరిగి ఇటు ద్రవ్యోల్బణం, అటు నిరుద్యోగం పెరిగిపోయే వీలుందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుంటే కరోనా వైరస్‌ సెగ.. దేశీయ పౌల్ట్రీ పరిశ్రమకూ తగులుతున్నది. గడిచిన 15 రోజుల్లో ఒక్క మహారాష్ట్రలోనే రూ.100 కోట్ల నష్టాన్ని పరిశ్రమ చవిచూసింది. చికెన్‌, గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్‌ వస్తుందన్న తప్పుడు ప్రచారం సోషల్‌ మీడియాలో విపరీతంగా నడుస్తుండటమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. 

సార్స్‌ కంటే పెద్దదే

2002-03 కాలంలో భయపెట్టిన సార్స్‌ వ్యాధి కంటే కరోనా వైరస్‌ చేస్తున్న ప్రాణ, ఆర్థిక విధ్వంసం చాలాచాలా ఎక్కువగా ఉన్నది. నాడు 37 దేశాలను వణికించిన సార్స్‌.. 8 వేల మందికిపైగా సోకగా, దాదాపు 750 మందిని బలి తీసుకున్నది. ప్రపంచ జీడీపీపై దీని ప్రభావం కూడా పరిమిత స్థాయిలోనే ఉన్నది. 30 బిలియన్‌ డాలర్ల నుంచి 50 బిలియన్‌ డాలర్ల మధ్యే ప్రభావం ఉండొచ్చని అంచనా. నాడు గ్లోబల్‌ ఎకానమీ విలువ దాదాపు 35 లక్షల కోట్ల డాలర్లే. కానీ ఇప్పుడు అమెరికా, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థల విలువే ఇంతున్నది. దీంతో ప్రపంచ జీడీపీపై కరోనా పంజా గట్టిగానే విసురుతున్నది. ఇక సార్స్‌ కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌.. ఇప్పటికే 2,250 మందిని పొట్టనబెట్టుకున్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 76 వేల మందికి ఈ వైరస్‌ సోకినట్లు స్పష్టమవుతున్నది.


logo
>>>>>>