శుక్రవారం 05 జూన్ 2020
Business - May 20, 2020 , 23:44:45

పెట్టుబడులు యూటర్న్‌

పెట్టుబడులు యూటర్న్‌

  • కరోనా దెబ్బకు విదేశీ మదుపరుల్లో మాంద్యం భయాలు
  • భారత్‌ నుంచి తరలిపోయిన రూ.1.21 లక్షల కోట్లు
  • ఆసియా దేశాల నుంచి రూ.1.97 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి

వాషింగ్టన్‌, మే 20: ఆసియా దేశాల ఆశల్ని కరోనా వైరస్‌ ఆవిరి చేసింది. ఈ మహమ్మారి ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారి తీయడంతో భారత్‌సహా అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను విదేశీ మదుపరులు వెనక్కి తీసుకున్నారు. రూ.1,96,612 కోట్లు (26 బిలియన్‌ డాలర్లు) ఉపసంహరించుకున్నట్లు స్వతంత్ర కాంగ్రెస్‌ పరిశోధనా కేంద్రం (సీఆర్‌ఎస్‌) తమ తాజా నివేదికలో అంచనా వేసింది. భారత్‌ నుంచి రూ.1.21 లక్షల కోట్లు (16 బిలియన్‌ డాలర్లకుపైగా) తరలిపోయాయి. ‘విదేశీ మదుపరులు అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల నుంచి 26 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు అంచనా. భారత్‌ నుంచి 16 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు భావిస్తున్నాం’ అని ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం గురించి రూపొందించిన తాజా నివేదికలో సీఆర్‌ఎస్‌ పేర్కొన్నది. లాక్‌డౌన్‌తో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు స్తంభించిపోవడం, స్టాక్‌ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకోవడం పెట్టుబడుల యూటర్న్‌కు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

నాయకత్వంపై సందేహాలు

కొవిడ్‌-19 మనుషుల మధ్యేగాక.. దేశాల మధ్య కూడా దూరం పెంచింది. విధానపరమైన నిర్ణయాల్లో కనిపిస్తున్న వ్యత్యాసాలు విభేదాలకు దారి తీస్తున్నాయి. అన్ని దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంభిస్తుండటంతో భవిష్యత్‌ నాయకత్వంపై సందేహాలు నెలకొంటున్నాయని సీఆర్‌ఎస్‌ తెలిపింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య సంబంధాలు ఒత్తిడికి లోనవుతున్నాయన్నది. యూరోజోన్‌ తదితర కూటములపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు చెప్పింది.

ఎయిర్‌లైన్స్‌కు అపార నష్టం

ప్రపంచవ్యాప్తంగా విమానయాన పరిశ్రమకు కరోనా వైరస్‌ భీకర నష్టాలనే మిగిల్చింది. ఈ ఏడాది విమానయాన సంస్థలు 113 బిలియన్‌ డాలర్ల నష్టాలను చవిచూడవచ్చని అంచనా. వైరస్‌ కట్టడిలో భాగంగా అంతర్జాతీయ రాకపోకలను దాదాపు అన్ని దేశాలు నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పర్యాటక, ఆతిథ్య రంగాలనూ కుదిపేసింది. ఈ పరిణామం అంతిమంగా ఆయా దేశాల జీడీపీపైనే పడుతుందని సీఆర్‌ఎస్‌ వెల్లడించింది. చైనా, అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియాల్లో పారిశ్రామిక ఉత్పత్తి కూడా చతికిలబడటం గ్లోబల్‌ జీడీపీని దెబ్బతీస్తున్నది. జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, స్పెయిన్‌, ఇటలీ దేశాల్లో 3 కోట్లకుపైగా ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుండటం కరోనా ప్రపంచ విపత్తుకు నిదర్శనంగా నిలుస్తున్నది.

ప్రభుత్వాలకు సవాళ్లు

కరోనా వైరస్‌ సృష్టించిన మహా సంక్షోభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తున్నది. ద్రవ్య, ఆర్థికపరమైన విధానాల అమలులో ప్రభుత్వాలకు సవాల్‌ విసురుతున్నదని సీఆర్‌ఎస్‌ తెలిపింది. స్తంభించిన మార్కెట్‌ పునరుద్ధరణ, ఆర్థిక కార్యకలాపాల్లో స్థిరత్వం కష్టంగా మారుతున్నదని చెప్పింది. మరోవైపు కరోనా అంతానికి వ్యాక్సిన్లను కనిపెట్టడం, ప్రజలను ఈ మహమ్మారి బారినపడకుండా కాపాడుకోవడంపైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నది.


logo