శనివారం 31 అక్టోబర్ 2020
Business - Sep 19, 2020 , 01:53:05

దేశీయ బ్రాండ్లకు కరోనా దెబ్బ

దేశీయ బ్రాండ్లకు కరోనా దెబ్బ

  • ఈ ఏడాది 6% క్షీణించిన టాప్‌-75 బ్రాండ్ల విలువ
  • వచ్చే ఏడాదీ గడ్డు పరిస్థితే: డబ్ల్యూపీపీ

ముంబై, సెప్టెంబర్‌ 18: భారతీయ బ్రాండ్లను కరోనా వైరస్‌ కుంగదీసింది. ఈ ఏడాది టాప్‌-75 సంస్థల బ్రాండ్‌ విలువ గతేడాదితో పోల్చితే 6 శాతం క్షీణించి 216 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్లు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకటనల సంస్థ డబ్ల్యూపీపీ తెలిపింది. కొవిడ్‌-19తో మందగించిన దేశ ఆర్థిక వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తున్నదన్నది. డబ్ల్యూపీపీ, దాని అనుబంధ సంస్థ కంతర్‌ ఈ ఏడాదికిగాను భారతీయ బ్రాండ్ల విలువను తాజాగా విడుదల చేశాయి. ‘బ్రాండ్జ్‌ టాప్‌ 75 మోస్ట్‌ వాల్యుబుల్‌ ఇండియన్‌ బ్రాండ్జ్‌ 2020’ పేరుతో వచ్చిన ఈ జాబితాలో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బ్రాండ్‌ విలువ క్షీణించినా.. అగ్రస్థానంలోనే కొనసాగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బ్రాండ్‌ విలువ సుమారు రూ.16,600 కోట్లుగా ఉన్నది. అలాగే భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం సంస్థల బ్రాండ్‌ విలువ భారీగా పెరిగినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. ఇక రిలయన్స్‌ రిటైల్‌ బ్రాండ్‌ విలువ మరే సంస్థదీ లేనట్లుగా ఏకంగా 102 శాతం పెరిగి 2.3 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. జాబితాలో ఇది 25వ స్థానంలో నిలిచింది. 

టెలికం, ఎఫ్‌ఎంసీజీ పైపైకి

టెలికం, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని సంస్థల బ్రాండ్‌ విలువ భారీగా పెరిగినట్లు డబ్ల్యూపీపీ తెలిపింది. కరోనా ప్రభావంతో సంబంధం లేకుండా వృద్ధి కనిపించినట్లు చెప్పింది. ఈ పరిణామం ఆయా సంస్థలు భవిష్యత్తులో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదం చేయగలదని అభిప్రాయపడింది. కాగా, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ సంస్థల బ్రాండ్‌ విలువ బాగా తగ్గినట్లు డబ్ల్యూపీపీ వెల్లడించింది. మరోవైపు ప్రపంచంలోని టాప్‌-100 సంస్థల బ్రాండ్‌ విలువ ఈ ఏడాది 5.8 శాతం పుంజుకోవడం గమనార్హం.

భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధిబాట పట్టడం అంత సులభం కాదు. దేశంలోని సంస్థలకు చెడ్డ రోజులు మొదలయ్యాయి. వచ్చే ఏడాదీ ఇబ్బందులు తప్పేలా లేవు. జీడీపీ స్వల్పంగా పెరిగితే సరిపోదు. భారీగా వృద్ధిరేటు నమోదైతేనే కంపెనీల బ్రాండ్‌ విలువ కోలుకోవచ్చు. కానీ రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు పరిస్థితుల్ని, అంచనాల్ని మరింతగా దిగజార్చుతున్నాయి’ -ప్రీతీ రెడ్డి, కంతర్‌ ఇన్‌సైట్స్‌ డివిజన్‌ దక్షిణాసియా సీఈవో