బుధవారం 08 ఏప్రిల్ 2020
Business - Mar 18, 2020 , 00:44:43

ఉద్దీపనలకు సై..!

ఉద్దీపనలకు సై..!

-దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

-పొంచి ఉన్న మాంద్యం ముప్పు

-ఆర్థిక, ద్రవ్యపరమైన ప్యాకేజీలు అవసరమంటున్న నిపుణులు

-ఉత్పత్తి పెరుగుదల, ధరల నియంత్రణపై చర్యలుండాలని సూచన 

న్యూఢిల్లీ, మార్చి 17: కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తల్లడిల్లిపోతున్నది. అసలే మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థల్ని ఈ ప్రాణాంతక మహమ్మారి మరింత కుంగదీస్తున్నది. ప్రస్తుతం భారత్‌దీ ఇదే పరిస్థితి. దీంతో మాంద్యం ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్దీపనలకు వేళైందని సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం కట్టడి.. తయారీ రంగ వృద్ధి.. సులభతర వ్యాపార నిర్వహణ.. వినియోగ సామర్థ్యం పెంపులపై దృష్టి సారించి ఆర్థిక, ద్రవ్యపరమైన ఉద్దీపనలు అందించాల్సిన అవసరం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వెంటనే రంగంలోకి దిగాలంటున్నారు.

పరిశ్రమకు చేయూత

స్తంభించిన పెట్టుబడులు.. మందగించిన తయా రీ.. నీరసించిన వ్యాపారం.. పడిపోయిన విని మయ సామర్థ్యం.. తరిగిన ఆదాయం.. పెరిగిన నష్టాలు ఇదీ.. నేటి భారతీయ ఆర్థిక ముఖచిత్రం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కరోనా వైరస్‌.. దేశానికి ముచ్చెమటల్నే పట్టిస్తున్నది. ప్రజలు బయటకు రాలేని దుస్థితి నెలకొంటున్నది. ఫలితంగా కొనుగోళ్లు లేక అన్ని వ్యాపారాలు దిగాలుపడ్డాయి. దీంతో జీడీపీ మరింత దిగజారే ప్రమా దం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడేం డ్ల కనిష్ఠాన్ని తాకుతూ ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో జీడీపీ 4.7 శాతానికి పరిమితమైన విషయం తెలిసిందే. అందుకే ఇక ఉద్దీపనలకు ఉపక్రమించాలని కేంద్రానికి సూచిస్తున్నారు.

ఎలాంటి ఉద్దీపనలు కావాలి?

పడకేసిన పారిశ్రామికోత్పత్తిని పరుగులు పెట్టించేలా నిర్ణయాలుండాలి. కరోనా వైరస్‌ దెబ్బకు అంతర్జాతీయ సంబంధాలన్నీ దాదాపుగా తెగిపోయాయి. దీంతో ఇతర దేశాల నుంచి ముడి సరుకు దిగుమతులు నిలిచిపోయాయి. అందుకే దేశీయ వనరులను బలోపేతం చేసుకోవాలని ఆర్థిక, పారిశ్రామిక నిపుణులు సూచిస్తున్నారు. తదనుగుణంగా పరిశ్రమలకు సహకరించాలంటున్నారు. ఆగిపోయిన దిగుమతులతో ఏయే రంగాలు ప్రభావితమైయ్యా యో.. ఆయా రంగాల్లో ఉత్పత్తి పుంజుకునే మార్గాలను తొలుత అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొంటే దిగుమతులపై సుంకాల భారం తగ్గించాలని, అవకాశమున్న రంగాల్లో పెట్టుబడులకు స్వేచ్ఛనివ్వాలని పేర్కొంటున్నారు.

బ్యాంకింగ్‌ రుణాలు

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో హోటల్‌, విమానయానం, రవాణా, మెటల్‌, ఆటో విడిభాగాల రంగాలు కుదేలయ్యాయి. దీంతో వీటికి రుణ పునర్‌వ్యవస్థీకరణ సదుపాయం, చౌకగా కొత్త రుణాల మంజూరు వంటి వాటితో ఊతమివ్వాలని ఎస్బీఐ రిసెర్చ్‌ ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఉద్యోగులకు జీతభత్యాలను చెల్లించలేని సంస్థలకు ఆర్థిక దన్ను ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నారు. వారిపై భారం పడకుండా అండగా ఉండాలంటున్నారు.

వినియోగ సామర్థ్యం పెంచాలి

వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం పెరిగినప్పుడే మార్కెట్‌ సజీవంగా ఉంటుంది. కాబట్టి మందగించిన వినిమయ సామర్థ్యాన్ని తిరిగి పుంజుకునేలా చేయాలని కూడా నిపుణుల సూచన. అందుకు వారి చేతుల్లోకి మరింత నగదు చేరేలా నిర్ణయాలు తీసుకోవాలని, బ్యాంకులు, ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయం అందేలా ప్రోత్సహించాలని చెప్తున్నారు. ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలు ఇందుకు దోహదపడుతాయని, ఆకర్షణీయమైన వడ్డీరేట్లతో వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక ఆఫర్లను పెడుతున్నారని.. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ చర్యలు కలిసివస్తే కళ తప్పిన మార్కెట్‌లో వెలుగులు తథ్యమంటున్నారు. 

అమెరికా 850 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీ?

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లుతున్న నష్టాలను పూడ్చేందుకు ఆయా దేశాలు భారీగా ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. అమెరికా 850 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీకి సిద్ధమవుతుండగా, జర్మనీ 610 బిలియన్‌ డాలర్లు, బ్రిటన్‌ 35 బిలియన్‌ డాలర్లు, యూఏఈ 27.2 బిలియన్‌ డాలర్లు, ఫ్రాన్స్‌ 17.6 బిలియన్‌ డాలర్లు, సౌదీ 13.3 బిలియన్‌ డాలర్లు, స్విట్జర్లాండ్‌ 10.5 బిలియన్‌ డాలర్లు, ఈజిప్టు 6.4 బిలియన్‌ డాలర్లు, జపాన్‌ 4.1 బిలియన్‌ డాలర్లు  తమ దేశ ఆర్థిక వ్యవస్థల కోసం ప్యాకేజీలు ఇస్తున్నాయి. 2008 నాటి మాంద్యం పరిస్థితులకు మించిన నష్టం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కరోనా కారణంగా ఎదుర్కోబోతున్నదన్న అంచనాలున్నాయి.


logo