ఆదివారం 29 మార్చి 2020
Business - Feb 11, 2020 , 23:55:38

కరోనాతో మొబైల్‌ విలవిల

కరోనాతో మొబైల్‌ విలవిల
  • చైనా విడిభాగాల సరఫరాపై వైరస్‌ ప్రభావం
  • దేశీయంగా ఉత్పత్తికి అంతరాయం

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఫిబ్రవరి 11: దేశీయ స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమను కరోనా వైరస్‌ భయాలు వెంటాడుతున్నాయి. చైనాలో విజృంభిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి దెబ్బకు అక్కడి వ్యాపార, పారిశ్రామిక రంగాలు మూతబడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్పాదక రంగం స్తంభించిపోయింది. ఇదిప్పుడు స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాల సరఫరాను ప్రభావితం చేస్తున్నది. దీంతో మూతబడిన కర్మాగారాలు ఎప్పుడు తెరుచుకుంటాయా?.. సరఫరా ఎప్పుడు మెరుగవుతుందా?.. అని భారతీయ స్మార్ట్‌ఫోన్‌ ఇండస్ట్రీ ఎదురుచూస్తున్నది. ‘పరిశ్రమపై కరోనా ప్రభావం కనిపిస్తున్నది. కొన్ని ఉత్పత్తులు, మోడల్స్‌పై కరోనా దెబ్బ స్పష్టంగా కనిపిస్తున్నది’ అని భారతీయ సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రు మంగళవారం పీటీఐకి తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, చైనా నుంచే స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాలు అత్యధికంగా భారతీయ మార్కెట్‌కు వస్తాయని, దీంతో కరోనా ప్రభావం తప్పక ఉంటుందని చెప్పారు.


మెజారిటీ సంస్థలు చైనావే

భారతీయ మొబైల్‌ మార్కెట్‌లో చైనా సంస్థలదే ఆధిపత్యం. షియామీ, ఒప్పో, వివో, రియల్‌మీ, పోకో ఇలా ప్రస్తుతం మార్కెట్‌లో అత్యధిక అమ్మకాలను సాధిస్తున్న సంస్థలన్నీ చైనావే. వీటి ధాటికి సామ్‌సంగ్‌, సోనీ, ఎల్‌జీ, నోకియా ఇలాంటి ప్రధాన సంస్థలెన్నో వెనుకబడ్డాయి. తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. ఈ రెండే చైనా సంస్థల మంత్రం. అందుకే కొనుగోలుదారులు చైనా ఫోన్లకు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. అయితే కరోనా దెబ్బకు చైనా పరిశ్రమలు కుప్పకూలాయి. దీంతో అక్కడి తయారీ దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా భారతీయ మార్కెట్‌లోకీ కొత్త స్మార్ట్‌ఫోన్ల రాక తగ్గిపోయింది. ఇప్పుడున్న మోడల్స్‌ తయారీ కూడా గగనమైపోతున్నదని నిపుణులు అంటున్నారు. మరోవైపు తాజా పరిస్థితులపై, ముఖ్యంగా సరఫరాపై షియామీ, ఒప్పో, వివో, రియల్‌మీ, పోకోలను ప్రశ్నించగా.. సమాధానం రాలేదు. కాగా, చైనా స్మార్ట్‌ఫోన్‌ విడిభాగాల తయారీ దిగ్గజ సంస్థ ఒకటి తమ ప్లాంట్లలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కొంతమందితోనే పాక్షికంగా ఈ తయారీ మొదలైందని సమాచారం.


ఎండబ్ల్యూసీకి దెబ్బ

ఈ నెల 24 నుంచి 27 వరకు బార్సిలోనాలో జరుగనున్న మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (ఎండబ్ల్యూసీ)కూ కరోనా దెబ్బ తగులుతున్నది. ఎరిక్సన్‌, అమెజాన్‌, సోనీ, ఇంటెల్‌, వివో తదితర సంస్థలు ఎండబ్ల్యూసీ నుంచి తప్పుకున్నాయి. నిజానికి ఏటా ఈ సమావేశాలకు లక్షకుపైగానే ప్రతినిధులు ప్రపంచ దేశాల నుంచి హాజరవుతారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. చైనాలో కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటిదాకా 1,016 మంది చనిపోగా, మరో 42,638 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇతర దేశాల్లోనూ ఈ వైరస్‌ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.


వారం గడిస్తేగాని చెప్పలేం..

మరో వారం గడిస్తేగాని మొబైల్‌ పరిశ్రమపై కరోనా వైరస్‌ ఎంతమేర ప్రభావం చూపనున్నదో తెలుస్తుంది. ఇక్కడ అసెంబ్లింగ్‌ చేస్తున్నప్పటికీ విడిభాగాలపై మాత్రం అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.. ఇలాగే కొనసాగితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ కొరత 20 శాతం నుంచి 30 శాతం వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. చైనాలో సెలవుల నేపథ్యంలో అడ్వాన్స్‌గా పరికరాలను తయారు చేయడం వల్ల ఇప్పటి వరకైతే కొరత లేదు. 

- బాలు చౌదరీ, బిగ్‌"సి’ వ్యవస్థాపక చైర్మన్‌


మూతపడనున్న పరిశ్రమలు!

మొబైల్‌ తయారీలో కీలక విడిభాగాలైన ఎల్‌సీడీ డిస్‌ప్లే, ప్యానెళ్లు, స్పీకరుల, ఫింగర్‌ప్రింట్‌లు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో వీటిలో ఏ ఒక్కటి లేకపోయిన మొబైల్‌ తయారుకాదు. దీంతో చేసేదేమి లేకపోవడంతో దేశీయ తయారీ సంస్థలు తమ ప్లాంట్లను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సామ్‌సంగ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, ఇతర సంస్థలైన ఒప్పో, వివో, వన్‌ప్లస్‌, షియోమీలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. 

 - వై గురు, సెల్‌కాన్‌ సీఎండీ


మార్చిలో కొరత తీవ్రతరం..

ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మొబైళ్లకు కొరత లేకపోయినప్పటికీ వచ్చే నెలలో మాత్రం కొరత అధికంగా ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల చివరి వరకు స్టాక్‌ ఉండటం సానుకూల అంశం.  కరోనా వైరస్‌ బట్టబయలైన చైనా పారిశ్రామిక క్లస్టర్‌లోనే మొబైల్‌ ఎల్‌సీడీ విడిభాగాలు తయారుకావడం ఈ ప్రభావం ఎలా ఉంటుందో ముందే చెప్పడం కష్టం. ఈ వైరస్‌ దెబ్బతో మొబైళ్లకు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది తప్పా ధరలు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. 

- కృష్ణ పవన్‌, హ్యపీ మొబైల్‌  సీఎండీ


logo