ఆదివారం 29 మార్చి 2020
Business - Mar 22, 2020 , 23:32:53

వాహన ఉత్పత్తికి బ్రేక్‌

వాహన ఉత్పత్తికి బ్రేక్‌

-మారుతి, మహీంద్రా, హీరో, హోండా కార్స్‌, ఫియట్‌ నిర్ణయం

-ఆటోమొబైల్‌ రంగంపై కరోనా ప్రభావం

న్యూఢిల్లీ, మార్చి 22:కరోనా వైరస్‌ ఉధృతి రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అంతటా అప్రమత్తత నెలకొంటున్నది. వ్యాపార, పారిశ్రామిక రంగాలూ కరోనా కట్టడి చర్యలు తీసుకుంటుండగా, పలు ఆటో రంగ సంస్థలు ఆదివారం నుంచి తమ ఉత్పత్తికి విరామం ప్రకటించాయి. దేశీయ ఆటో రంగ దిగ్గజాలు మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్‌లతోపాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫియట్‌ సంస్థలు లాక్‌డౌన్‌ దిశగా నిర్ణయాలు తీసుకున్నాయి.

మారుతి సుజుకీ

హర్యానాలోని మనేసర్‌, గురుగ్రామ్‌లలోని ప్లాంట్లను తక్షణమే మూసివేస్తున్నట్లు మారుతి స్పష్టం చేసింది. ఉత్పత్తి, ఇతరత్రా ఆఫీసు కార్యకలాపాలను ఆపేస్తున్నామని తెలిపింది. రోహ్తక్‌లోని రిసెర్చ్‌, డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కూడా మూతబడింది. వీటిని తిరిగి ఎప్పుడు తెరుస్తామన్నది ప్రభుత్వ విధానాలపైనే ఆధారపడి ఉందని మారుతి తెలియజేసింది.


హీరో మోటోకార్ప్‌

ఈ నెలాఖరుదాకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అన్ని ఉత్పాదక కేంద్రాల్లో వాహన తయారీని ఆపేస్తున్నట్లు దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ ప్రకటించింది. భారత్‌తోపాటు కొలంబియా, బంగ్లాదేశ్‌ తదితర చోట్ల హీరోకు ప్లాంట్లున్నాయి. ఇక నీమ్రానాలోని గ్లోబల్‌ పార్ట్స్‌ సెంటర్‌నూ మూసేస్తున్నామని, కొందరు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటును కల్పిస్తున్నామని చెప్పింది.  


మహీంద్రా అండ్‌ మహీంద్రా

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో నాగ్‌పూర్‌ ప్లాంట్‌ను తక్షణమే మూసేస్తున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రకటించింది. పుణె, ముంబై ప్లాంట్లను సోమవారం రాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నామని, వైరస్‌ తీవ్రత దృష్ట్యానే మహారాష్ట్రలోని ప్లాంట్లలో ఉత్పత్తికి విరామం ఇస్తున్నామని చెప్పింది. ఈ మహమ్మారి తీవ్రత ఇలాగే ఉంటే దేశంలోని మిగతా ప్లాంట్లనూ ఆపేస్తామన్నది.


హోండా కార్స్‌

హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ సైతం దేశంలోని తమ రెండు తయారీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి 31దాకా గ్రేటర్‌ నోయిడా (ఉత్తర ప్రదేశ్‌), తపుకర (రాజస్థాన్‌)ల్లోని ప్లాంట్లలో ఉత్పత్తిని ఆపేస్తున్నామని చెప్పింది. తిరిగి ఉత్పత్తి ఏప్రిల్‌ 1 నుంచి మొదలు కాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన హోండా.. ప్రభుత్వ నిర్ణయాలపైనే ఇది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, కార్పొరేట్‌ ఆఫీసులు, జోనల్‌, రీజినల్‌ కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసుకునే వీలును కల్పించామని తెలిపింది. 


ఫియట్‌ క్రిస్లర్‌

ఫియట్‌ క్రిస్లర్‌ ఆటోమొబైల్స్‌ కూడా భారత్‌లో తమ ఉత్పాదక కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. రంజన్‌గావ్‌ ప్లాంట్‌లో ఉత్పత్తిని 31 వరకు ఆపేస్తున్నామని తెలియజేసింది. ఉద్యోగుల రక్షణ దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. పుణెలో వైరస్‌ కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతుండటంపై సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 


మా రిసార్టులను రోగులకు వాడండి

‘వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ దృష్ట్యా అన్ని రంగాలను లాక్‌డౌన్‌ చేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి మూడో దశకు సమీపించిందన్న వార్తలు ఆందోళనకరం. ప్రాణ నష్టం పెరుగవచ్చన్న భయాలు వైద్య నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మహీంద్రా హాలిడేస్‌ రిసార్టులను రోగులకు సేవా కేంద్రాలుగా వినియోగించండి. అలాగే చిరు వ్యాపారులు, స్వయం ఉపాధితో బ్రతుకుతున్న  పేదల కోసం మహీంద్రా ఫౌండేషన్‌ ఓ నిధిని ఏర్పాటు చేయనుంది. దీనికి నా జీతాన్ని పూర్తిగా విరాళంగా ఇస్తున్నాను’          - మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా


logo