గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 01, 2020 , 14:22:50

కుబేరులకూ కరోనా సెగ

కుబేరులకూ కరోనా సెగ
  • కుదేలైన టాప్‌ 500 మంది
  • గత వారం 32 లక్షల కోట్లు ఆవిరి
  • కరోనా దెబ్బకు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు విలవిల

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 29: ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల పతనం.. అపర కుబేరుల సంపదను ఆవిరి చేస్తున్నది. కరోనా వైరస్‌ దెబ్బకు అన్ని దేశాల సూచీలు విలవిలలాడిపోతుండగా, గడిచిన వారం రోజుల్లో టాప్‌-500 ప్రపంచ సంపన్నుల సంపద రూ.32 లక్షల కోట్లపైనే హరించుకుపోయింది. 444 బిలియన్‌ డాలర్లు (డాలర్‌తో పోల్చితే ప్రస్తుత రూపాయి మారకం విలువ ప్రకారం రూ.32,04,792 కోట్లు) నష్టపోయినట్లు తేలింది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆసియా మార్కెట్లన్నీ నష్టాలకే పరిమితం కావడంతో షేర్లన్నీ కుప్పకూలాయి. ప్రపంచ టాప్‌-10 శ్రీమంతులకు వాటిల్లిన నష్టం విలువే దాదాపు రూ.6 లక్షల కోట్లుగా ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపద గత వారం సుమారు రూ.86 వేల కోట్లు పడిపోయింది.


 టాప్‌-500 బిలియనీర్లకు ఈ ఏడాది ఆరంభం నుంచి 78 బిలియన్‌ డాలర్ల లాభాలు రాగా, ఒక్క వారంలోనే 444 బిలియన్‌ డాలర్లు పోయాయని బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ గుర్తుచేస్తున్నది. కేవలం గత ఐదు రోజుల్లో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ డౌ జోన్స్‌ సగటున 12 శాతానికిపైగా క్షీణించింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం నాటి నుంచి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే. దీని ప్రభావంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు ఏకంగా 6 లక్షల కోట్ల డాలర్ల నష్టాలను చవిచూశాయి. భారతీయ స్టాక్‌ మార్కెట్లకూ భారీ నష్టాలు సంభవిస్తుండగా, శుక్రవారం ఒక్కరోజే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 1,448 పాయిం ట్లు, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 432 పాయింట్లు కోల్పోయాయి. దీంతో రూ.5.45 లక్షల కోట్ల మదుపరుల సంపద కరిగిపోయింది. ఇక గత వారం రోజుల్లో సుమారు రూ.12 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ తరిగిపోయింది.logo
>>>>>>