బుధవారం 03 జూన్ 2020
Business - Apr 13, 2020 , 00:27:32

కరోనా దెబ్బకు జీడీపీ ఢమాల్‌

కరోనా దెబ్బకు జీడీపీ ఢమాల్‌

  • ఈ ఆర్థిక సంవత్సరం 1.5-2.8 శాతం మధ్యే
  • గత 30 ఏండ్లలో ఇదే అత్యల్పం
  • తాజా నివేదికలో ప్రపంచ బ్యాంకు అంచనా

(ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ):భారత ఆర్థిక వృద్ధిరేటుపై కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 1.5 శాతం నుంచి 2.8 శాతం మేరకు నమోదుకావచ్చని పేర్కొన్నది. 1991లో ఆర్థిక సరళీకరణ మొదలైన తర్వాత భారత్‌లో అత్యల్ప వృద్ధిరేటు ఇదేనని ఆదివారం విడుదల చేసిన ‘సౌత్‌ ఏషియా ఎకనమిక్‌ ఫోకస్‌ రిపోర్ట్‌'లో ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత ఆర్థిక వృద్ధిరేటు 4.8 శాతం నుంచి 5 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేసింది. గతేడాది అక్టోబర్‌లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసిన వృద్ధిరేటు కంటే ఇది 1.2-1 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. ఆర్థిక రంగంలో నెలకొన్న బలహీనతల వల్ల భారత వృద్ధిరేటు ఇప్పటికే మందగమనంలో కొనసాగుతున్నదని, ఇలాంటి తరుణంలో కొవిడ్‌-19 మహమ్మారి విజృంభించడం దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత పెద్ద గుదిబండలా మారిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొన్నది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అనేక కర్మాగారాలు, వ్యాపారాలు మూతపడ్డాయి. విమాన, రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలు స్తంభించిపోవడం వల్ల సరు కు రవాణా గణనీయంగా తగ్గడం, సరఫరా, డిమాండ్‌ భారీగా తగ్గిపోవడంతో ఈ ఏడాది వృద్ధిరేటు మరింత దిగజారుతుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. ముఖ్యంగా సేవల రంగానికి తీవ్ర నష్టం వాటిల్లవచ్చని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతల వల్ల దేశీయ పెట్టుబడుల్లో జాప్యం జరుగవచ్చని తెలిపింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ వృద్ధిరేటు 5 శాతానికి పుంజుకోవచ్చని, అప్పటికి కొవిడ్‌-19 ప్రభా వం పూర్తిగా తగ్గిపోతుందని అభిప్రాయపడింది. కాగా, ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 4 శాతానికి క్షీణిస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు, 2 శాతానికి పతనమవుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌, 3.5 శాతానికి దిగజారు తుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌, 3.6 శాతానికి తగ్గుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌, 2.5 శాతానికి పతనమవు తుందని మూడీస్‌ ప్రకటించాయి.

40 ఏండ్ల కనిష్ఠానికి దక్షిణాసియా వృద్ధిరేటు

కరోనా కాటుతో దక్షిణాసియా ఆర్థిక పరిస్థితి క్షీణించే ప్రమాదమున్నదని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దక్షిణాసియా జీడీపీ వృద్ధిరేటు కేవలం 1.8 నుంచి 2.8 శాతం మధ్యే పరిమితం కావచ్చని అంచనా వేసింది. గత 40 ఏండ్లలో ఇదే అత్యల్ప వృద్ధిరేటని తెలిపింది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, మాల్దీవులు ఉన్నాయి. ఈ ఏడాది దక్షిణాసియా జీడీపీ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండవచ్చని గతేడాది అక్టోబర్‌లో అంచనా వేసింది. కానీ కరోనా సంక్షోభం ముంచుకురావడంతో ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు తన అంచనాను గణనీయంగా కుదించింది. ఈసారి చైనా జీడీపీ కూడా దారుణంగా క్షీణిస్తుందని పేర్కొన్నది. ప్రపంచ జీడీపీలో 16 శాతంగా ఉన్న చైనా వాటా ఇప్పటికే 6 శాతానికి పడిపోయింది. మున్ముందు ఇది 5 శాతానికి దిగజారుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

నేడు తెలంగాణ బాండ్ల వేలం?

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అత్యంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. నిధుల సమీకరణ ద్వారా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు, ఇతర అత్యవసర కార్యక్రమాలకు విఘాతం కలుగకుండా చూసేందుకు పక్కా వ్యూహం తో ముందుకు సాగుతున్నది. బాండ్ల వేలం ద్వారా తొలుత బహిరంగ మార్కెట్ల నుంచి రూ.2 వేల కోట్ల రుణాలను తీసుకోనున్నది. ఈ బాండ్లను రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్వారా సోమవారం వేలానికిపెట్టే అవకాశమున్నది. వాస్తవానికి  ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఎఫ్‌ఆర్‌బీఎం) ప్రకారం మన రాష్ట్ర సంపదలో 3.25 శాతం వరకు రుణాలు తీసుకునే అవకాశమున్నది. ప్రస్తుతం మన రాష్ట్ర సంపద రూ.9.5 లక్షల కోట్ల వరకు ఉండటంతో దశలవారీగా దాదాపు రూ.31 వేల కోట్ల వరకు రుణాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం కనీవిని ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 5 శాతం వరకు పెంచాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే. దీనికి కేంద్రం అంగీకరిస్తే మన రాష్ట్రం మరో రూ.20 వేల కోట్ల మేరకు రుణాలు తీసుకునే అవకాశముంటుంది.

లాక్‌డౌన్‌ ఎక్కువకాలం కొనసాగితే..

లాక్‌డౌన్‌ ఎక్కువ కాలం కొనసాగితే భారత జీడీపీ వృద్ధిరేటు మా అంచనాల కంటే మరింత దిగజారవచ్చు. ప్రస్తుతానికి భారత ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంపైనే దృష్టిసారించాలి. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొనేందుకు దోహదపడే చర్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలి. తాత్కాలికంగా ఉద్యోగాలు కల్పించడం లాంటి ప్రయత్నాలు భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. దీంతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడకుండా ప్రభుత్వం జాగ్రత్తపడాలి. దీర్ఘకాలంలో భారత్‌ను ఆర్థికంగా, సామాజికంగా సుస్థిరమైన మార్గంలో పెట్టేందుకు ఇది మంచి అవకాశం.          

- హాన్స్‌ టిమ్మర్‌, ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త (దక్షిణాసియా)


logo