శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 11, 2020 , 02:15:32

కరోనా కవచాలు రెడీ

కరోనా కవచాలు రెడీ

  • ప్రీమియం రూ.447-5,630 
  •  ప్రారంభించిన 29 బీమా సంస్థలు

న్యూఢిల్లీ, జూలై 10: స్వల్పకాలిక కరోనా కవచ్‌ ఆరోగ్య బీమా పాలసీని 29 జనరల్‌, ఆరోగ్య బీమా సంస్థలు శుక్రవారం ప్రారంభించాయి. కరోనా వైరస్‌ చికిత్స ఖర్చులు బాధితులకు భారం కాకుండా ఈ పాలసీలను రూపొందించారు. ప్రీమియం శ్రేణి రూ.447-5,630గా ఉన్నది. జీఎస్టీ అదనమని బీమా సంస్థలు పేర్కొన్నాయి. దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 10లోగా పాలసీని అం దుబాటులోకి తేవాలని బీమా రంగ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ, నేషనల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌, మ్యాక్స్‌ బూపా, టాటా, భారతీ, ఓరియంటల్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తదితర సంస్థలు కరోనా కవచ్‌ పాలసీని ప్రకటించాయి. మూడున్నర నెలలు, ఆరున్నర నెలలు, తొమ్మిదిన్నర నెలల కాలవ్యవధితో ఈ పాలసీలను బీమా కంపెనీలు విక్రయిస్తాయి. కనీస బీమా రూ.50 వేలు, గరిష్ఠ బీమా రూ.5 లక్షలు (రూ.50 వేల చొప్పున)గా ఉన్నది. ఆన్‌లైన్‌లోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ పాలసీల ప్రీమియం దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుంది.

‘బీమా కవరేజీ ఆధారంగా ప్రీమియం ధర కనిష్ఠంగా రూ.447, గరిష్ఠంగా రూ.5,630గా ఉన్నది. వీటికి వస్తు, సేవల పన్ను అదనం. వ్యక్తుల వయసు, కాలపరిమితి ఆధారంగా కూడా ప్రీమియంలలో మార్పులుంటాయి. ఉదాహరణకు 35 ఏండ్లలోపు వయసున్నవారు మూడున్నర నెలలకుగాను రూ.50 వేల పాలసీని తీసుకుంటే ప్రీమి యం రూ.447గా ఉంటుంది. అలాగే ఆస్పత్రి డైలీ క్యాష్‌ సదుపాయం కోసం ప్రీమియం రూ.3 నుంచి 620గా ఉంటుంది’-బజాజ్‌ అలియాంజ్‌ 

జనరల్‌ ఇన్సూరెన్స్‌

‘31-55 ఏండ్ల వయసువారు రూ.2.5 లక్షల బీమా కవరేజీని తీసుకుంటే ప్రీమియం దాదాపు రూ.2,200లుగా ఉంటుంది. ఇదే వయసువారిలో ఇద్దరు పెద్దలు, పిల్లలు ఉంటే ప్రీమియం సుమారు రూ.4,700లుగా ఉంటుంది. దేశంలో కొవిడ్‌-19 కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఆరోగ్య బీమాకు ప్రాధాన్యం ఏర్పడింది. నిజానికి గడిచిన దశాబ్ద కాలంగా ఆరోగ్య బీమాకు అంతా పెద్దపీట వేస్తున్నారు’. -మ్యాక్స్‌ బూపా ఆరోగ్య బీమా

‘14 రోజుల క్వారంటైన్‌లో భాగంగా ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్న ఖర్చులనూ మా పాలసీలో పొందవచ్చు. ఆయుర్వేద, యోగా, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి (ఆయుష్‌) చికిత్సలు, ఔషధాల వ్యయాన్నీ బాధితులకు అందిస్తాం. ప్రభుత్వ అధీకృత డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో పాజిటివ్‌ అని తేలి ఆస్పత్రుల్లో చేరినవారి వైద్య ఖర్చులు పాలసీలో వర్తిస్తాయి. కరోనా వైరస్‌ చికిత్స తీసుకుంటున్న రోగులకు ఇచ్చే ఇతర అనారోగ్య చికిత్సలకూ పాలసీలో కవరేజీ ఉంటుంది. ఆస్పత్రికి వెళ్లేందుకు అవసరమైతే అంబులెన్స్‌ సేవలకూ చెల్లిస్తాం’ -హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోlogo