శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 23, 2020 , 00:54:55

బజారంతా.. బేజారు

బజారంతా.. బేజారు

  • వినియోగ సామర్థ్యంపై కరోనా దెబ్బ
  • కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం
  • చౌక వస్తువులకే గిరాకీ
  • లగ్జరీ ఉత్పత్తులకు లేని డిమాండ్‌

సందీప్‌ వయసు 34 ఏండ్లు. ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగి. నెలకు రూ.50వేలపైనే సంపాదిస్తాడు. ఇంటి ఖర్చులుపోను ఇంకా మిగిలేది ఎక్కువే. బ్రాండెడ్‌ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇస్తాడు. అందుకే నచ్చిన వస్తువును ఎంతైనా పెట్టి కొనేస్తాడు. 

అయితే కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో ఇప్పుడు ఈ దూకుడుకు బ్రేక్‌ పడింది. ఉద్యోగం, ఆదాయంపై దిగులు పెరిగింది. ఏది కొనాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు. ఎంతో అవసరం ఉంటేగానీ జేబులో నుంచి డబ్బులు తీయడం లేదు. పైగా ధర తక్కువగా ఉన్న వస్తువులనే చూస్తున్నాడు. 

కరోనా మహమ్మారి దెబ్బకు ఒక్క సందీప్‌దే కాదు..  చాలామందిదీ ఇప్పుడు ఇదే పరిస్థితి. మొబైల్‌ ఫోన్లు, టీవీల దగ్గర్నుంచి.. బైకులు, కార్లు, ఇండ్లదాకా అన్ని కొనుగోళ్లను వాయిదా వేసేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలేకాదు.. సంపన్న వర్గాలూ ఖర్చులపై ఓ కన్నేస్తున్నారిప్పుడు. 

ఈ పరిణామం అన్ని రంగాలను ప్రభావితం చేస్తుండగా.. దేశ ఆర్థిక ప్రగతి చక్రాలనే కూలదోస్తున్నది. వ్యక్తిగత, సంస్థాగత ఆదాయాలు పడిపోయి యావత్‌ దేశాభివృద్ధే ప్రమాదంలో పడుతున్నది.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22: చేతిలో పనిలేదు.. జేబులో పైసల్లేవు.. ఏం కొనేది.. ఏం తినేది.. సగటు భారతీయుడి ఆవేదన ఇది. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా మహమ్మారి.. భారత్‌నూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. కోటి ఆశలతో పరుగులు తీస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకనే ఈ వైరస్‌ విరిచేసింది. కనీసం మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లిన భారత వృద్ధి.. తిరిగి కోలుకోవడానికి చాలా కాలమే పడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కుదేలైన వినియోగ సామర్థ్యం ఇప్పుడప్పుడే పుంజుకునేలా లేదు. చౌక వస్తువుల కోసం అన్వేషణ.. కొనుగోళ్ల వాయిదా.. ఇవీ ఇప్పుడు మన మార్కెట్‌కు ఎదురవుతున్న సవాళ్లు. ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేకుండా అన్ని రంగాలపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రధానంగా చూస్తే..

హోల్‌సేల్‌-రిటైల్‌

హోల్‌సేల్‌-రిటైల్‌ మార్కెట్లపై కరోనా ప్రభావం పెద్ద ఎత్తునే కనిపిస్తున్నది. నిత్యావసరాల దుకాణాలు మినహా మిగతా అన్ని ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. కరోనా అనంతర కాలంలోనూ వీటికి డిమాండ్‌ ఉంటుందన్న భరోసా కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభావితమైన ప్రజల ఆదా యం.. వ్యాపార రంగాన్ని కళ తప్పేలా చేసింది. దీంతో అటు హోల్‌సేల్‌, ఇటు రిటైల్‌ మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది.

నిర్మాణ రంగం

కరోనా వైరస్‌.. నిర్మాణ రంగం కష్టాలను ఒక్కసారిగా పెంచేసింది. అసలే ఆర్థిక మందగమనంతో చితికిపోయిన రియల్‌ ఎస్టేట్‌.. కరోనా దెబ్బకు కోలుకోలేని విధంగా నష్టపోయింది. లాక్‌డౌన్‌ తర్వాత ఇండ్ల అమ్మకాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. పెద్ద మొత్తంతో కూడిన లావాదేవీలు కావడంతో కొనుగోళ్లకు ఎవరూ ముందుకు రాకపోవచ్చన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. 

లగ్జరీ బడ్జెట్‌..

పెండ్లిండ్లు ఇతర వేడుకలు సాదాసీదాగానే జరిగిపోనున్నాయి. సంపన్న కుటుంబాల్లోనూ అట్టహాసంగా సంబురాలు జరుపుకునే పరిస్థితులు ఇప్పుడు లేవని, ఖరీదైన ఆభరణాలు, వస్ర్తాల కొనుగోళ్లకు బ్రేక్‌ పడుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల క్యాటరింగ్‌ వ్యవస్థ నుంచి టూరిస్ట్‌ ఏజెన్సీల వరకు ప్రభావితం అవుతారని అంచనా వేస్తున్నారు. బంగారం, వజ్రాల పరిశ్రమ కూడా కొనుగోళ్లు లేక కళ తప్పుతుందని చెప్తున్నారు.

విమానయానం

విమానయాన రంగాన్ని కరోనా వైరస్‌ ఒక్కసారిగా కుప్పకూల్చింది. ఈ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల బతుకులు రోడ్డుమీదకొచ్చాయి. లగ్జరీ జీవితాన్ని గడిపిన వీరంతా ఒక్కసారిగా ఖర్చులను భారీగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ విమానయాన రంగాన్నే చూస్తే.. దాదాపు అన్ని సంస్థలు ఉద్యోగులకు జీతాల్లేని సెలవులను ప్రకటిస్తున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా ఈ రంగంపై ఆంక్షలు తొలగుతాయన్న ఆశలు కనిపించడం లేదు. 

ఆటో-ఎలక్ట్రానిక్‌

వాహన రంగంలో అమ్మకాలు దారుణంగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలు, లక్షలు ఖర్చు చేసి ఇప్పట్లో ప్రజలు బైకులు, కార్లు కొనే సాహసం చేయకపోవచ్చు. కొంతకాలం ఉన్నదాంట్లో సర్దుకుంటేనే మంచిదన్న భావన ప్రజల్లో కనిపిస్తున్నదని మార్కెట్‌ వర్గాలు చెప్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్లు, టెలివిజన్‌, రిఫ్రిజిరేటర్లు తదితర వస్తువుల అమ్మకాలూ పడిపోవచ్చని అంటున్నారు. ఇప్పటికే ఈ రంగాల్లో ఉత్పత్తి లేక ఉద్యోగ కోతలున్నాయి. 


logo