బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jul 22, 2020 , 00:18:21

దివాలా ముప్పు

దివాలా ముప్పు

  • కంపెనీలను చుట్టుముట్టిన కరోనా కష్టాలు 
  • ఆర్థిక ఇబ్బందులతో మూతబడే అవకాశాలు
  • సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, జూలై 21: కరోనా మహమ్మారి కంపెనీల ఊపిరినీ ఆపేస్తున్నది. ఆర్థిక ఇబ్బందుల మధ్య చాలా సంస్థలు దివాలా తీసే వీలుందని ఓ తాజా సర్వేలో తేలింది. సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో మార్కెట్‌ పరిస్థితులు మొత్తం తలకిందులయ్యాయని స్పష్టమైంది. ముఖ్యంగా ఈ సంక్షోభం వ్యాపారుల్లో అనైతికతనూ పెంచే ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందని మెజారిటీ ప్రతినిధులు అభిప్రాయపడటం గమనార్హం. మొత్తం 13వేల మందికిపైగా పాల్గొన్న ఈ సర్వేలో ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లోని 42 శాతం ప్రతినిధులు పెద్ద ఎత్తున కంపెనీలు దివాలా అంచున ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఉత్పత్తి నిలిచి, వ్యాపారం మందగించి పెట్టుబడుల అంచనాలు తారుమారయ్యాయని 50 శాతం మంది చెప్పారు.

ఇప్పట్లో కోలుకోలేం

ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు రెండు, మూడేైండ్లెనా పట్టవచ్చని సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్‌ ఇండియా అధిపతి విధు శేఖర్‌ అన్నారు. కరోనాకు ముందున్న పరిస్థితులు నెలకొనాలంటే ఇప్పట్లో సాధ్యం కాదన్నారు. లాక్‌డౌన్‌లతో వ్యాపారాలు స్తంభించి, పెట్టుబడులకు తావు లేకుండా పోయిందన్న శేఖర్‌.. ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు పడాలన్నారు. ఇక ఈ విపత్కర పరిస్థితుల్లో అమాయక మదుపరుల రక్షణ కోసం మార్కెట్‌ రెగ్యులేటర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపశమనం కావాలి

కరోనా వైరస్‌తో ప్రభావితమైన సంస్థలకు ఊరటనిచ్చే నిర్ణయాలను రెగ్యులేటర్లు తీసుకోవాలని ఈ సర్వేలో 81 శాతం మంది కోరారు. ఈ క్రమంలోనే ఆర్థిక ఫలితాల వెల్లడి, తదితర అంశాల్లో క్యాపిటల్‌ మార్కెట్‌ నియమ, నిబంధనలను తాత్కాలికంగా పక్కనబెట్టాలని 60 శాతం మంది అన్నారు. కాగా, రుణ భారం పెరిగి సంస్థల నిర్వహణ కష్టతరంగా మారినవారికి ప్రభుత్వాలే చేయూతనివ్వాలని ఇప్పటికే వ్యాపార, పారిశ్రామిక సంఘాలు కోరుతున్న విషయం తెలిసిందే. మెజారిటీ సంస్థలు దివాలా తీస్తే నిరుద్యోగం పెరిగిపోతుందని ఆర్థిక నిపుణులూ హెచ్చరిస్తున్నారు.

7.5 లక్షల సంస్థలు బంద్‌

గత నెలాఖరు నాటికి దేశంలో 7.45 లక్షలకుపైగా సంస్థలు మూతబడ్డాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నమోదిత సంస్థలు 20 లక్షలకుపైగా ఉన్నా.. నడుస్తున్నవి 12.15 లక్షలేనని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2,242 సంస్థలు నిద్రాణ స్థితిలో, 6,706 కంపెనీలు నగదు సమీకరణలో, 43,770 సంస్థలు మూసివేసే ప్రయత్నాల్లో ఉన్నాయని కార్పొరేట్‌ రంగంపై నెలసరి సమాచారంలో భాగంగా వివరించింది. అయితే జూన్‌లో 10,954 సంస్థలు కొత్తగా నమోదయ్యాయన్నది. కంపెనీల చట్టం, పరిమిత బాధ్యత భాగస్వామ్య చట్టాలను అమలు చేస్తున్నట్లు చెప్పింది.


logo