గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Dec 29, 2020 , 00:13:01

ఆఫీస్‌ స్పేస్‌కు కరోనా దెబ్బ

ఆఫీస్‌ స్పేస్‌కు కరోనా దెబ్బ

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో 44% డిమాండ్‌ డౌన్‌: జేఎల్‌ఎల్‌

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఆఫీస్‌ స్పేస్‌ లీజింగ్‌ గణనీయంగా క్షీణించి 25.82 మిలియన్‌ చదరపు అడుగులకు పడిపోయింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో చాలా కార్పొరేట్‌ కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను వాయిదా వేసుకోవడం, ఉద్యోగులతో ఇంటి నుంచే పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) చేయించుకోవడం ఇందుకు కారణమని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ఇండియా తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, బెంగళూరులో గతేడాది వివిధ కంపెనీలు 46.5 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయి. దీనితో పోలిస్తే ఈ ఏడాది డిమాండ్‌ 44 శాతం తగ్గినట్లు జేఎల్‌ఎల్‌ వెల్లడించింది. అయితే ఈసారి జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో 5.43 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉన్న ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌.. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో 52 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈ  ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ 8.8 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉన్నదని, కొవిడ్‌-19 కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఈ డిమాండ్‌ 3.32 మిలియన్‌ చదరపు అడుగులకు క్షీణించిందని జేఎల్‌ఎల్‌ వివరించింది.


VIDEOS

logo