శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Business - Jan 10, 2021 , 02:52:24

వంటింట్లోనూనె మంటలు!

వంటింట్లోనూనె మంటలు!

  • ఆయిల్‌ ధరలు మరో 10 శాతం పైకి
  • సరఫరా, ఉత్పత్తి వ్యయాలు పెరుగడమే కారణం
  • ఫ్రీడం ఆయిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్ర శేఖర్‌ రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 9: అసలే కరోనా కాలం. ఆపై ధరల పోటు. ఒకవైపు పెట్రోల్‌, మరోవైపు వంటనూనెలు భగభగమండుతుండటంతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.  మహమ్మారి కారణంగా ఆర్థికంగా దిగాలు పడిపోయిన సామాన్యుడిని వంటనూనెలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో వంటనూనె ధరలు 30 శాతానికి పైగా అధికమవగా.. వచ్చే రెండు నెలల్లో మరో 10 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని ఫ్రీడం వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్ర శేఖర్‌ రెడ్డి వెల్లడించారు.  ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్లో కంపెనీకి చెందిన సన్‌ ప్లవర్‌ వంటనూనె లీటర్‌ ధర రూ.130-140 మధ్యలో ఉండగా, భవిష్యత్తులో రూ.150కి చేరుకునే అవకాశాలున్నాయన్నారు. 

ధరల పెరుగుదలకు కారణాలు ఇవే..

వంటనూనెల ధరలు పెరుగడానికి సరఫరా వ్యవస్థ ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా మలేషియా, ఇండోనేషియా దేశాల్లో కార్మికుల కొరత కారణంగా పామాయిల్‌ దిగుమతి తగ్గిపోయింది. దీంతో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ధరలు పెరుగుతున్నాయని ఆయన విశ్లేషించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో నెలకు 1.10 లక్షల టన్నుల వంటనూనెను వాడుతుండగా, ఏటా 5 శాతం చొప్పున వినియోగం పెరుగుతున్నదని, అలాగే సగటుగా ఒక్కోక్కరు ఏడాదికి 16 కిలోల చొప్పున వినియోగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, కాకినాడ, కృష్ణపట్నం రేవుల వద్ద ఉన్న మూడు ప్రాసెసింగ్‌ యూనిట్లలో రోజుకు 1,300 టన్నుల సన్‌ ప్లవర్‌, 1,100 టన్నుల పామాయిల్‌ ప్రాసెసింగ్‌ జరుగుతున్నది. రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లలో 600 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు అమితంగా ఇష్టపడే వంటనూనెల బ్రాండ్‌గా ఫ్రీడమ్‌ హెల్లీ కుకింగ్‌ ఆయిల్‌ నిలిచింది.

VIDEOS

logo