మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 21, 2020 , 00:32:36

ప్రజల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

ప్రజల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

-జీడీపీలో ఒక శాతం ఇవ్వాలని సీఐఐ సూచన

-పన్నులు, వడ్డీరేట్లు తగ్గించాలని ప్రధానికి లేఖ

న్యూఢిల్లీ, మార్చి 20:కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను, పారిశ్రామికరంగాన్ని ఆదుకొనేందుకు పన్నులను, వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు రూ.2 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలను ప్రకటించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన మందగమనం, సరఫరాల వ్యవస్థలో తలెత్తిన సమస్యలతో వ్యాపారాలకు భారీ విఘాతం కలిగిందని, రియల్‌ ఎస్టేట్‌, పౌరవిమానయానం, పర్యాటకం, ఆతిథ్యం లాంటి రంగాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు జీడీపీలో 1 శాతం (రూ.2 లక్షల కోట్ల) మొత్తాన్ని ఆధార్‌ ఆధారిత ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ఆర్థిక ఉద్దీపనల రూపంలో అందజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని శుక్రవారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఐఐ విజ్ఞప్తి చేసింది. దేశంలోని ప్రతి పౌరునికి రూ.5 వేలు, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు రూ.10 వేల చొప్పున ఈ ఉద్దీపనలను అందజేయాలని సూచించింది. ‘ప్రజల్లో ఆర్థిక భయాలను తొలిగించాలన్న లక్ష్యంతో మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకం ద్వారా ప్రజలకు డబ్బు అందజేయగలిగితే నిజంగా వారికి ఎంతో మేలుచేసినట్టే. ముఖ్యంగా దీనివల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది’ అని బెనర్జీ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై వసూలు చేస్తున్న 10 శాతం పన్నును తొలిగించడంతోపాటు మొత్తం డివిడెండ్‌ పన్నును 25 శాతంగా ఖరారుచేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ప్రధానికి రాసిన లేఖలో సీఐఐ కోరింది. 


దేశాభివృద్ధికి కరోనా చీడ: ఫిక్కీ

80 శాతం కంపెనీల్లో తగ్గిన నగదు ప్రవాహం

కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) వ్యాప్తి వల్ల భారత్‌లో ప్రాణనష్టం చాలా తక్కువగా ఉన్నప్పటికీ దీని ప్రభావం దేశంలోని సగానికిపైగా కంపెనీల కార్యకలాపాలపై పడింది. దాదాపు 80 శాతం కంపెనీల్లో నగదు ప్రవాహం తగ్గినట్టు ఓ సర్వేలో వెల్లడైంది. కరోనా వైరస్‌ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను తీసుకొచ్చిందని, ఈ సవాళ్లు అటు డిమాండ్‌కు, ఇటు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని, ఈ సమస్యలతో దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పే అవకాశమున్నదని భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక వృద్ధిరేటులో దేశం ఇప్పటికే మందగమనాన్ని ఎదుర్కొంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2019-20) తృతీయ త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 4.7 శాతానికి పతనమై ఆరేండ్ల కనిష్ఠస్థాయికి దిగజారింది. ‘దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తొలి దశల్లోనే ఉన్నప్పటికీ దీని ప్రభావంతో తమ కార్యకలాపాలకు విఘాతం కలుగుతున్నట్టు 53 శాతం దేశీయ కంపెనీలు చెప్తున్నాయి. దాదాపు 80 శాతం కంపెనీల్లో నగదు ప్రవాహం తగ్గినట్టు స్పష్టమవుతున్నది. ఇంటరాక్టివ్‌ సెషన్లతోపాటు పారిశ్రామిక ప్రతినిధులపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వ్యాప్తి వల్ల వస్తు, సేవలకు డిమాండ్‌, వాటి సరఫరాలు తగ్గాయి. ఆర్థిక కార్యకలాపాలు మందగించి నగదు ప్రవాహం తగ్గడంతో వ్యాపార సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపులతోపాటు రుణాలు, వడ్డీ, పన్నుల చెల్లింపులపై ప్రభావం పడుతున్నది’ అని ఫిక్కీ వివరించింది.

ప్రభుత్వం, ఆర్బీఐ ఆదుకోవాలె

సంక్షోభం నుంచి ప్రజలను, వ్యాపార సంస్థలను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ద్రవ్యపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను 100 బేసిస్‌ పాయింట్ల మేరకు తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, పారిశ్రామికరంగానికి తోడ్పాటునందించాల్సిన అవసరమున్నదని ఫిక్కీ పేర్కొన్నది. పన్ను వసూళ్లు తగ్గినప్పటికీ పెట్టుబడుల వ్యయాన్ని ప్రభు త్వం కుదించుకోరాదని, రుణాల చెల్లింపును రీషెడ్యూల్‌ చేసేలా బ్యాంకులకు వెసులుబాటు కల్పించడంతోపాటు కొవిడ్‌ -19 దుష్ప్రభావం అధికంగా ఉన్న విమానయాన, ఆతిథ్యరంగాల్లాంటి వాటికి దివాలా చట్టాన్ని తాత్కాలికంగా కొంతకాలంపాటు సస్పెండ్‌ చేయాలని ఫిక్కీ సూచించింది. కరోనా ప్రభావం వల్ల వస్తు, సేవల సరఫరాలు తగ్గాయని, పరిస్థితి మరింత దిగజారే అవకాశమున్నదని తమ సర్వేలో 60 శాతం మందికిపైగా ప్రజలు అభిప్రాయపడ్డారని, పరిస్థితులు మళ్లీ సాధారణ స్థాయికి చేరేందుకు కనీసం మూడునెలలైనా పట్టవచ్చని దాదాపు 42 శాతం మంది చెప్పారని ఫిక్కీ తెలిపింది.


logo
>>>>>>