శనివారం 28 మార్చి 2020
Business - Feb 26, 2020 , 00:03:48

హైదరాబాద్‌లో సీఐఐ సెంటర్‌

హైదరాబాద్‌లో సీఐఐ సెంటర్‌
  • ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, స్టార్టప్‌ల కోసం ఏర్పాటు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ఉన్న స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి  హైదరాబాద్‌లో ప్రత్యేక సెంటర్‌ అందుబాటులోకి రాబోతున్నది. ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, స్టార్టప్‌ లక్ష్యంగా ఏర్పాటు కానున్న ఈ జాతీయ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), ఇన్ఫోసిస్‌ సహా-వ్యవస్థాపకుడు క్రిష్‌ గోపాలకృష్ణన్‌కు చెందిన ప్రతీక్ష ట్రస్ట్‌ సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్నది. నిధులు లేక సతమతమవుతున్న స్టార్టప్‌లకు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడంతోపాటు ఇతర అవసరాలను కూడా సీఐఐలో సభ్యత్వం ఉన్న 8 వేల మంది పారిశ్రామికవేత్తలు తీర్చేందుకు ఒక్క ప్లాట్‌ఫాం ఏర్పాటైంది. ఈ సెంటర్‌ ఏర్పాటునకు సంబంధించి విధివిధానాలు తుది దశకు చేరుకున్నాయని, ఏప్రిల్‌ నెలలో ప్రారంభించబోతున్నట్లు సీఐఐ స్టార్టప్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, యాక్సిలర్‌ వెంచర్స్‌ చైర్మన్‌ గోపాలకృష్ణన్‌ తెలిపారు. ప్రస్తుతానికి టీ-హబ్‌లోనే ఈ సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించిన ఆయన..ఆర్థికంగా సహాయ సహకారాలు, మార్కెట్‌లో వ్యూహాత్మకంగా అడుగులకు ఈ వేదిక సరైనదన్నారు. 


ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లకు కూడా అన్ని రకాల సేవలు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిక్ష ట్రస్ట్‌ రూ.7.5 కోట్ల మేర నిధులను ఖర్చు చేయనున్నది. టీ-హబ్‌తో కలిసి సీఐఐ తెలంగాణ-యంగ్‌ ఇండియన్స్‌ హైదరాబాద్‌ ఏర్పాటు చేసిన సీఐఐ స్టార్టప్‌ కనెక్ట్‌ కార్యక్రమంలోనే ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ..ఆర్థికంగా, ఇతర ఏదైన సహాయ సహకారాలు కావాల్సిన స్టార్టప్‌లకు ఈ సెంటర్‌ ప్రత్యేక వేదికని, సీఐఐలో సభ్యత్వం ఉన్నవారు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అన్ని రకాలుగా సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం టీ-హబ్‌లో ఉన్న ఈ సెంటర్‌ భవిష్యత్తులో రెండో టీ-హబ్‌ బిల్డింగ్‌కు మార్చనున్నట్లు చెప్పారు. 


రోజుకు రూ.100 లోపే..

20వ శతాబ్దంలోనూ భారత్‌లో రోజుకు రూ.100 కంటే తక్కువ సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారని క్రిష్‌ వ్యాఖ్యానించారు. దేశ జనాభాలో 65 శాతం మంది వంద రూపాయల కంటే తక్కువ సంపాదించి జీవితాన్ని కొనసాగిస్తున్నారని, వీరికి సమానమైన సమాజాన్ని నిర్మించాలంటే స్టార్టప్‌లు ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే భారత్‌లో ఉన్న 2 ట్రిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ప్రైవేట్‌ సంపన్నవర్గాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారని, ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. 


logo